ఆ దేశంలో టీకాలు మొదట వృద్ధులకు కాదు..!

తాజా వార్తలు

Published : 04/01/2021 23:35 IST

ఆ దేశంలో టీకాలు మొదట వృద్ధులకు కాదు..!

జకర్తా: ఇప్పటికే కొవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్రిటన్, అమెరికా వంటి దేశాలు వృద్ధులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం వయసు మళ్లిన వారిలోనే అధికంగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో వారికే మొదటగా టీకాలు అందిస్తున్నాయి. కానీ, ఇండోనేసియా విధానం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆరోగ్య కార్యకర్తలు, పబ్లిక్ సర్వెంట్ల తరవాత 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారికి టీకాలు అందించాలని భావిస్తోంది.

ప్స్త ఇండోనేసియా చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాపైనే ఆధారపడింది. అయితే, వృద్ధులపై ఆ టీకా పనితీరు గురించి సమాచారం వెల్లడికాలేదు. దాంతో 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న వ్యక్తులకు ఆ టీకాను అందించాలని ఆ దేశం భావిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించి 18 ఏళ్లు పైబడిన వారిలో క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి. 125.5 మిలియన్ల సినోవాక్‌ టీకా డోసుల కోసం ఆ ఫార్మా సంస్థతో ఇండోనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో 3 మిలియన్ల డోసులు ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్నాయి. ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు కూడా కొద్ది నెలల్లో అక్కడికి చేరనున్నాయి. అయితే వృద్ధులకు కాకుండా పనిచేసే వయస్సులో ఉన్నవారికి ఆ దేశం టీకాలు అందించాలనే విధానంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనిపై సింగపూర్ యూనివర్సిటీలోని యోంగ్‌ లూ లిన్ స్కూల్ ఆఫ్‌ మెడిసిన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న ప్రొఫెసర్ డేల్ ఫిషర్ ఇండోనేసియా విధానంలోని అంతరార్థాన్ని వివరించారు. ‘పనిచేసే వయస్సులో ఉన్న వయోజనులు ఎక్కువ చురుగ్గా ఉంటారు. అందరితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే ఇండోనేసియా విధానాన్ని అనుసరిస్తూ.. వృద్ధులకు టీకాలు వేయడం కంటే ఈ వయస్సు వారికి టీకాలు అందించడం వల్ల వైరస్ వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. అయితే వృద్ధుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వారికి ముందుగా టీకాలు వేయడంలో కూడా హేతుబద్ధత ఉంది.  రెండింటిలో లాభాలున్నాయి’ అని వెల్లడించారు. 

త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీ, ఆర్థిక వ్యవస్థ రికవరీ..
ఎక్కువగా రాకపోకలు సాగించే, ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే వర్గాలకు టీకాలు ఇవ్వడం ద్వారా త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చని ఇండోనేసియా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 67శాతం మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అందుకోసం 427 మిలియన్ల డోసులు టీకాలు అవసరం కానున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే, హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకోవడంపై నిపుణులు ఇప్పటికీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందో లేదో నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అంటున్నారు.

అలాగే 100 మిలియన్ల మందికి విజయవంతంగా టీకాలు వేయగలిగితే ఆర్థిక కార్యకలాపాల్లో చురుకుదనం వస్తుందని ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గృహ వినియోగం 50 శాతం కంటే ఎక్కువ దోహదం చేస్తుందని, కాబట్టి ఆ వయసు వారు ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు ప్రజల విశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగ్నేయాసియాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండోనేసియా రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారి ఆర్థిక మాద్యంలోకి కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ 2.2 శాతం క్షీణించిందని అక్కడి  ప్రభుత్వం అంచనా వేసింది. 

ఇవీ చదవండి:

82 ఏళ్ల వ్యక్తికి ఆక్స్‌ఫర్డ్ తొలి టీకా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని