
తాజా వార్తలు
‘ప్రేమికుల రోజు దగ్గరికొస్తోంది. ప్రియురాలికి-ప్రియుడికి ఏమివ్వాలి?’ ప్రేమ చిగురించిన ప్రతి మనసులో మొదలైపోయే ప్రశ్న ఇది. ప్రేమ పెద్ద బహుమానం... మరి ఆ ప్రేమకే బహుమానం ఇవ్వాలంటే కాస్త కొత్తగా, ఇంకాస్త ట్రెండీగా ఉండాలి. మన మనసులోని భావాలు తన హృదయంలోకి నేరుగా వెళ్లేలా ఉండాలి. అవునా! వీటిని ఇవ్వండి. ఇష్టమైన వారి మనసు గెలవండి.
ప్రేమ విత్తనం : నీపై నాకు ప్రేమ చిగురించి ఇలా పెరుగుతూనే ఉందని చెప్పడానికి ఒక మార్గం ఉందండోయ్. అదే ‘మ్యాజిక్ బీన్’. ఇదో విత్తనం. దీనికి వారం రోజులు నీరు పోస్తే.. ఆ విత్తనం పెరుగుతుంది. అప్పుడు దానిపై ‘ఐ లవ్ యూ’ అని రాసిన అక్షరాలు కన్పిస్తాయి. భలే ఉంది కదా!
బంగారు రోజా : ఎర్రని రోజా పువ్వు ఇచ్చి మనసులో మాట చెప్పడం అందరూ చేసే పనే. కొంచెం కొత్తగా ఆలోచిస్తే... బంగారు రోజా ఇవ్వండి. దాంతో పాటు... అందమైన ఆరు చిన్న బాటిళ్లల్లో మీ హృదయ స్పందనను మాటలుగా రాసి అందించండి. తన ముఖంపై పూసే సంతోషంలో మీరు తడసి ముద్దయిపోతారు.
లవ్ పేపర్ : మీ ఇద్దరు ప్రేమలో మునిగిపోయినప్పుడు దిగిన ఫొటో... అందమైన పేజినేషన్తో దినపత్రిక మొదటి పేజీలో కవర్ అయితే ఎంత బాగుంటుంది. అమ్మో అంత డబ్బు ఎక్కడ పెడతాం అంటారా? అందుకే ‘లవ్టైమ్స్’ పేరుతో మీకు మాత్రమే ఒక పేపర్ ముద్రించి ఇస్తారు. దీన్ని వాలెంటైన్ డే రోజు మనం ప్రేమించిన వారికి ఇచ్చి చూడండి. తన గుండె గుడిలో మీ విగ్రహమే వెలుస్తుంది.
మనసైన కాలం : ప్రేమలో ఉంటే యుగాలైనా క్షణాల్లా గడిచిపోతాయి. అలా ప్రతి క్షణాన్ని మీ హృదయ స్పందనతో ముడిపెడుతూ కాలం పరుగులు తీస్తుంటే! అనుక్షణం మన మనసు తన మనసు లయ వింటుంటే! బాగుంటుంది. అందుకే ఈ ప్రేమ గడియారం. మీరిద్దరూ దిగిన ఫొటోను బ్యాక్‌డ్రాప్‌గా మంచి వాచీ తయారు చేయించి ఇస్తారు. దీన్ని తీసుకెళ్లి ఇచ్చి... వాళ్ల కళ్లలోకి చూడండి. కాలం ఆగిపోయినట్లు కన్పిస్తుంది. ఇలా ఫొటోలతోనే ఎల్ఈడీ పిల్లోస్, షోకేస్ పిల్లోస్ సిద్ధంగా ఉన్నాయి.
మనసే మోగెనే : ‘ఐ లవ్ యూ... ఐ లవ్ యూ’ అంటూ మన మనసులోని మాట ఎప్పుడూ తన చెవిని తాకుతుంటే... అందమైన పింక్ లైటింగ్ తన కళ్లలో మన రూపం చిత్రీకరిస్తుంటే..! అలా హాయిగా ఉండటానికే ‘మ్యూజిక్ ఎల్ఈడీ లైటింగ్ స్టాండ్స్’ మార్కెట్లో దొరుకుతున్నాయి. కొనండి. ఇవ్వండి. ప్రేమ కాంతులై వెలిగిపోండి.