close

ప్రధానాంశాలు

లాక్‌డౌన్‌తో భారీ నష్ట నివారణ

అది లేకుంటే 29 లక్షల కేసులు, 78 వేల మరణాలు సంభవించేవి
దేశంలో 90% కేసులు, మరణాలు పది రాష్ట్రాల్లోనే...
నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌

ఈనాడు, దిల్లీ: లాక్‌డౌన్‌ అమలు ద్వారా దేశంలో కరోనా కేసులు, మరణాలను భారీ సంఖ్యలో తగ్గించగలిగినట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాధికార కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ పాల్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ లేకుంటే దేశంలో కేసుల సంఖ్య 14 లక్షల నుంచి 29 లక్షల వరకూ; మరణాలు 37 వేల నుంచి 78 వేల వరకూ సంభవించి ఉండేవన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ శ్రీవాత్సవతో కలిసి శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడారు.
‘‘మార్చి 25న విధించిన తొలి లాక్‌డౌన్‌ ఫలితాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో 22.6 శాతానికి పెరిగిన కేసుల రోజువారీ వృద్ధి రేటు... మే 15 నాటికి 5.5 శాతానికి చేరింది. 71 శాతానికి వెళ్లిన రోజువారీ మరణాల వృద్ధిరేటు కూడా మే 15 కల్లా 5.5 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌కి ముందు 3.4 రోజులకే కేసులు రెట్టింపుకాగా... అందుకు ఇప్పుడు 13.3 రోజులు పడుతోంది. వ్యాక్సిన్లు, ఔషధాలు అందుబాటులోకి రావడానికి ఏడాది కాలం నిరీక్షించాల్సిందే.
ఇది పట్టణప్రాంత వ్యాధి
లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ వ్యాప్తి కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. 90% కేసులు పది రాష్ట్రాలకు పరిమితం కాగా, 80% క్రియాశీల కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 60% పైగా కేసులు ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, ఠాణేల్లోనే ఉన్నాయి. పుణె, ఇండోర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లను కూడా కలిపితే 70% కేసులుంటాయి. 80% మరణాలు 5 రాష్ట్రాల్లో, 95% మరణాలు పది రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్నాయి. 60% మరణాలు కేవలం అయిదు నగరాలకే పరిమితమయ్యాయి. దీంతో మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వొచ్చన్న విశ్వాసం కలిగింది.
మున్ముందు కరోనాతో ప్రయాణం సులభం కాదు...
ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆసుపత్రుల్లో 3.24 లక్షల పడకలను, సాధారణ కేసుల పర్యవేక్షణకు మరో 6.50 లక్షల పడకలను సిద్ధం చేశాం. మన దగ్గర హెర్డ్‌ ఇమ్యూనిటీ లేనందున జాగ్రత్తలు తప్పనిసరి. మాస్కులు ధరించడం, దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, వృద్ధులను కాపాడటం అత్యవసరం. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి. ఆలస్యం చేస్తే ఇబ్బందులొస్తాయి. మున్ముందు కరోనాతో ప్రయాణం అంత సులభం కాదు. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, పంచాయతీలవారీగా ప్రణాళికలు అమలుచేయాలి. లాక్‌డౌన్‌ను సుదీర్ఘకాలం కొనసాగించలేం కాబట్టి... మన ప్రవర్తన ద్వారా వైరస్‌ను అడ్డుకోవాల్సి ఉంది’’ అని వినోద్‌ పాల్‌ అన్నారు.
కేసులు ఎంతవరకూ చేరతాయో చెప్పలేం
మే 15 నాటికి కేసులు పూర్తిగా తగ్గుతాయని గత నెలలో అప్పటి పరిస్థితులను బట్టి చెప్పానని వినోద్‌ పాల్‌ అన్నారు. కేసులు జీరో అవుతాయని తాను చెప్పలేదని, తాను చూపించిన గ్రాఫ్‌లోనూ ఆ విషయం లేదన్నారు. అయితే తప్పుగా అర్థం చేసుకునేలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరారు. భారత్‌లో కేసులు ఎంతవరకూ చేరతాయో చెప్పలేమన్నారు. ఇది ప్రజల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని, గ్రామాలను వైరస్‌ నుంచి రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.
-----
లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత ఐదు సంస్థల ద్వారా చేయించిన అధ్యయన అంచనాలను శ్రీవాస్తవ వెల్లడించారు. వాటి ప్రకారం లాక్‌డౌన్‌ అమలు ద్వారా పరిహరించిన కరోనా కేసులు, కాపాడిన ప్రాణాలు ఇలా...
అధ్యయన సంస్థ                      కేసులు             ప్రాణాలు
బీసీజీ                                36-70 లక్షలు      1.2-2.1 లక్షలు
పీహెచ్‌ఎఫ్‌ఐ                             -              78,000
ఎంకే అండ్‌ ఆర్‌                      23 లక్షలు           68,000
ఏపీ, ఆర్‌ఎంఎం, ఎస్‌ఎం, పీఎన్‌        15.9 లక్షలు,         91,000
ఎంఓఎస్‌పీఐ, ఐఎస్‌ఐ                 20 లక్షలు           54,000
మొత్తం పరిధి                        14-29 లక్షలు          37-78 వేలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.