close

తాజా వార్తలు

మీమ్స్‌ రూటు మారుతోంది!

స్నేహమెంత గొప్పదో చెప్పేందుకు ఓ వ్యాసం రాయొచ్చు. కానీ, ఓపిగ్గా ఎంతమంది చదువుతారు?
అదే ఓ మీమ్‌ని క్రియేట్‌ చేసి పంపితే!
దానికొచ్చే స్పందనే వేరు!
ప్రేమెంత స్వచ్ఛమైందో తెలిపేందుకు గంటలకొద్దీ మాట్లాడొచ్చు. కానీ, వినేంత తీరిక ఎందరికి ఉంటుంది? స్వీట్‌గా ప్రేమెంత విలువైందో మీమ్‌తో తెలపండి. చూస్తూ ఉండిపోతారు.

.. అందుకేనేమో సోషల్‌లైఫ్‌లో మీమ్‌లకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. అది జిఫ్‌ ఫార్మెట్‌ కావచ్చు.. క్షణాల నిడివి ఉన్న వీడియో అయ్యుండొచ్చు.. రెండు, మూడు లైన్ల టెక్స్ట్‌తో కూడిన ఫొటో కావచ్చు... పోస్ట్‌ చేసిన మరుక్షణం నుంచి లైక్‌లు.. కామెంట్‌లు.. ఫార్వర్డ్‌లు! వ్యక్తులు, సమాజంపై పాజిటివ్‌గా పని చేసినంత వరకూ మీమ్స్‌తో ఇబ్బందేం లేదు. కానీ, నాణేనికి మరోవైపు అన్నట్టుగా మీమ్స్‌కి ఉన్న నెగిటివ్‌ కోణాలూ బయటపడుతున్నాయి. ఎలాగంటే...

* లావుగా ఉన్న ఓ అమ్మాయి. ముఖానికి డబుల్‌ ఛీజ్‌ పిజ్జా బొమ్మ తగిలిస్తారు. నాజూకుగా ఉన్న మరో అమ్మాయి. తన ముఖానికేమో మష్రూమ్‌ పిజ్జా. వీరిద్దరి మధ్య ఓ క్యాప్షన్‌ ‘మీరు ఏ పిజ్జా తింటారని?’. సోషల్‌ మీడియాలో కనిపించిన మీమ్‌ ఇది. ఫోకస్‌ పిజ్జాలపై ఉన్నంత వరకూ ఓకే. కానీ, నిశితంగా చూసే వారి దృష్టి అమ్మాయిలపైపు మళ్లుతుంది. మీమ్‌లో అమ్మాయిల రూపాల్ని కించపరుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నేమంటారు?

* ప్రముఖ బ్యాట్స్‌మ్యాన్‌. ఓ మ్యాచ్‌లో డక్‌ అవుట్‌ అవుతాడు. అది తట్టుకోలేకనో తనంటే ఇష్టం లేకనో ఓ క్రికెట్‌ లవర్‌ మీమ్‌ ఇలా పోస్ట్‌ చేశాడు. గ్యాలరీలో నుంచి బ్యాట్స్‌మెన్‌ ప్రియురాలు గాల్లో ముద్దులు పంపుతూ రా.. రా.. అని పిలుస్తున్నట్టుగా ఫొటో ఒకవైపు.. అవుట్‌ అయ్యి వెళ్తున్న బ్యాట్స్‌మ్యాన్‌ ఫొటో మరోవైపు. కిందో క్యాప్షన్‌. ‘కమాన్‌ మేరీ జానూ..!’ అని. ఇదెలాంటి భావజాలాన్ని సూచిస్తుంది?

.. ఇలా ఒకటి, రెండు కాదు. కోకొల్లలు. స్పోర్ట్స్‌, పాలిటిక్స్‌, సినిమా.. యువత క్రేజీగా ఫీల్‌ అయ్యే అన్ని రంగాల్లోనూ మీమ్స్‌ రూటు మారుతోంది. ఇదే మాత్రం మంచి పరిణామం కాదని టెక్నాలజీ, వెబ్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం దేశ వ్యాప్తంగా 25 కోట్ల మంది సోషల్‌ మీడియా యూజర్లు నెట్టింట్లో యాక్టివ్‌గా సందడి చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం యువతే. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌.. లాంటి ఇతర సోషల్‌ మాధ్యమాల్లో మీమ్స్‌ సంస్కృతి దారి తప్పకుండా జాగ్రత్త పడాలి.


‘ట్రోల్‌’ అనుకోవద్దు

మీమ్‌ని క్రియేట్‌ చేయడం అంటే ట్రోల్‌ చేయడం కాదు. మీమ్‌కి అర్థం.. సీరియస్‌ విషయాన్ని ఎవ్వరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడం. నెట్టింటి పరిభాషలో అలా పుట్టిందే ‘ఇంటర్నెట్‌ మీమ్‌ కల్చర్‌’. స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా అందుబాటులోకి రావడం.. డేటా చౌక అవ్వడం.. సోషల్‌ మీడియా వేదికలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మీమ్స్‌ రూటు మారడం మొదలయ్యింది. నచ్చని విషయాల్ని బహిరంగంగా చెప్పడానికో.. ఇష్టంలేని వ్యక్తుల్ని దూషించడానికో.. ముసుగేసుకుని ట్రోలింగ్‌కి మీమ్స్‌ని వాడుకుంటున్నారు. ఈ ధోరణి ఎక్కువగా నేటి తరం మిలీనియల్స్‌గా పిలుచుకుంటున్న ‘జనరేషన్‌-జెడ్‌’లో ఎక్కువైందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌.. ఇతర మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఎక్కువ యూజర్‌బేస్‌ యువతరానిదే.

రానున్న ప్రపంచకప్‌ క్రికెట్‌, దేశ రాజకీయాల్లో.. ఇంటర్నెట్‌ మీమ్స్‌ని మరింత విస్తృతంగా వాడేందుకు అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల విశ్లేషణ. యువత ఆసక్తిగా ఫాలో అయ్యే అన్ని రంగాల్లోనూ మీమ్స్‌ పాత్ర ఎక్కువే. నెట్టింట్లో అందుబాటులో ఉన్న పలు వెబ్‌సర్వీసులు, యాప్‌లతో మీమ్స్‌ని క్రియేట్‌ చేస్తూ వారి అభిప్రాయాల్ని బలంగా చెబుతున్నారు. క్రీడలు, సినిమాలు, టెక్నాలజీ, రాజకీయాలు... రంగం ఏదైనా ఒకరిపై మరొకరు వ్యతిరేక ఆరోపణలు చేసుకుంటూ.. మీమ్స్‌ ద్వారా దుష్ప్రచారాన్ని చేసేందుకు సోషల్‌ మీడియా వేదికవుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా కంటెంట్‌పై ఆయా నెట్‌వర్క్‌ అడ్డాలు తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలు దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.


నిపుణుల మాటేంటి?

మీమ్స్‌ ద్వారా ఎక్కువ మందిని చేరడం చిటికెలో సాధ్యం. అందుకే పలు పేరొందిన కంపెనీలు కూడా మీమ్స్‌ని తమ బ్రాండింగ్‌కి వాడుకుంటున్నాయి. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ఇప్పుడున్న ప్రధాన వేదికలు. యూజర్ల దృష్టిని ఆకట్టుకునేలా మీమ్స్‌ని క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తే చాలు. అవి వైరల్‌ అవుతూ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ అవుతుంది. కంపెనీలే కాదు వ్యక్తుల బ్రాండింగ్‌ని పెంచుకునేందుకు మీమ్స్‌ వాడుతున్నారు. అయితే, పాజిటివ్‌గా ఉన్నంత వరకూ సమస్య లేదు. ఎప్పుడైతే వ్యక్తుల మనోభావాల్ని కించపరిచేలా మీమ్స్‌ మారతాయో అప్పుడు వాటి ప్రయోజనం నెరవేరదు. మీమ్స్‌ షేరింగ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* సున్నితంగా సూటిగా చెప్పే ప్రయత్నం చేయాలి.
*ఇమేజ్‌లను వాడే క్రమంలో కాపీరైట్స్‌ సమస్యలు లేకుండా చూసుకోవాలి.
* మీరు క్యాప్చర్‌ చేసిన ఫొటోలు, ఫుటేజీలనే వాడితే మంచిది.
* షేర్‌ చేసే మీమ్స్‌ మీ సోషల్‌ ఫ్రొఫైల్‌ గుర్తింపుని పెంచేలా ఉండాలి.
* క్రియేట్‌ చేసేవి.. పంచుకునేవి మీ మనస్తత్వాన్ని చెబుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

       - సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, అసోసియేట్‌ డైరెక్టర్‌, సీ-డాక్‌


కట్టడి చేయలేరా?
పేరొందిన సోషల్‌ మీడియా సంస్థలు నెగిటివ్‌ కంటెంట్‌ని కట్టడి చేయడంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా పేజీలను ఫిల్టర్‌ చేస్తూ తప్పుదారి పట్టిస్తున్న మీమ్స్‌ని అడ్డుకునే వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్‌, అత్యాచారాలు, సెక్స్‌, పోర్నోగ్రఫీ, పాలిటిక్స్‌, కులమతాలపై ఎలాంటి అభ్యంతరకరమైన మీమ్స్‌ కనిపించినా వెంటనే ఆయా ఎకౌంట్‌లను బ్లాక్‌ చేస్తూ తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అదే పనిగా మీమ్స్‌ జనరేట్‌ చేసి వైరల్‌ చేసే యూజర్లను పట్టుకునేందుకు ట్విట్టర్‌ ప్రత్యేక నిఘా వ్యవస్థని సిద్ధం చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు కూడా పబ్లిక్‌ రివ్యూలు, కామెంట్‌ల ఆధారంగా అభ్యంతరకరమైన పేజీలను బ్లాక్‌ చేస్తూ అడ్మిన్‌లను హెచ్చరిస్తున్నాయి.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.