close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 23/02/2019 06:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ర్యాప్‌..ర్యాప్‌.. హుర్రే

గల్లీబాయ్స్‌.. అంటే? అరకొర చదువులు.. దొరికినవేవో కొలువులు చేస్తారనుకుంటే పొరబాటే. సమోసా.. ఛాయ్‌ తాగుతూనే సమాజాన్ని దగ్గరగా చూస్తారు. నేర్చుకుంటారు? వారికేం కావాలో తెలుసుకుంటారు. పోరాడతారు.  అప్పటి వరకూ ఆ ప్రాంతంలో పరిచయం లేని కళకి ఊపిరి పోస్తారు.. ప్రత్యేకతని చాటుతారు. అలాంటిదే బాలీవుడ్‌ రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన గల్లీబాయ్‌ సినిమా.. ఓ ర్యాప్‌ సింగర్‌ కథ!!  అలాంటి ర్యాపర్లు రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ ఉన్నారు. మన తీయని తెలుగు భాషలోనే ర్యాప్స్‌ పాడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా తమదైన ముద్ర వేస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎదిగిన ఈ గల్లీబాయ్స్‌ను. ‘ఈతరం’ పలకరించింది.

ప్రణవ్‌ నాదం¨

నాదీ ఓ మధ్య తరగతి కుటుంబమే. నాన్న మెడికల్‌ రెప్‌. ఇంచుమించు అందరిళ్లలో పిల్లల చదువుల్లానే నాదీ. ఆరో తరగతి నుంచే ఐఐటీ పౌండేషన్‌ కోర్సులు.. ఇష్టం లేకపోయినా ఈసీఈ ఇంజినీరింగ్‌. అవ్వగానే జాబ్‌. నౌకల్లో ఉద్యోగం. ఎల్లలు దాటి దేశవిదేశాలకు ప్రయాణం. చాలినంత జీతం. తల్లిదండ్రులను సంతోషపెట్టడానికే ఇదంతా. నీటిపై తెలుతున్నానే గానీ... నాకు నేనే చాలా భారంగా ఫీల్‌ అయ్యా. కిక్‌ లేదు. ఒక రకంగా సముద్రమంత మథనం చేశా. నేనేంటి? నా ఐడెంటీ ఏంటి? ఇంతేనా లైఫ్‌ అంటే? కొత్తగా నేనేం చేయలేనా? అప్పుడే.. నాకు నేను కన్పించా. నాకు మొదట్నుంచీ తెలుగు భాషన్నా.. సంగీతమన్నా.. చాలా ఇష్టం. అది ఓ రకంగా నా కుటుంబ మూలాల్లోనే ఉంది. భాషపై ప్రేమ వారి నుంచి పుట్టింది. అది నాకు మాత్రమే తెలిసిన ఇష్టం. వారికీ నేను ఎప్పుడూ చెప్పింది లేదు. ఎందుకంటే.. నేను ఏదీ పెద్దగా పంచుకునే వాడిని కాదు. కుటుంబానికి వేల మైళ్ల దూరం నన్ను ఒంటరిని చేసింది. అందుకేనేమో ధైర్యంగా ఉద్యోగానికి బాయ్‌ చెప్పేశా. నాదైన రంగాన్ని ఎంపిక చేసుకునే నిర్ణయం తీసుకున్నా. కానీ, ఎటు వెళ్లాలి?

తెలుగు వెలుగే దారయ్యంది...
అమ్మ భాషంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. దానికి నా భావోద్వేగాలు తోడయ్యాయి.  అక్షరాలు.. పదాలన్నీ కవితలయ్యాయి. వాటిని పెద్దగా చదువుతూ అందరికీ వినిపించేలా చెప్పాలనిపించేది. అప్పుడే ఈ ర్యాప్‌ నాలో ఉద్భవించింది. నేనేదో పని గట్టుకుని ప్లాన్‌ చేయలేదు. ఇదో కెరీర్‌ అనుకోలేదు. మొదలెట్టానంతే. ఎక్కడో ఆకాశమంత ఎత్తులో ఉన్న కవిత్వాన్ని నేలపైకి దించి సాధారణ ప్రజానికానికి కూడా చేరవేసిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుంది. వచన కవిత్వానికి ఊపిరులూదిన మహాత్ముడు ఆయన. అలాంటి శ్రీశ్రీ వాక్యాల్ని తీసుకుని ర్యాప్‌గా మలచడం చాలా సులభం. అంటే.. నా దృష్టిలో వచన కవిత్వమే ర్యాప్‌. అక్కడే నాలోని కళకి ఆసరా దొరికింది. తెలుగులో ర్యాప్‌ని వినిపించగలననే నమ్మకం కలిగింది. ప్రయాణం మొదలయ్యింది. నిజానికి ర్యాప్‌ అంటే ‘రిథమిక్‌ పోయిట్రీ’ (ఆర్‌ఏపీ). ఒక రకంగా సూటిగా విషయాన్ని చెప్పడం. అప్పుడే మనం చెప్పే విషయం ఎదుటివారికి స్పష్టంగా చేరుతుంది. ఒక రకంగా పాశ్చాత్య దేశాల్లో పుట్టుకొచ్చిన రాప్‌ అలాంటిదే. అణచివేతకు గురైన వారు వారిలోని భావావేశాన్ని ర్యాప్‌ సాంగ్స్‌ ద్వారా ప్రకటించారు. అలా అనుకుంటే మన దేశంలోనూ ఇదెప్పుడో జరిగింది. ప్రజాకవులుగా పేరొందిన కొందరు ప్రజల వైపు ఉండి వచన కవిత్వంతో చైతన్య పరిచారు. నా దృష్టిలో అవీ ర్యాప్‌లే. ర్యాప్‌ అనేది ప్రజా కవిత్వం. శ్రీశ్రీ రాసిందీ అదే. భాషలోని అర్థం, శబ్దంతో నాకు కిక్‌ దొరికింది. పదాల అమరికపై దృష్టి పెట్టా. అప్పుడు ర్యాప్‌కి మరింత సౌకర్యం దొరికింది.

నా కోణమూ అదే

ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు.. కన్నవాళ్లని అత్యంత కర్కశంగా చంపేస్తున్న సంఘటనలు.. మరెన్నో నన్ను కలచివేసేవి. అలాంటి వాటికి స్పందించకుంటే మనం మనుషులం కాలేం. దిల్లీ నిర్భయ సంఘటన నాలోని రాపర్‌కి పురుడు పోసిందనుకోవాలి. ఆలోచన పుట్టించేలా విప్లవాత్మకంగా అరిచి చెప్పాలనుకున్నా. నాలోని ఆవేశానికి నాదైన కవిత్వాన్ని జోడించి తేలికపడ్డా. మొట్టమొదటిగా ర్యాప్‌తో ముందుకొచ్చింది మాత్రం ‘పానీపూరి’ పాటతోనే. ‘ప్రణవ్‌ చాగంటి’ పేరుతో యూట్యూబ్‌లో ఛానల్‌ క్రియేట్‌ చేసి అప్‌లోడ్‌ చేశా. లక్షల్లో వ్యూస్‌ వచ్చాయ్‌. బాగా వైరల్‌ అయ్యింది. అది మొదలు ఇప్పటి నేనే రాసి, పాడి ర్యాప్‌లు అప్‌లోడ్‌ చేస్తున్నా. సమాజంలో నన్ను బాగా కదిలించిన సంఘటనలతోనే ర్యాప్‌లు సాగుతాయి. ఇలా రాసిపెట్టుకున్నవి ఇంక ఓ 50 ఉన్నాయ్‌. సినిమా అవకాశాలూ వచ్చాయి. కాలా, యుద్ధం శరణం, పైసా వసూల్‌, మెంటల్‌ మదిలో.. ఇలా ఆరేడు సినిమాలకు పాడా. కాలా సినిమాలో నాలుగు పాటలు నేనే రాశా. నేనే పాడా. నాకు మంచి గుర్తింపుని, సంతృప్తినిచ్చాయి.

నాకు గురువు, దైవ సమానం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. ఆయన సాహిత్యమే నాకు ప్రేరణ. ఖడ్గం సినిమాలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..’ పాట ఒక్కటి చాలు. ఈ తరానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలుసుకునేందుకు. అందుకే ఆయన నాకు స్ఫూర్తి. నా ర్యాప్‌ జర్నీకి అన్నయ్య బాగా సపోర్టు చేశారు. నేటి తరానికి అర్థం అవ్వాలంటే ఇవాల్టి భాషని వాడాలి. ఈ తరానికి ఇలాగే చెప్పాలి. అదే ర్యాప్‌ స్టైల్‌. జీన్స్‌, టీషర్ట్‌ వేసుకున్నా భాషపై ప్రేమ చూపించొచ్చు. నేటి సమాజ పోకడల్ని వచన కవిత్వంలో మోడ్రన్‌గా చెప్పేందుకు ర్యాప్‌ సరైన సాధనం.

రైడా రాగాలు

ఫ్లోరైడా అనే ర్యాపర్‌ని ఫాలో అయ్యేవాణ్ని. ఆ పేరులోని రైడాను తీసుకుని ముందు రోల్‌ తగిలించుకున్నా. సౌండింగ్‌ బావుందన్నారు నా స్నేహితులు. నా అసలు పేరు రాహుల్‌ కుమార్‌ వేల్పుల. నా అసలు పేరునే మరిపించేంతగా రోల్‌ రైడా పాపులర్‌ అయ్యింది. ర్యాప్‌ విచిత్రంగా నాకు పరిచయమైంది. ఇంటర్‌లో నాకో గర్ల్‌ఫ్రెండ్‌ ఉండేది. ఆమె వెనకాల పడేవాణ్ని. ఆ అమ్మాయి అక్క కనిపెట్టేసింది. తను సాయం చేస్తానంది. మా చెల్లికి ర్యాప్‌ సాంగ్స్‌ అంటే ఇష్టమంది. లింకిన్‌ పార్కా సాంగ్‌ నేర్చుకోమంది. గూగుల్‌లో వెతికి ఆ పాటను రెండు రోజుల్లో నేర్చుకున్నా. ఆ అమ్మాయి ఇంటికెళ్లి ర్యాప్‌ సాంగ్‌ పాడాను. ఆ తర్వాత తెల్సిందేంటంటే.. వాళ్ల అక్కకి ర్యాప్‌ సాంగ్స్‌ ఇష్టం.. నేనంటే ఇష్టం. అలా ట్రయాంగిల్‌ స్టోరీ అయింది. తర్వాత వాళ్లకి దూరమైనా.. ర్యాప్‌ నా సొంతమైంది. ఇంకెవరైనా అమ్మాయిలు పడతారేమోనని ర్యాప్‌సాంగ్స్‌ నేర్చుకోవటం ప్రారంభించా(నవ్వులు).

పక్కా గల్లీబాయ్‌ని!
‘గల్లీబాయ్‌’ ర్యాపర్‌ జీవితంపై వచ్చిన చిత్రం. ఆ చిత్రానికి నా జీవితానికి కొంత అనుబంధం ఉంది. మా నాన్నది కరీంనగర్‌, మా అమ్మ వరంగల్‌కి చెందినవారు. మధ్యతరగతి కుటుంబం. నాన్న మెకానిక్‌, అమ్మ టైలరింగ్‌ చేసేది. నాకో చెల్లి ఉంది. నేను పుట్టిపెరిగింది సికింద్రాబాద్‌లోని వారాసిగూడలోనే. గల్లీ పోరగాడిగా దుమ్మురేపేవాణ్ణి. కల్లు దుకాణంలోని సీసాలెత్తుకోని పోయి అమ్మేవాడిని. వచ్చిన రెండ్రూపాయలతో వీడియోగేమ్స్‌ ఆడటం, ఎవరైనా ఇళ్లమీద ఇనపరాడ్లుంటే అమ్మేసి వాటితో ఎగ్‌పఫ్‌లు తినటం.. గల్లీల్లో పతంగ్‌లకోసం కొట్లాడటం, క్రికెట్‌లో బెట్టింగ్‌లు వేసుకోవడం.. ఇలా పక్కా గల్లీబాయ్‌ని నేను. ర్యాప్‌ పాటలు పాడుతోంటే.. ‘ముందు చదువుకో బిడ్డా’ అనే వాళ్లు మా అమ్మా, నాన్న. నాకైతే చదువులో మార్కులు బాగా వచ్చేవి. అయితే ఇంగ్లిష్‌ ర్యాప్‌సాంగ్స్‌ పాడేవాణ్ణి. ఇంట్లో వాళ్లకి తెలీకుండా ప్రాజెక్టు అని చెప్పి సంగీతం నేర్చుకునేవాణ్ణి. పాటలు పాడుతూ నన్ను నేను ప్రమోట్‌ చేసుకున్నా. ఓ సారి నా ఇంటర్వ్యూ ఛానెల్‌లో వచ్చింది. అది చూసి మా అమ్మ‘ ఒరే ఈ పిచ్చి సాంగ్స్‌ పాడితే టీవీలో ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారా’ అని అడిగింది. ఆ తర్వాత పేపర్లలో వార్తలొచ్చాయి. దీంతో ఇంట్లోవాళ్లకి నమ్మకమొచ్చింది.

పదేళ్ల కష్టమిది..
నటుడు నోయల్‌ అన్న ర్యాపర్‌ అని తెల్సు. నేను ఇంజినీరింగ్‌ చదివేప్పుడు మెగావాట్‌ అనే ఓ హైదరాబాదీ ర్యాపర్‌ పరిచయమయ్యాడు. కొన్ని వీడియోలతో ఆయన్ని కలిశా. ఆయన ర్యాప్‌లో ఓనమాలు నేర్పించాడు. ఇంగ్లీషు పాటలెందుకు.. తెలుగులో పాటలురాస్తే బావుంటుందనుకున్నా. బస్సులో కాలేజీకి పోయేప్పుడు, ఇంటికి వచ్చేప్పుడు నాకొచ్చింది రాసుకునేవాణ్ణి. ఆ తర్వాత దీనికో అర్థం ఉండాలనుకున్నా. చూస్తుండగానే ఇంజినీరింగ్‌ అయిపోయింది. స్నేహితులకు ఉద్యోగాలొచ్చాయి. నేనేమో మ్యూజిక్‌.. అంటూ తిరిగేవాడ్ని. రికార్డింగ్‌కి వెళ్లి వచ్చిన ఐదువందలు చూసి వీడింతేనేమో అనుకునేవారు. సికింద్రాబాద్‌ నుంచి కృష్ణానగర్‌కి పోవాలంటే వందరూపాయలు కావాల్సి వచ్చేది. నా స్నేహితులను అడుక్కోని వెళ్లేవాణ్ణి. రీఛార్జ్‌ లేకుంటే మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఫ్రెండ్స్‌తో మాట్లాడేవాణ్ణి. బస్‌పాస్‌ తీసుకుని కృష్ణానగర్‌కి వచ్చేవాణ్ణి. రాత్రి ఆలస్యమైతే సికింద్రాబాద్‌నుంచి ఇంటికి నడిచెళ్లేవాణ్ణి. నన్ను చూసి దోస్తులు ‘ఇవి నడవవురా భయ్‌. దీనికోసం కష్టపడుతున్నవేంటిరా’ అనేవారు. ఫంక్షన్లకి వెళ్తే తెల్సినవాళ్లు నెత్తి తింటారని పోకపోయేవాణ్ణి. టీవీల్లో వచ్చాక కూడా ‘జాబ్‌ ఉండాల నీకు అన్నారు’ కొందరు. దీంతో కాల్‌ సెంటర్లో ఉద్యోగం చేశా. పన్నెండు వేలు వచ్చేవి. రాత్రి అంతా ఉద్యోగం చేసి ఉదయం స్టూడియోల చుట్టూ రౌండ్లు కొట్టేవాణ్ణి. సంగీత దర్శకులు ర్యాప్‌ పాడతానంటే వెక్కిరించేవారు. ఓసారి ఓ సంగీత దర్శకుడు పిలిపించాడు. ఉదయంనుంచి మధ్యాహ్నం దాకా వెయిట్‌ చేయించాడు. నా జేబులో డబ్బుల్లేవు. ఒంటి గంటకు ఆకలి ఎక్కువైంది. ఆ సమయంలో ఆయన లోపలికి పిలిచాడు. చికెన్‌ తింటున్నాడాయన. ‘తింటావా’ అంటే ‘తిన్నా సార్‌’ అన్నాను. అయినా.. ఆయన తిన్న ప్లేట్‌లో మిగిలిపోయిన చికెను ముక్కలు, అన్నాన్ని నా దగ్గరకు టేబుల్‌పై దూరంగా విసిరేశాడు. ‘తిన్‌రా భయ్‌. నీకు, నీ ర్యాప్‌కు లైఫ్‌ ఇస్తా. మిగిలిన సగం చికెను ముక్క తిను’ అన్నాడు. నాకు మస్తు బాధేసింది. ఇది వదిలేసేయ్‌రా అన్నారు స్నేహితులు. ఇలాంటి అవమానాలు పడిన చోట స్టూడియోలోనే కామ్రాన్‌ అనే సంగీత దర్శకుడు పరిచయమయ్యాడు. అలా మేం ఇద్దరం కలిసి ‘ఇండస్‌ ఘరానా’ అనే బ్యాండ్‌పేరుతో ‘డ్రీమ్‌’ అనే పాట చేశాం. అందరికీ నచ్చింది. ‘కిరాణా..’ పాట తర్వాత చేసిన పతంగ్‌ నాకు ర్యాపర్‌గా మంచి పేరు తీసుకొచ్చింది. కమర్షియల్‌గా మంచి హిట్‌ అయ్యింది. దిల్‌ఖుష్‌, కటీఫ్‌ చేశా. బిగ్‌ బాస్‌ సమయంలో ‘అరుపు’ పాట చేశా. ఆడపిల్లలపై చేసిన ఈ పాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది.

అదే నా కల..
ర్యాప్‌ అంటే ఒకరు నేర్పించేది కాదు. మన గల్లీ, మనం పడిన కష్టాలు, మన ప్రయాణం.. ఒక్క మాటలో మన జీవితం నుంచే ఇది పుడుతుంది. చాలామంది ‘నేర్పించమ’ని అడుగుతారు. ‘ప్రతి ఒక్కరికీ ఓ లైఫ్‌ ఉంటుంది.. నీ ఇల్లు, నీ ఇబ్బందులు నాకు తెలీవు. అవే చెప్పు, జీవితాన్ని ఆస్వాదించు.. అలాగే ర్యాప్‌ని ఆస్వాదించి పాడు’ అని చెబుతాను వాళ్లకి. ‘హార్ట్‌ అటాక్‌’ ఆడియో ఫంక్షన్‌లో తొలిసారి ర్యాప్‌ వేదికపై పాడాను. ‘బృందావనం’ చిత్రంలో బ్రహ్మానందంగారు కన్పించేప్పుడు వచ్చే ర్యాప్‌ నేనే పాడా. ‘బ్రూస్లీ’ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ నాదే. ‘అఆ’ చిత్రంలో అనసూయ కోసం.. పాటలో ఫుల్‌ ర్యాప్‌ పాడాను. ఈ మధ్య వచ్చిన ‘హుషారు’ లో అవకాశం వచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.