ఏమో.. అవునేమో.. నిజమేమో!!
close

తాజా వార్తలు

Updated : 25/05/2019 03:42 IST

ఏమో.. అవునేమో.. నిజమేమో!!

ఆర్ట్‌ ఆఫ్‌ లవింగ్‌

ఇంటర్‌ రెండేళ్లు. పంచుకున్న పిజాలు.. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు.. పవర్‌బ్యాంకు షేరింగ్‌లు. తనతో ఉంటే బాగుంటుంది. నాకెన్నిసార్లు పబ్‌జీలో లైఫ్‌ ఇచ్చిందో. అప్పుడేమీ అనిపించలేదుగానీ.. ఇప్పుడు తను పదే పదే గుర్తొస్తోంది. తనూ నాలానే ఆలోచిస్తోందా? లాంగ్‌టెర్మ్‌ కోచింగ్‌. వాడు  చాలా షార్ప్‌. నేను గంటలు గంటలు చదివేదాన్ని. వాడు మాత్రం పెద్దగా చదివే వాడు కాదు. కానీ, ఎగ్జామ్‌ పెడితే నిమిషాల్లో ఫినిష్‌ చేసేవాడు. ఎలారా సాధ్యం అంటే? చిన్న స్మైల్‌ ఇస్తాడు. వాడి కాన్ఫిడెన్స్‌ నాకు బాగా నచ్చేది. ఇంజినీరింగ్‌ ఏ క్యాంపస్‌లో జాయిన్‌ అవుతాడో. ఏ గ్రూపు తీసుకుంటాడో? అయినా నేను వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? బస్సులోనే చూశా తనని. ఇద్దరిదీ ఒకే రోజు ఇంటర్వ్యూ. నేను వెళ్లిన కాసేపటికి తనూ వచ్చాడు. బస్సులో పెద్దగా ఏం అనిపించలేదుగానీ.. ఫార్మల్స్‌లో మహేష్‌లా కూల్‌గా అనిపించాడు. ‘మాట్లాడనా?’ అనుకుంటుండగానే తనే పలకరించాడు. అంతే.. సాయంత్రం తిరిగి బస్సు ఎక్కేంత వరకూ ఎన్నో మాట్లాడుకున్నాం. ఇంటికెళ్లాక పదే పదే ఎందుకు గుర్తొస్తున్నాడు?
క్యాంపస్‌లో.. కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌లో.. కౌన్సెలింగ్‌లో.. క్లాస్‌ రూమ్‌లో.. ఆఫీస్‌లో దగ్గరో.. కిక్కిరిసిన ఎర్రబస్సులోనో..‘హాయ్‌!!’తో మొదలవుతుంది.. ఇరువురి స్నేహం మొగ్గతొడిగి రోజులు.. నెలలు.. చెలిమి సెలయేరు లోలోన ఉప్పొంగినా.. గట్టు దాటలేదు. హద్దు మీరలేదు.. కానీ, కొద్దిరోజులుగా.. మీలో ఏదో అనుమానం.. ఉరకలెత్తే మైత్రీ ఒడ్డుపై ఎన్నడూలేని ఒరిపిడి పెంచుతోందని! ‘గుండెల్లో ఏదో సడి.. ఉండుండీ ఈ అలజడి’ అని లోలోన మూగగా ఏదో పలుకుతోంది. ఏమిటీ అల్లరి? తననే అడిగేయడం అటుంచితే.. అసలు మీ మనసులో ఏముంది? ఉండీ లేకుండా ఉందో.. లేకుండా ఉందనిపిస్తోందో తెలుసుకోవాలి! ఎలా? ఈ లక్షణాలు మీకు ఉన్నాయో చూసుకోండి...

ఆ మైమరపు నిజమేనా?

నిద్రకు ముందు చివరి ఆలోచన.. లేచిన తర్వాత తొలి ఊహ తన గురించే  కావొచ్చు!  ఏదో తెలియని ఆనందం అనుభవిస్తుంటారు. కొత్త ఉత్సాహం వస్తుంది. రోడ్డుపై నడుస్తూ మీకు మీరే నవ్వుకుంటారు..! తను చెప్పిన జోక్‌ గుర్తొస్తుంది. వారితో ఎవరైనా క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారని తెలిస్తే.. మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది! వాళ్లిద్దరి మధ్య మీరు ఊహించినదేం లేదని తెలియగానే మీ ఆనందం అంతా ఇంతా కాదు! 
సెల్‌ఫోన్‌లో తన పేరును.. చాలా ముద్దుగా సేవ్‌ చేసుకుంటారు!  ప్రపంచంలో ఇంకెవరూ తనని అలా పిలవని రీతిలో! తన కాల్‌ రాగానే చుట్టూ ఎవరున్నారన్న విషయం పట్టించుకోకుండా దూరంగా వెళ్లే మాట్లాడతారు! వారి గురించి సమస్తం తెలుసుకోవాలనే తహతహ మొదలవుతుంది. మాటల మధ్యలో చెప్పిన వాళ్ల పిన్ని కూతురి పాప పేరు కూడా! సునాయాసంగా గుర్తుపెట్టు కుంటారు!
వారి ప్రవర్తనలో  కొన్ని పిచ్చిగా నచ్చుతాయి. ఎడమచేతి వాటం అవ్వడం.. వాచ్‌ కుడి చేతికి పెట్టుకోవడం..లాంటివి అన్నమాట. ఫ్రెండ్స్‌తో,  ఇంట్లో వాళ్ల సుగుణాలన్నీ చెప్పి తెగ   పొగిడేస్తుంటారు. ఇంట్లో శుభకార్యం ఏదైనా  తను లేకుండా మిమ్మల్ని మీరు ఊహించలేరు! సింపుల్‌గా చెప్పాలంటే.. భవిష్యత్తుకు సంబంధించి ఏం ఆలోచించినా ఆ దృశ్యంలో తనూ ఉంటుంది. అది నెల.. ఏడాది.. ఐదేళ్ల తర్వాతి విషయమైనా సరే!
కుటుంబ సభ్యులకు కేటాయించినట్టుగానే తన కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఫ్రెండ్స్‌తో మీటింగ్‌లు తగ్గిపోయి.. తనతో డేటింగ్‌లపై ఆసక్తి చూపిస్తారు. తనని నేను ప్రేమిస్తున్నానా? ఇది ప్రేమేనా?’ అనుకోగానే తనువు తుళ్లిపడుతుంది!  శ్వాస వేడెక్కుతుంది... వావ్‌.. నిజంగా..! నాకు ఇలానే అనిపిస్తోంది. అంటారా? అయితే, ప్రేమలో లోతులో మునిగినట్టే. మీ మనసు మీ మాట వినదు. కానీ, లాజిక్‌తో మెదడు ముందుకొస్తుంది. ప్రశ్నలు వేస్తుంది..

సమాధానం చెప్పాల్సిందే!
వాస్తవాన్ని మరచి మనసు తుళ్లి  పడుతుంటే.. మెదడు ప్రేమ పజిల్‌ని ముందు ఉంచుతుంది. అప్పుడు.. నిజమైన ప్రేమేంటో తెలుస్తుంది...

పజిల్‌-1
లవర్‌ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆర్యన్‌. కలలో తను ప్రపోజ్‌ చేశాడు. ఆలోచించడానికి కాస్త టైమ్‌ అడిగింది. ఇద్దరూ కలిసి సినిమాలు.. షికార్లు.. ఫ్రెండ్స్‌లానే. కానీ, ఓ రోజు అనుకోకుండా ఆర్యన్‌ వాళ్ల నాన్నకి ఫోన్‌.. ‘మీ వాడు ఎవరో అమ్మాయితో సినిమాకి వచ్చాడని.’ హాల్లో ఉండగానే ఆర్యన్‌ ఫోన్‌ మోగుతుంది. ఏసీ హాల్లో ముచ్చెమటలు. ఏం చెప్పాలి అని ఆర్యన్‌కి ఒకటే కంగారు. తను గమనిస్తుందన్న విషయమే మర్చిపోయి బయటికి వచ్చేశాడు. ఇంటికి వెళ్లగానే ‘ఎవరా అమ్మాయి?’ అని అడిగేసరికి.. ఏ మాత్రం తడుముకోకుండా ‘మీరనుకున్నట్టు అదేం లేదు నాన్న.. జస్ట్‌ ఫ్రెండ్‌ అంతే’ అని గదిలోకి వెళ్లాడు. ఇంతలో ఫోన్‌కి మెసేజ్‌... ‘మనమున్న వయసులో ప్రేమకి నీ ముఖంలో చూసినంత భయం ఉంటుంది. అందుకే ఇది వర్కవుట్‌ కాదు’ వదిలేయ్‌ అని. ఉలిక్కిపడి నిద్రలేచి చెమటలు తుడుచుకున్నాడు ఆర్యన్‌. మరి, ఇలా జరిగితే మీ సంగతేంటి?
పజిల్‌-2
రమ్య, విశాల్‌ ఇంజినీరింగ్‌ రెండో ఏడాది. ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా ఒకటే సెల్ఫీలు. ముద్దులు, మురిపాలు అన్నీ. ఓ రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రమేయం లేకుండా ఇద్దరూ కలిసున్న ఫొటో.. అవాక్కయ్యింది. వెంటనే విశాల్‌ని అడిగింది. తనే పెట్టానని చెప్పాడు. అంతే.. ‘నన్ను అడక్కుండా ఎందుకు పెట్టావ్‌? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మా వాళ్లు చూస్తే ఇంకేమైనా ఉందా? అయినా.. ఇప్పుడు మనమున్న స్థితిలో ఈ పబ్లిసిటీ అవసరమా... ఇంజినీరింగ్‌ అవ్వాలి. ఉద్యోగాలు సంపాదించాలి. సెటిల్‌ అవ్వాలి..’ అని అంటుండగానే విశాల్‌కి వాస్తవం అర్థమయ్యింది. ఇప్పుడున్న స్థితిలో ప్రేమకి పరిధులు ఉంటాయని. వెంటనే ఫొటో డిలీట్‌ చేశాడు. ఇద్దరూ చదువుపై శ్రద్ధ పెట్టారు.
పజిల్‌- 3
కాలేజీలకు హాలిడేస్‌. వరుణ్‌ ఎప్పుడు కలుద్దాం అని అడిగినా ఓకే అనేది సిరి. తీరా ఆ రోజు వచ్చేసరికి కుదరదు అని చెప్పేది. కొన్నిసార్లు ఇంట్లో నుంచి స్టార్ట్‌ అయ్యి మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయేది. వరుణ్‌కి చాలా కోపం వచ్చేది. ఓ రోజు.. మొత్తానికి కలిశారు. ‘ఎందుకిలా వస్తానంటావ్‌.. కుదరదు అంటావ్‌. మధ్యలోనే వెళ్లిపోతావ్‌.. ఇంట్లో వాళ్లంటే భయమా? అలాంటిప్పుడు నాతో ఎందుకు ఇలా?’ అనే సరికి. సిరి సమాధానం ఇది. ‘మా వాళ్లంటే భయం కాదు.. గౌరవం. నువ్వంటే ప్రేమ. ఇష్టం. నేనున్న దశ ఇది. నువ్విలా.. ప్రశ్నలు అడిగి జడ్జ్‌ చేద్దాం అనుకుంటే నీది ప్రేమని నేను అనుకోను. రిస్క్‌ చేసే వయసు కాదు మనది.’ అని చెప్పి వెళ్లిపోయింది. వరుణ్‌ ఆలోచనలో పడ్డాడు. నిజంగా నాది ప్రేమేనా? అని.
ఇలా ఎన్నో పజిళ్లు ఎదురవుతాయి. మనసు వర్సెస్‌ మెదడు. సున్నితంగా ఆలోచించి ప్రేమలో పడతారో.. సునిశితంగా ప్రవర్తించి ఏది ప్రేమో తెలుసుకుంటారో.. ఛాయిస్‌ మీదే. ఏది ఏమైనా.. మనసుని, మెదడుని ఒప్పించగలిగిన రోజే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆల్‌ ది బెస్ట్‌ ఫ్రెండ్స్‌!!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని