close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2019 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా దారిలో.. వాళ్లూ నడవాలని

యంగ్‌ తరంగ్‌

వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఆట గెలిస్తే ఆ కిక్కే వేరప్పా! బెంగళూరు (దక్షిణ) పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎంపికైన తేజస్వీ సూర్య కూడా అదే జోష్‌లో ఉన్నాడిప్పుడు. 28 ఏళ్ల యువకుడు.. ప్రధాని మోదీ కళ్లల్లో పడ్డాడు. చివరి క్షణంలో ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యాడు. ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. కాషాయదండులో చిన్నవాడిగా నిలిచాడు. అన్నిటికన్నా.. రాజకీయాలకు కొంత దూరం పాటిస్తున్న ఈ తరానికి కొత్త దారి చూపాడు.

క్రికెట్‌ మీద ప్రేమ.. సచిన్‌ అంటే ఆరాధన.. సోషల్‌ మీడియాపై పిచ్చి.. 90వ దశకంలో పుట్టిన కుర్రకారు సహజ లక్షణాలివి. తేజస్వీ సూర్య పుట్టింది 1990 కావడంతో.. అతడిదీ అదే తరహా. అందరిలా మాత్రం ఆలోచించడు. యువ ఎంపీ పడక గది చూస్తే.. కెమెరా, గోడలకు గ్రీన్‌ మ్యాట్‌, హైటెక్‌ ఫోకస్‌ లైట్లతో ఓ స్టూడియోలా ఉంటుంది. రెండేళ్లుగా ఈ గదిలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై తన గొంతుకను.. సచిత్రంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవాడు. ఇలా బెంగళూరు మిలీనియల్స్‌ పల్స్‌ పట్టేశాడు తేజస్వి.
    చిన్నప్పటి నుంచి నాయకత్వంపై ఆసక్తి ఉండేదతడికి. శ్రీకుమరన్‌ చిల్డ్రన్‌ హోమ్‌లో ఏడో తరగతి చదువుతుండగా.. ఎన్నికల్లో తలపడ్డాడు తేజస్వి. ‘స్కూల్‌ అసిస్టెంట్‌ హెడ్‌ బాయ్‌’ పోస్టు కోసం పోరులో గెలుపు కోసం కరపత్రాలు పంచడమే కాదు.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇచ్చి.. సింహభాగం ఓట్లు తన ‘సింహం’ గుర్తుకు పడేలా చేసుకున్నాడు. కాలేజ్‌లోకి వచ్చాక అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)లో సభ్యుడయ్యాడు. భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీ కర్ణాటక యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ‘రాజకీయాల్లోకి రావడానికి ప్రధాని మోదీ ప్రేరణ. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో.. నేనీ దిశగా అడుగులు వేశాన’ని అంటాడు తేజస్వీ. ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్న ఈ యంగ్‌ తరంగ్‌ కోర్టులో వాదనలు వినిపించడంలోనూ ఘటికుడే. పలు రాజకీయ నేతల కేసులనూ వాదించాడు!

    భాజపా కర్ణాటక నేత అనంత్‌ కుమార్‌ అంటే తనకెంతో అభిమానం అంటాడీ యువకుడు. తేజస్వికి తొమ్మిదేళ్లప్పుడు అనంత్‌ కుమార్‌ బెంగళూరు (దక్షిణ) ఎంపీగా గెలిచారు. గతేడాది నవంబరులో ఆయన కన్నుమూసే వరకు అదే స్థానంలో ఎన్నికవుతూ వచ్చారు. ఇప్పుడదే నియోజకవర్గంలో నిలిచి గెలిచాడు తేజస్వి. ఈ అవకాశం అతడికి ఊరికే రాలేదు. 2014 నుంచి కన్నడ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో వందకు పైగా ర్యాలీలు నిర్వహించాడు. మోదీ సభలను దగ్గరుండి చూసుకున్నాడు. ఈ క్రమంలో ప్రధాని దృష్టి అతడిపై పడింది. ‘బ్రిగేడ్‌ మోదీ’ సదస్సుల్లో చురుగ్గా పాల్గొనడంతో ఈ యంగిస్థాన్‌పై మోదీకి గురి కుదిరింది. ఉన్నత లక్ష్యాలున్న యువకుడు కావడం, వాక్పటిమ ఉండటం, రాజకీయ సమీకరణాలు కూడా కలిసిరావడంతో.. తేజస్వికి ఊహించని అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుని.. తన ప్రత్యర్థిపై మూడు లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించి వహ్వా అనిపించుకున్నాడు. యువతకు ఆదర్శంగా నిలిచాడు.

 
 
- జి.జగదీశ్వరి
తల్లిదండ్రులు:రమ, సూర్యనారాయణ
అభిరుచులు: చదవడం, రాయడం
నచ్చిన నటుడు: దునియా విజయ్‌
మెచ్చిన నటి: ఆలియాభట్‌
ఇష్టమైన ఆటలు: క్రికెట్‌, ఫుట్‌బాల్‌
అభిమాన రచయితలు: స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాబిన్‌శర్మ
వాహనం: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌
ఆహారం: పానీపూరి, ఇడ్లీ సాంబార్‌, వడా పావ్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.