close

తాజా వార్తలు

Published : 02/03/2019 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్మార్టే కాదు..సురక్షితం

అంకురార్పణ

బ్యాక్‌ప్యాక్‌కీ సూట్‌కేస్‌లా రక్షణ కవచం ఎందుకు ఉండకూడదు?
బాటిల్లో చల్ల నీళ్లు వేడిగా అవ్వకుండా ఓ పౌచ్‌ ఉంటే బాగుంటుంది కదా! ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు బ్యాగు బయటే యూఎస్‌బీ పోర్టుల్ని పెడితే ఎంత సౌకర్యమో!... ఇలానే ఆలోచించాడో మిలీనియల్‌. 18 నమూనా డిజైన్లు చేసి..     రెండేళ్లు కష్టపడి రూపొందించాడు!
అది వజ్రం అంత దృఢంగా ఉండాలని ‘కార్బనాడో’ అని పేరు పెట్టాడు. అంతేకాదు.. బ్యాక్‌ప్యాక్‌లో బరువు మోయడం వెనక      ఓ సైన్స్‌ ఉందని చెబుతున్నాడు. ఇది పూర్తిగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అంటున్న అతనే ప్రదీప్‌ రెడ్డి. ‘ఈ-తరం’తో తన లక్ష్యాన్ని, బ్యాక్‌ప్యాక్‌లోని సౌకర్యాల్ని పంచుకున్నాడిలా..

మార్కెట్‌లో బ్యాక్‌ప్యాక్‌లు చాలానే ఉన్నాయ్‌. ట్రెండీ డిజైన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. కానీ, అవెంత సౌకర్యం? సురక్షితం? అనే విషయంలో నా ఆలోచన మొదలయ్యింది. నిజానికి బరువు ఎప్పుడూ భుజాలపై పడకూడదు. వీపే మోయాలి. ఎందుకంటే.. వెన్నెముకకు అంత శక్తి ఉంటుంది. కానీ, ఒకసారి గమనించండి. టీనేజర్ల బ్యాక్‌ప్యాక్‌లే కాదు. స్కూల్‌ పిల్లల బ్యాగుల్ని చూస్తే అన్నీ నడుము కిందకి జారి, భుజాలపైనే ఎక్కువ భారం మోపుతున్నాయి. దీంతో చాలా సమస్యలు వస్తాయి. అక్కడే మా ఫోకస్‌. అందుకు తగినట్టుగా బ్యాగు వీపునకు అతుక్కుని ఉండేలా రూపొందించాం. తర్వాత, బ్యాగు సూట్‌కేస్‌ అంత సురక్షితం కాదు. అది నమ్మక తప్పని నిజం. ఎందుకంటే.. బ్యాగుకు ఎటు వైపూ ఎలాంటి ‘షీల్డ్‌’ (కవచం) ఉండదు. అనుకోకుండా కింద పడితే బ్యాగులో ఉన్నవి పాడయ్యే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా బ్యాగు పై భాగం. ఒకవేళ కింద పడితే నేలను బలంగా తాకేది అదే. అందుకే బ్యాగు పై భాగంలో దృఢమైన ‘పాలీకార్బనేట్‌ షెల్‌’ని అమర్చాం. దీంతో బ్యాగు పొరబాటున వెనక్కి పడినా.. ఏదైనా బలంగా తగిలినా లోపలున్న వస్తువులకు ఏం కాదు.

‘కూల్‌’గా ఉంచుతుంది
వచ్చేది వేసవి. చల్లని నీళ్ల బాటిల్‌ని బ్యాగులో పెట్టుకుని బయలుదేరిన పది నిమిషాలకే వేడిగా అయిపోతాయ్‌. నీళ్లే కాదు. ఫేవరేట్‌ చాక్లెట్‌ బార్‌లూ కరిగి మీగడైపోతాయ్‌. అందుకే బ్యాగుకు ఓ వైపు ‘ఇన్సులేటెడ్‌ పౌచ్‌’ నిక్షిప్తం చేశాం. దీంట్లో ఒక లీటరు బాటిల్‌ని పెట్టుకోవచ్చు. కూలింగ్‌ బాటిల్‌ని ఉంచితే నాలుగు గంటల పాటు చల్లగా ఉంచుతుంది. నిత్యం సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచాల్సిన మందుల్ని ప్రతికూల వాతారణంలో బయటికి తీసుకెళ్లాల్సివస్తే ఇన్సులేటెడ్‌ పౌచ్‌లో పెట్టుకోవచ్చు. ఇక గ్యాడ్జెట్‌లను ఛార్జ్‌ చేసుకునేందుకు లోపల పవర్‌ బ్యాంకుకి ప్రత్యేక పౌచ్‌తో పాటు యూఎస్‌బీ పోర్టుల్ని నిక్షిప్తం చేశాం. ఫోన్‌ని ఛార్జ్‌ చేయాలనుకున్నప్పుడు పవర్‌బ్యాంకుని బయటికి తీయకుండా బయట కనిపించే పోర్టులకు యూఎస్‌బీ ఛార్జింగ్‌ కేబుల్‌ని కనెక్ట్‌ చేస్తే సరిపోతుంది. విదేశాలకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టుతో పాటు ఇతర బ్యాంకింగ్‌ కార్డుల్ని భద్రం చేసేందుకు ‘ఆర్‌ఎఫ్‌ఐడీ పౌచ్‌’ ఉంది. దీంతో ఏ రకమైన స్కానర్లు కార్డుల్లోని వివరాల్ని స్కాన్‌ చేసేందుకు వీలుండదు. మొత్తం బ్యాగుని సర్దుకున్నాక ‘యాంటీ థెప్ట్‌ కేబుల్‌ లాక్‌’తో తాళం వేయొచ్చు.
* ఇతర వివరాలకు https://goo.gl/uPc6jv

ఈ ఒక్క బ్యాగే కాదు
ఒక బ్రాండు పేరుతో టీనేజర్లకు దగ్గరవ్వాలనే ఉద్దేశంలోనే కార్బనాడో బ్యాగుని డిజైన్‌ చేశాం. కానీ, మా ఉద్దేశం, లక్ష్యం ఇది కాదు. స్కూలు పిల్లల బ్యాగులకీ ఈ సైన్స్‌ని అప్లై చేయడం... తక్కువ ధరకే స్మార్ట్‌ బ్యాగుల్ని డిజైన్‌ చేసి అందించడం. వీటితో పిల్లలు, తల్లిదండ్రులు, డ్రైవర్‌, ఉపాధ్యాయులు వీరందర్నీ గ్రూపుగా క్రియేట్‌ చేసి ‘ట్రాకింగ్‌’ సౌకర్యాన్ని అందించాలన్నది మా ఆలోచన. బ్యాగులో ట్రాకింగ్‌ డివైజ్‌ని అమర్చడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఏడాది పాటు ట్రాకింగ్‌ పరికరం పని చేస్తుంది. ఛార్జ్‌ చేయాల్సిన పని లేదు. అమ్మాయి లేదా అబ్బాయి స్కూల్‌ బస్సు ఎక్కింది మొదలు.. ప్రత్యేక యాప్‌తో పేరెంట్స్‌ నిత్యం ట్రాక్‌ చేసి చూడొచ్చు. మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా రోజూ వెళ్లే రూటులో వెళ్లకుండా మరేదైనా రూటులో బస్సు ప్రయాణించినా వెంటనే అలర్ట్‌ చేరిపోతుంది. ఈ ట్రాకింగ్‌ ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని అంచనా వేయొచ్చు. బెంగళూరులో ఇప్పటికైతే ఐదు స్కూల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం చేయాలనుకుంటున్నాం. వచ్చే జూన్‌కల్లా బ్యాగుల్ని అందుబాటులోకి తెస్తాం.
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. ఎంబీఏ తర్వాత హెచ్‌ఎస్‌బీసీలో ఓ ఐదేళ్లు ఉద్యోగం. తర్వాత బోర్‌. నేనే ఏదో ఒకటి చేయాలనుకున్నా. మొదట ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వైపు వెళ్లా. ఈ అంకుర సంస్థ ప్రయాణంలోనే రషిద్‌ కోలాని కలిశా. నా ఆలోచనకు సపోర్టు ఇచ్చింది తనే. బ్యాగుని తయారు చేయడంలో తన భాగస్వామ్యం ఉంది. స్టార్టప్‌ జర్నీలో నేను నేర్చుకున్నది ఒక్కటే.

ఓపికతో ముందుకు సాగాలి. ఎక్కడా కాపీ కొట్టకుండా మనదైన ఆలోచన అయ్యుండాలి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని