close

తాజా వార్తలు

Published : 04/05/2019 00:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హాయిగా జీవితం ప్రారంభిద్దాం

అవి నా ఇంటర్‌ ఫస్ట్‌ఇయిర్‌ రోజులు. ఫిబ్రవరి 27... రోజూ తనని చూస్తున్నా ఆరోజు ఎందుకో ప్రత్యేకంగా కన్పించింది. తన పేరు జ్యోతి. తన పుట్టిన రోజు. లంగావోణి వేసుకొని కాలేజీకి వచ్చింది. నా కళ్లే కాదు... కాలేజీలోని అందరి అబ్బాయిల కళ్లు తనని చూసి మెరిసిపోతున్నాయని నాకు అర్థమైంది. అంతకు ముందే మేం స్నేహితులం. కానీ ఆ రోజు తనతో మాట్లాడాలంటే ఏదో ఇబ్బందిగా అన్పించింది. ‘ఎందుకు అలా చూస్తున్నావ్‌’ అంది. ‘మరి నువ్వు ఇంతగా రెడీ అయి వస్తే... ఏం చేయమంటావ్‌?’ అన్నాను. తను నవ్వింది. పగలే వెన్నెల కురిసింది తరగతి గదిలో. అప్పటి వరకూ మామూలుగా ఉన్న నాకు తనని చూస్తే ఏదో అయిపోతున్నట్లు అనిపించేది. 1999 ఫిబ్రవరి 14న తనకు ప్రపోజ్‌  చేశాను. ‘ఐ యామ్‌ వెరీ సారీ రా... నాకు మా బావతో పెళ్లి నిశ్చయమైపోయింది.’ అంది సంవత్సరంగా నిర్మించుకున్న నా ప్రేమ తాజ్‌మహల్‌ కళ్లముందే కూలిపోతున్న బాధ. పిచ్చివాడినై పోయాను. ఇంటర్‌ ఎలాగో గట్టెక్కేశాను. డిగ్రీ చేరాను తప్ప చదవలేదు. తనకు డిగ్రీ ఫస్ట్‌ఇయర్‌లో నిశ్చితార్థం అయింది. అదే ఏడాది పరీక్షలు అవగానే తన పెళ్లి అయిపోయింది. పెళ్లికి నన్ను పిలిచింది. వెళ్లలేదు. ఆ రోజు బాగా తాగి ఫ్రెండ్స్‌ రూంలో పడిపోయాను. రెండు రోజుల తర్వాత గానీ లేవలేదు. సిగరెట్‌, మందు అలవాటైపోయింది. అమ్మానాన్న కుమిలిపోయారు. స్నేహితులు ఎంతగానో బుజ్జగించారు. నాలో మార్పు రాలేదు. అలా నాలుగేళ్లకు గానీ మాములు మనిషిని కాలేదు. అమ్మానాన్నల బాధ చూడలేక... డిగ్రీ పాసయ్యాను. హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగంలో చేరాను. పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కర్నూలుకు ఎప్పుడు వెళ్లిన తన ఇంటి ముందు తిరిగేవాడిని. స్నేహితులంతా నువ్వు పిచ్చోడివిరా అనేవాళ్లు. తనకు ఒక పాప పుట్టిందని... బాగా ఉందని నాకు తెలిసింది. 2008లో తను వెళుతున్న కారుకు ప్రమాదం. ఆ ప్రమాదంలో జ్యోతి భర్త చనిపోయాడు. పాప, జ్యోతి బతికి బయటపడ్డారు. చాలా రోజులు నేను ఆసుపత్రి చుట్టూ తిరిగాను. తను కోలుకొని ఇంటికి వచ్చింది. స్నేహితులందరితో కలిసి వాళ్లింటికి వెళ్లాను. చాలా ఓదార్చాను. తను క్రమంగా కోలుకుంది. పాపను స్కూల్‌లో చేర్పించింది. 2011 ఫిబ్రవరి 14న మళ్లీ తనకు ప్రపోజ్‌ చేశాను.. అదీ వాళ్లింట్లో వాళ్ల అమ్మానాన్నల అనుమతితోనే.. తను ఒప్పుకోలేదు. మా ఇంట్లో వాళ్లకూ నచ్చజెప్పి ఒప్పించాను. పాపను బాగా చూసుకుంటానని చెప్పాను. ఇక నాకు పిల్లలే వద్దని వేసక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నాను. అయినా తను కరుణించలేదు. ఎన్నిసార్లు అడిగినా మౌనమే సమాధానం. తను ఒప్పుకొనేదాక ఎదురుచూస్తాను తప్ప తనను వదులుకోలేను. జ్యోతి ప్లీజ్‌... నీ జీవితంలో చీకట్లను తొలగించి... నా జీవితానికి వెలుగులు పంచడానికి నీకు అభ్యంతరం ఏమిటి? నన్ను ఎందుకు వద్దంటున్నావో చెప్పు? సమాజానికి భయపడుతున్నావా? మీ అత్తమామల కుటుంబం ఏమంటుందోనని అనుకుంటున్నావా? నేను వెళ్లి వాళ్లతో మాట్లాడతాను. గతం పీడకలలా మరిచిపో.. .కొత్త జీవితాన్ని హాయిగా ప్రారంభిద్దాం. ఈ లోకంలో ఎవరూ ప్రేమించనంత గొప్పగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను.

- నీ ప్రేమ కోరుకునే సతీష్‌

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని