వయసు 20 రూ.కోట్ల డీల్స్‌
close

తాజా వార్తలు

Updated : 06/07/2019 10:26 IST

వయసు 20 రూ.కోట్ల డీల్స్‌

మార్కెట్‌ షేర్‌

హైదరాబాద్‌ దోమల్‌గూడలోని ‘సావర్ట్‌‘ ఆఫీసు.. లోపలికి వెళ్తూనే పసుపుపచ్చ టీ షర్ట్‌, షార్ట్‌, సాధారణ చెప్పులు వేసుకున్న ఓ కుర్రాడు హడావిడిగా తిరుగుతున్నాడు. ఉద్యోగుల సందేహాలు తీరుస్తూ..ల్యాపీలో పని చేసుకుంటున్నాడు. ఆ ఇరవయ్యేళ్ల కుర్రాడి పేరు   సంకర్ష్‌ చందా. ఈ పిన్నవయస్కుడే ‘సావర్ట్‌‘ అనే స్టాక్‌ మార్కెట్‌ అడ్వైజరీ కంపెనీ సీఈఓ, ఫౌండర్‌! అందరూ సాఫ్ట్‌వేరు, ఇతర స్మార్ట్‌ రూట్స్‌లో వెళ్తోంటే..ఈ షేర్‌ మార్కెట్‌ లోకంలోకి ఎందుకొచ్చారని అడిగితే...సంకర్ష్‌ చందా చెప్పాడిలా..

సావర్ట్‌ అంటే.. సేవ్‌ఆర్ట్‌ అని అర్థం! ఇదో వెల్త్‌ అడ్వయిజరీ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌. షేర్‌మార్కెట్‌లో స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, బాండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో.. మేం పరిశోధించి.. సలహాలిస్తాం. మన దేశంలోని 29 రాష్ట్రాల్లోని కొందరు వ్యక్తులు, కొన్ని ప్రయివేట్‌ కంపెనీలు.. దీంతోపాటు 25 దేశాల్లోని ఇతర కంపెనీలు మా సలహాలు అందుకుంటున్నాయి. మీరు పదిరూపాయలు స్టాక్‌లో పెట్టి మంచి రిటర్నులు కావాలంటే.. మేం సలహా ఇస్తాం. అందుకు పర్సెంటేజీ తీసుకుంటాం. లాభాల్లో మూడుశాతం తీసుకుంటాం. అలాగని డీమ్యాట్‌ అకౌంట్‌ తీయించి పనిచేసే స్టాక్‌ బ్రోకర్స్‌ కాదు మేం. ఐసీఐసీఐ సెక్యూరిటీ, అబ్‌స్ట్రాక్స్‌ లాంటి పేరున్న బ్రోకర్స్‌తో మా భాగస్వామ్యముంది. స్టాక్‌లో ఏ సమయంలో ఇన్వెస్ట్‌ చేయాలి, ఎంత చేయాలనే దానిమీదే మా ఫోకస్‌. 2017 మేలో రిజిస్టర్‌ అయింది మా కంపెనీ. జనంలోకి వచ్చింది 2018 జూన్‌లో. ఈ సమయంలో వెబ్‌సైట్‌, అల్గారిథమ్స్‌, ఫండింగ్‌, పరిశోధన అన్నీ చేసుకున్నా.


 

మాకో వెబ్‌సైట్‌, యాండ్రాయిడ్‌ యాప్‌ ఉంది (ఐఓయస్‌ త్వరలో లాంచ్‌ చేస్తాం). హైదరాబాద్‌లో రెండు ఆఫీసులున్నాయి. వరంగల్‌, పుణెలోనూ మా బ్రాంచీలున్నాయి. త్వరలోనే విజయవాడ, వైజాగ్‌.. లాంటి చోట్ల ఫ్రాంచైజీలిస్తాం. ప్రస్తుతం నేను బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. నేనో యంగెస్ట్‌ స్టాక్‌ అడ్వయిజరీ సీఈఓని. వినియోగదారుల సంతృప్తే నా సక్సెస్‌గా భావిస్తా. ఒక వ్యక్తి.. తన పిల్లల చదువులు, వాళ్ల పెళ్ల్లిళ్లకు అప్పు తీసుకోకుండా.. స్టాక్‌లో పెట్టింది ఉపయోగపడితే.. నాకంతకంటే ఆనందం ఏముంటుందీ?. నేను యువతకి చెప్పేది ఒకటే సక్సెస్‌కి రెసిపీ, ఇంగ్రిడియెంట్స్‌ ఏమీ ఉండవు. సక్సెస్‌ అయినవాళ్లు వంద చేశామని చెబుతారు. అవేమీ వినకండి. మీకు ఇష్టమున్న పని చేయటమే మీ సక్సెస్‌!


ఏడో తరగతిలోనే...

నా వయసు ఇప్పుడు ఇరవయ్యేళ్లు. చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం. అలా బాల్యంలోనే.. ఆస్ట్రోఫిజిక్స్‌, నానోటెక్నాలజీలను కుతూహలంతో చదివా. దీంతోపాటు ఇంగ్లిషు కథలూ, నవలలూ చదివే అలవాటుంది. అలా ఏడోతరగతిలో ఉండగా స్టాక్‌మార్కెట్‌పై బెంజమిన్‌ గ్రాహం రాసిన ఓ ఆర్టికల్‌ను చదివా. బాగా నచ్చింది. మార్కెట్‌లో కొనటమేంటీ.. అమ్మటమేంటీ..?అనే ఆసక్తి నాలో పెరిగింది. వెంటనే మా అక్క దగ్గర ఉండే డీమ్యాట్‌ అకౌంట్ తీసుకున్నా. రాత్రికి రాత్రే స్టాక్స్‌లో డబ్బులు వస్తాయనే ఆశ ఉండేదప్పుడు. ఖర్చులకు నాన్న ఇచ్చే వెయ్యి రూపాయలనీ.., హుండీలోని డబ్బులను స్టాక్స్‌లో పెట్టా. ఒక్కో షేర్‌ పదిరూపాయలుంటే.. వెయ్యిరూపాయలకి ఏకంగా వంద షేర్లు వస్తాయనే ఆలోచన ఉండేది. దీంతో మార్కెట్‌లో చీపెస్ట్‌ కంపెనీలపై పెట్టుబడి పెట్టా. రెండునెలల్లో అంతా పోయింది. బాధపడ్డా. ఇది కాదు.. దీంట్లో ఏదో ఉందనుకున్నా. మెల్లగా మార్కెట్‌ను ఇష్టంతో స్టడీచేశా. మొదట ఓ సంస్థ సంవత్సర రిపోర్టును తీసి.. దాని పదేళ్ల చరిత్రనూ చూశా. నాకప్పుడో విషయం అర్థమైంది.. ‘మార్కెట్‌ మనకంటే పెద్దది.. మనకంటే స్మార్ట్‌.. మనకంటే ఫాస్ట్‌’ అని. ముందు మార్కెట్‌కి రెస్పెక్ట్‌ ఇవ్వాలనే విషయమర్థమైంది. నాకేం తెలియదో నాకు అర్థమయింది. పట్టినపట్టు విడవకుండా అలా స్టాక్స్‌లో ఓనమాలు నేర్చుకున్నా. నా అనుభవాలతోనే.. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ‘ఫైనాన్షియల్‌ నిర్వాణ’ అనే పేరుతో ఓ పుస్తకం రాసి ప్రచురించా.    ఆ చిన్నబుక్‌ మార్కెట్‌లోకి రావాలనుకునే బిగినర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది.సంవత్సరం పాటు పరిశోధించా!
అప్పటికే నేను..నానోటెక్నాలజీ, ఆస్ట్రోఫిజిక్స్‌ చదివా, సివిల్స్‌ రాద్దామనుకున్నా. అయితే వాటి పరిధులు ఎక్కువని తెలిసింది. దీంతో వాటికి దూరమయ్యా. స్టాక్స్‌లో ఏదో బ్యూటీ కనిపించింది. కిక్‌గా ఫీలయ్యా. దీంతో దీనికథేంటో చూద్దామని అడుగులేశా. ఇంటర్‌ రెండోసంవత్సరమంతా స్టాక్‌ పుస్తకాలు చదువుతూ, ల్యాపీతోనే బిజీగా ఉన్నా. ఎన్నో ప్రశ్నలు వేసుకుని  వాటికి సమాధానాలు కనుగొన్నా. అకడమిక్‌లో నేను నంబర్‌వన్‌ కాబట్టి ఇంట్లోవాళ్లు నన్ను ఇబ్బంది పెట్టలేదు. జాగ్రత్తగా ఉండమన్నారంతే. స్టాక్‌ మార్కెట్‌కి సంబంధించిన పుస్తకాలే నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఓ కంపెనీ గురించి రిసెర్చ్‌, ట్రాకింగ్‌ చేయటమంటే ఓ మనిషిని అర్థం చేసుకున్నట్లే. ఓ కంపెనీ చరిత్ర, ఐడియాలజీ, ఎథిక్స్‌, యుటిలిటీ, విజన్‌.. ఇలా అన్నీ ఆలోచించాలి. ఆయా వ్యక్తుల విలువలే సంస్థల్లో కనిపిస్తాయి. వాటిని పట్టాలంతే. తెలీకుండా చిన్న సంస్థలు, గవర్నెన్స్‌, ఎథిక్స్‌ లేని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బులు పోతాయి.కుటుంబ నేపథ్యం...
నాన్న పేరు చంద్రశేఖర్‌. డేటా ప్రాసెసింగ్‌ బిజినెస్‌ చేశారు. ఇప్పుడు కార్యాలయ వ్యవహారాలు చూస్తుంటారు. అమ్మపేరు సంగీత. న్యూట్రిషన్‌, సైకాలజీ చదివింది. మా బ్లాగ్‌కి కంటెంట్‌ మా అమ్మే రాస్తుంది. మా అక్క సీఏ చేసింది. కెనడాలో ఉద్యోగం చేస్తోందిప్పుడు. నా ఐడియాలు, అల్‌గారిథమ్స్‌, విజన్‌ను నమ్మి.. ఎనిమిది మంది మాకు 1.3 కోట్లు ఫండ్‌ ఇచ్చారు. నాకు డౌట్‌ వస్తే గురువు అజయ్‌ బాత్రాను అడుగుతా. ఆయన మాకు ఫండ్‌ ఇచ్చారు. అజీమ్‌ ప్రేమ్‌జీకి సన్నిహితుడు. నాకు కనీసం రోజుకి మూడు డౌట్స్‌ వస్తాయి. ఇలా రెండేళ్లనుంచీ మా గురువునే అడిగి తెల్సుకుంటున్నా. ఇప్పుడిప్పుడే సావర్ట్‌ సంస్థ అభివృద్ధి చెందుతోంది. ప్రతి రూపాయి అవసరమే. నేను జీతం తీసుకోను. నాకు ఎలాంటి ఖర్చులుండవు. అమ్మానాన్న చూసుకుంటారు. ఎలక్ట్రిసిటీ నుంచి స్టాక్‌ వరకూ అన్నిరకాల పనులు నేనే చేసుకుంటా. మా ఆఫీసులో అందరూ సమానమే.. పగలు ఆఫీసుకే పరిమితమవుతా. ఒక్కోసారి ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రిపూట పనిలో పడి ఆఫీసులోనే ఉంటుంటా. నాకు క్రికెట్‌ ఇష్టం. పియానో ప్లే చేస్తాను. వీకెండ్స్‌ సినిమాలు చూస్తా. మేం ఇతర దేశాల్లోకి వెళ్తున్నాం. కొత్త లైసెన్స్‌లు తీసుకుంటున్నాం. ఫ్రాంచైజీలకు అప్లయ్‌ చేస్తున్నాం. ఈ ఏడాది చివరికి రూ. 150 కోట్లు ఇన్వెస్ట్‌ చేయించాలనేది నా ముందున్న చిన్న టార్గెట్‌. స్టాక్‌ మార్కెట్‌ అనేది ఓ సైన్సు!
అందరూ సంస్థ ఎంత వృద్ధిలో ఉంది అనేది చూస్తారేతప్పా ఆ సంస్థ చరిత్రను చూడరు. ఎమోషన్‌గా డబ్బులు పెడతారు. పోగొట్టుకుంటారు. వెంటనే.. ‘మార్కెట్‌ గ్యాంబ్లింగ్‌’ అంటూ తిడతారు. అర్థంకానపుడు ఏదయినా గ్యాంబ్లింగ్‌గానే కనపడుతుంది. చాలా మంది స్టాక్స్‌లో పెట్టిన మరుసటి రోజునుంచే.. ఎంత లాభమని చెక్‌ చేస్తారు. టెన్షన్‌ ఎందుకు పడతారు? ఏదో టీవీలో కనిపిస్తుందని అందరిలాగే మీరూ స్టాక్స్‌ చెక్‌ చేసుకుంటుంటారు. మార్కెట్‌ అనేది ఎమోషనలీ ఇంటిమేటింగ్‌. ఐదురూపాయలు కాస్త పదిరూపాయలయితే సంతోషపడతాం.. పదిహేను రూపాయలయితే ఐదు రూపాయలు తీసుకుని.. మిగతా పదిరూపాయలతో గేమ్‌ ఆడదామనిపిస్తుంది. అందుకే స్టాక్స్‌ ఊరికూరికే చెక్‌ చేయకండి. టీవీలు చూడకండి. న్యూస్‌పేపర్స్‌ చదవండి. అయితే ప్రభావం కావొద్దు. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి కొన్నేళ్లలా వదిలేయండి. ‘అవగాహన లేక చేసేది రిస్క్‌.. అవగాహనతో చేసేది రిస్క్‌ కాద’ంటారు అపర కుబేరుడు వారన్‌ బఫెట్‌. రిస్క్‌ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మార్కెట్‌పై పరిశోధన చేయాల్సిందే. పరిగెత్తే గుర్రం మీద డబ్బుకాయటం అదృష్టం. మీరు స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగూ అలాంటిదే. గ్యాంబ్లింగ్‌గానే తోస్తుంది. ట్రేడింగ్‌ కాకుండా మీరు పక్కాగా ఇన్వెస్ట్‌ చేసి కొన్ని సంస్థల షేర్లుకొని, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టి వదిలేస్తే మంచి లాభాలు వస్తాయి. ఇదో సైన్సులాంటిదే..

- రాళ్లపల్లి రాజావలి

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని