వాడేయడానికి మాటేం డేటా కాదు!
close

తాజా వార్తలు

Published : 26/01/2019 00:20 IST

వాడేయడానికి మాటేం డేటా కాదు!

తోచిందేదో మాట్లాడేస్తారు. క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.. నచ్చిందేదో చేసేస్తారు. కెరీర్‌లో దూకుడుగా వ్యవహరిస్తారు..
తమని తామే ప్రేమించుకుంటారు.. .. వీళ్లంతా ఎవరు? మిలీనియల్స్‌.
మాట జారడం వీరికి తెలియదు. ఎప్పుడూ నియంత్రణ కోల్పోరు.. బాధ్యతగా ప్రవర్తిస్తారు ఎదుటివారి కోణంలో ఆలోచిస్తారు.. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ... మరి, వీళ్లు?
వినయ విధేయ మిలీనియల్స్‌. అదేనండీ.. సినిమాటిక్‌గా చెప్పాలంటే వినయ విధేయ రాముళ్లు!! వీళ్లంతా.

మీరు దేంట్లోకి వస్తారు? తెలుసుకుని తీరాలి. లేకుంటే.. చదువు.. కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగలొచ్చు. ఒత్తిడి కోరల్లో చిక్కుకోవచ్చు. ఎలాగంటే.. క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ మాదిరే. క్రికెట్‌ని కెరీర్‌గా మలుచుకుని వారిదైన ప్రత్యేకతని చాటుతూ సాగిపోతున్న తరుణంలో సస్పెన్షన్‌ వేటు. ఊహించని ఓ కుదుపు. ఇంటికే పరిమితం. గది దాటలేని పరిస్థితి. కారణం? ఓ షోలో నోరు జారి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం. ఏళ్లు కష్టపడి సాధించిన గుడ్‌విల్‌ మొత్తం గంగలో కలిసిపోయింది. పొగిడినవారే ప్రవర్తన సరైంది కాదంటున్నారు. వారీ పరిస్థితికి ఎందుకొచ్చారు? కేవలం మిలీనియల్‌్్సలానే ఆలోచించడం.. తోచిందేదో మాట్లాడేయడం..!! దానికి పర్యవసానంగా తగిన మూల్యం చెల్లించుకోవడం. అందుకే నేటి తరం వినయ విధేయ రాముళ్లుగా మారాల్సిన అవసరం ఉందని మానసికశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకు ఏం చేయాలి? ఏదైనా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కోర్సు చేయాలనుకునేరు. ఏం అక్కర్లేదు. ‘మాట జాగ్రత్త!’ అనుకుంటే చాలు. ఎందుకంటే.. మాటేం చౌకగా దొరుకున్న మొబైల్‌ డేటా కాదు. అన్‌లిమిటెడ్‌ అని అదుపు లేకుండా వాడేయడానికి. మీ నెట్‌వర్క్‌ పరిధిని పెంచే సెల్‌ టవర్‌ లాంటిది. అదుపు చేయకుంటే టవర్‌ కూలిపోయే ప్రమాదం ఉంది.
 

మైండ్‌ పవర్‌ ఒక్కటే కాదు

* నెల రోజులుగా నగేష్‌కి విశ్రాంతి లేదు. గడువు తేదీకల్లా ప్రాజెక్టుని పూర్తి చేశాడు. టీఎల్‌గా బృందంతో పోటీ పడి శ్రమించాడు. బాస్‌ పిలిచి కంగ్రాట్స్‌ చెప్పి విందుకు ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్టు అనుభవాన్ని పంచుకునే క్రమంలో ‘కోట్ల రూపాయల ప్రాజెక్టు.. నేను చేసిన కోడింగ్‌ వల్లే పూర్తయింది.’ అనగానే బృందం ముఖాల్లో చిరునవ్వు చెరిగిపోయింది. ఒక్కమాటతో ప్రాజెక్టు క్రెడిట్‌ అంతా నగేష్‌కి చెల్లినట్లయింది. బాస్‌కి టీఎల్‌గా నగేష్‌ మాట్లాడే విధానం నచ్చలేదు. దాని ప్రభావం తర్వాత ప్రాజెక్టులో పడింది. టీమ్‌లీడర్‌ కాస్త టీమ్‌లో ఒక్కడయ్యాడు.

* చదువు, కెరీర్‌ ఎందులోనైనా మేధస్సుకి పదును పెడితే చాలు. మార్కులు బాగా వచ్చాయ్‌. లాజిక్‌పైన పట్టుసాధిస్తే చాలు. టీఎల్‌ దగ్గర మంచి మన్ననలు పొందొచ్చు.. అనుకునే పోటీ ప్రపంచంలో ‘మాట పవర్‌’కి ఉన్న ప్రాధాన్యతని మర్చిపోతున్నారు. కానీ, మాటలు తూటాల్లా తగిలే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. మైండ్‌ పవర్‌ కంటే మాటకే ఎక్కువ పవర్‌ ఉంటుందని. ఇప్పుడు కంపెనీలు ‘ఐక్యూ’ల కంటే ‘ఈక్యూ’, ‘ఎస్‌క్యూ’ల పైనే దృష్టిపెడుతున్నారు.

మాటల్లోనే కాదు... చేతల్లోనూ అవే జాగ్రత్తలు అవసరం. చేజారాక పొరపాటైందనో... తెలియక జరిగిందనో చెబితే క్షమించేవారు తక్కువ. తటాలున చెయ్యెత్తడం.. కాలు దువ్వినట్లు రెచ్చగొట్టడం... వేలు చూపించడం... పెదవి కొరకటం, కన్ను గీటడం, కనుబొమలు ఎగరేయడం... వంటి వాటి విషయాల్లో అప్రమత్తత అవసరం. మన ఈ చేతలు ఏ సందర్భంలో వాడుతున్నాం... ఎవరి ఎదుట చేస్తున్నాం.. అనే విషయాలు గుర్తుంచుకొని నడుచుకుంటే ప్రమాదం ఉండదు.

మాటకి ముందు!

* సందర్భం ఏంటనేది తెలుసుండాలి
* మాట్లాడే అంశంపై అవగాహన ఉండాలి
* బాధ్యత కలిగి మాట్లాడాలి
* మాట తీరుని విశ్లేషించుకోవాలి
* సున్నితమైన అంశాలకు దురుసు మాటలొద్దు
* మాటల్లో మీదైన స్టైల్‌ ఉండాలి
* చక్కని పదజాలం అనివార్యం
* టక్కున స్పందించాలి
* నొప్పించేలా స్పందించొద్దు
* ఎదుటివారి దృష్టికోణం కూడా వినిపించాలి
* నెగిటివ్‌ అంశాల్ని పాజిటివ్‌గా చెప్పాలి
* మాటల్లో స్పష్టత అవసరం

‘ఏక్యూబ్‌’ ఫార్ములా

* ప్రశాంత్‌ ఆఫీస్‌లో హుందాగా వ్యవహరిస్తాడు. కానీ, ఓపిక తక్కువ. ముక్కుసూటిగా సమాధానం చెబుతాడు. ఇక ఇంటికొస్తే చాలు. ఒకటే విసుగు. చిన్నా.. పెద్దా.. అని చూడడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అదే ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే నోరు మెదపడు. మిత భాషిలా ప్రవర్తిస్తాడు.

* ఇక్కడ ప్రశాంత్‌కి ‘ఏక్యూబ్‌ ఫార్ములా’ తెలియదన్నమాట. అంటే.. ‘ఎక్కడ? ఎలా? ఎందుకు?’ మాట్లాడుతున్నాం? అనే స్పష్టత లేకపోవడం. మరైతే, తనకి ఫార్ములాని అభ్యసించాలంటే? ఐక్యూతో పాటు ‘ఈక్యూ’ (ఎమోషన్‌ కొషెంట్‌), ‘ఎస్‌క్యూ’లను (సోషల్‌ కొషెంట్‌) ఒంటపట్టించుకోవాలి. ఆఫీస్‌లో హుందాగా వ్యవహరించే వాడు. ఇంటికొచ్చాక అరుపులు.. కేకలు వేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తున్నాడంటే.. అతనికి ఎమోషనల్‌ కొషెంట్‌ లేదని అర్థం. ఇతరుల భావాల్ని అర్థం చేసుకునే స్థితి లేకపోవడం. ఇదే మాదిరిగా చుట్టాలొస్తే మూతి ముడుచుకుని కూర్చుంటున్నాడంటే.. వారికి సోషల్‌ కొషెంట్‌ సున్నా అని పరిగణించాలి. సమాజం 
పట్ల స్పష్టమైన వైఖరి లేకపోవడం. వారి ఇష్టాలు, అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇస్తారు. దీంతో వారికి తెలిసిందే మాట్లాడి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు.

దృష్టి కోణం మారాలి

* ప్రసన్న ఆఫీస్‌లో ఎవ్వరితోనూ కలవదు. ఎవరైనా ఏదైనా అడిగితే ‘రాననో.. నాకిష్టం లేదనో.. ఎందుకనో..’ అన్నీ పొడి పొడి మాటలే. తనకి అసలు మాట్లాడడం రాదనేది అందరి ఫీలింగ్‌. దీనికి ప్రసన్న సమాధానం ఏంటంటే.. తనకి నచ్చేలా ఇతరులు ప్రవర్తించకపోవడం. ఒక్క ఆఫీస్‌లోనే కాదు.. ఇంట్లో.. బయట.. అంతటా ఇదే సమస్య.

* ఇక్కడ ప్రసన్న గుర్తించాల్సిందేంటే.. తనకి నచ్చేలా ఎవ్వరూ ప్రవర్తించరని. తనే అందరికీ నచ్చేలా ప్రవర్తించాలని. అప్పుడే కెరీర్‌లో నెగ్గుకురాగలదు. అందుకు ఉన్న ఏకైక మార్గం మాట. సందర్భం ఏదైనా.. ఎక్కడైనా.. కేవలం మన దృష్టి కోణం నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తే ముప్పులు తప్పవు. కెరీర్‌ అయినా క్రికెట్‌ అయినా!

ఆలోచించాలి.. స్వీకరించాలి

* తెలిసో.. తెలియకో పాండ్య, రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మైదానంలో అంటుకున్న దుమ్ము కాదు. దులుపేసుకుని పరిగెత్తడానికి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలనే అనుకుంటారు అందరూ. కానీ, పొరబాటున నోరు జారితే!!

* స్వీకరించే స్థితిలో ఉండగలగడం మంచి లక్షణం. ఆఫీస్‌ మీటింగ్‌.. కాన్ఫెరెన్స్‌ కాల్‌.. గ్రూప్‌ డిస్క్‌షన్‌.. ఏదైనా కావచ్చు. తప్పుగా మాట్లాడితే తక్షణం స్వీకరించాలి. అంతేగానీ.. జారిన మాటని కప్పేందుకు మరిన్ని మాటల్ని జారవిడుచుకోవద్దు. అంతేకాదు.. ఆ సందర్భంలో ఎలా మాట్లాడితే బాగుండేదో అడిగి తెలుసుకోవాలి. అతి చురుకైన నాలుకని కంట్రోల్‌ చేయడానికి అభ్యాసన అవసరం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని