617 రకాన్ని నిలువరిస్తున్న Covaxin: ఫౌచీ

తాజా వార్తలు

Updated : 28/04/2021 15:25 IST

617 రకాన్ని నిలువరిస్తున్న Covaxin: ఫౌచీ

భారత్‌లో కొవిడ్ కల్లోలం: ధనిక దేశాలపై ఆగ్రహం

వాషింగ్టన్‌: ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ అసమానతలకు నిదర్శనమని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెండు లక్షల మార్కును దాటిన క్రమంలో.. ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘ప్రపంచాన్ని కమ్మేసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్పందన అవసరం. అసమానతలు లేకుండా సహకరించుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తూ..అది సాధ్యం కాలేదు. ఇది ధనిక దేశాలు తీసుకోవాల్సిన బాధ్యతని నేను అనుకుంటున్నాను. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ కొరతతో ప్రజలు మరణిస్తున్న భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజాసమస్యల విషయానికి వస్తే సాధ్యమైనంత సమానత్వాన్ని పొందేలా చూడాలి’ అని భారత్‌లోని కొవిడ్‌ పరిస్థితులను ఉద్దేశించి ఫౌచీ తీవ్రంగా స్పందించారు. అలాగే ఆరోగ్య సంరక్షణ విషయంలో సమానంగా వనరులను కల్పించడంలో విఫలం కావడంపై ఆయన ధనిక దేశాలను నిందించారు. ప్రస్తుతం భారత్ వ్యాప్తంగా 3.6లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. 3,293 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ దేశంలో లేని కరోనా కొత్త కేసులు భారత్‌ వ్యాప్తంగా నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, ఆక్సిజన్, పడకల కొరత వార్తలు బాధితులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 

617 కరోనా రకాన్ని నిలువరిస్తున్న కొవాగ్జిన్..

దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 617 కొవిడ్ రకాన్ని నిలువరించగలదని గుర్తించినట్లు ఫౌచీ వెల్లడించారు. భారత్‌లో వినియోగిస్తోన్న ఈ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఓ సమావేశంలో భాగంగా చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ..వ్యాక్సినేషన్ ప్రధానమైన విరుగుడని ఆయన స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా..ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ‘భారత్ రకం’ కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఈ టీకాలు పొందిన వారిలో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ సోకినా స్వల్ప అనారోగ్యమే తలెత్తవచ్చని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌పై సీసీఎంబీ నిర్వహించిన మరో అధ్యయనంలోనూ ఇవే సానుకూల ఫలితాలు వచ్చాయి. కరోనాలో కొత్తగా వచ్చిన బి.1.617 రకాన్ని ‘జంట ఉత్పరివర్తనల’ వైరస్ లేదా ‘భారత్‌ రకం’గా పిలుస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని