పతకాన్ని ఎందుకు కొరుకుతారో తెలుసా?

తాజా వార్తలు

Published : 22/07/2021 01:17 IST

పతకాన్ని ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్: ఒలింపిక్స్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడోత్సవం‌. అనేక దేశాలకు చెందిన అథ్లెట్లు వివిధ విభాగాల్లో పతకాల కోసం పోటీ పడుతుంటారు. జపాన్‌లోని టోక్యో వేదికగా మరో రెండ్రోజుల్లో జరగబోయే క్రీడల్లోనూ భారత్‌ తరఫున 119 క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. ఇదంతా పక్కనపెడితే.. ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు గెలిచిన విజేతలు పతకాన్ని పంటి కింద పెట్టి కొరుకుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు. మీరు అది గమనించారా? ఎందుకలా చేస్తారనే సందేహం కలిగిందా? అయితే, ఇది చదవండి..

నిజానికి, ఇలా ఒలింపిక్స్‌ విజేతలు పతకాన్ని కొరకడానికి ప్రత్యేక కారణం, నేపథ్యం ఏమీ లేవు. ఫొటోగ్రాఫర్లు విజేతలను ఫొటోలు తీస్తూ పోజులివ్వమని అడుగుతుంటారు. గతంలో ఓసారి ఫొటోగ్రాఫర్లు అథ్లెట్లను ఊరికే నవ్వుతూ నిలబడే కన్నా.. కాస్త భిన్నంగా పోజులివ్వమని కోరారట. అయితే, ఎవరు.. ఎప్పుడు ప్రారంభించారో తెలియదు కానీ.. ఓ అథ్లెట్‌ పతకాన్ని కొరుకుతూ ఇచ్చిన పోజు ఫొటోగ్రాఫర్లకు తెగ నచ్చేసింది. దీంతో అప్పటి నుంచి పతకం గెలిచిన క్రీడాకారులను ఆ విధంగా పోజివ్వమని చెప్పడం మొదలుపెట్టారు. గతంలో విజేతలు ఇచ్చిన విధంగానే ఆ తర్వాత విజేతలు పతకాన్ని కొరకడం ప్రారంభించారు. అలా ఇదో సంప్రదాయంగా మారిపోయింది. ఈ విషయంపై గతంలో ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఒలింపిక్‌ హిస్టోరియన్‌ అధ్యక్షుడు డేవిడ్‌ వాలెచిన్‌స్కీ వివరణ ఇచ్చారు. ‘‘ఇది ఫొటోగ్రాఫర్లు అలవాటు చేసిందే. ఆ పోజులో క్రీడాకారుల ఫొటోలు బాగా అమ్ముడుపోతాయనే ఉద్దేశంతో ఫొటోగ్రాఫర్లు అలా చేయించి ఉండొచ్చు. అంతేకానీ.. క్రీడాకారులు స్వతహాగా పతకాన్ని కొరకాలి అనుకోరు’’అని చెప్పారు.

అయితే, ఇలా ఒక లోహాన్ని కొరకడమనేది కొన్ని శతాబ్దాల కిందటి నుంచి ఉన్నదే. పూర్వం వాణిజ్యంలో బంగారు, వెండి నాణెలు చలామణీ అయ్యేవి. బంగారు నాణెలు నిజమైనవా కావా అని తెలుసుకోవడం కోసం వర్తకులు నాణెన్ని కొరికి పరీక్షించేవారు. నాణెంపై పంటి గుర్తులు పడితే అది నాణ్యమైన బంగారం అని.. లేదంటే కల్తీ అయిందని గుర్తించేవారు. కానీ, ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని మొత్తం బంగారంతో చేయరు. వెండి పతకానికి బంగారు పూత పూస్తారు. దీంతో పతకం మందంగా, ధృడంగా కనిపిస్తుంటుంది. ఈ సారి ఏకంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి సేకరించిన లోహాలతో పతకాలను తయారు చేయడం విశేషం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని