టీకాలతో తగ్గుతున్న మహమ్మారి ముప్పు!

తాజా వార్తలు

Published : 23/04/2021 15:45 IST

టీకాలతో తగ్గుతున్న మహమ్మారి ముప్పు!

బ్రిటన్‌ అధ్యయనాల్లో నిరూపితం

లండన్‌: ప్రపంచ దేశాలపై పడగవిప్పిన కరోనా మహమ్మారిపై వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు వాస్తవ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కనీసం ఒక్క డోసు తీసుకున్న వారిలోనూ కొవిడ్‌ ముప్పు గణనీయంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అన్ని వయసుల వారిలోనూ వైరస్‌ బారినపడే వారి సంఖ్య 65శాతం తగ్గిందని బ్రిటన్‌ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయన సమాచారాన్ని బ్రిటన్‌ అధికారికంగా విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో టీకా పంపిణీ అవుతున్న దేశాల్లో వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌లపై తాజాగా వచ్చిన వాస్తవ ఫలితాలు (ప్రయోగాల్లో కాకుండా) ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి జేమ్స్‌ బెథెల్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌లు అత్యంత ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం ప్రపంచంలోనే వ్యాక్సినేషన్‌ను అతివేగంగా చేపట్టిన బ్రిటన్‌ ఫలితాల ద్వారా నిరూపితమవుతోందన్నారు. యువకులు, ఆరోగ్యవంతులతో పోలిస్తే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలోనూ వైరస్‌ ముప్పు గణనీయంగా తగ్గినట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

65శాతం తగ్గుదల..

వ్యాక్సిన్‌ల వాస్తవ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, జాతీయ గణాంక సంస్థతో బ్రిటన్‌ ఆరోగ్యశాఖ రెండు అధ్యయనాలు జరిపింది. డిసెంబర్‌ 1, 2020 నుంచి ఏప్రిల్‌ 3, 2021 మధ్య కాలంలో 3,73,402 మంది నుంచి పలు దఫాల్లో ముక్కు, గొంతు ద్వారా స్వాబ్‌ నమూనాలు సేకరించింది. ఇలా నాలుగు నెలల కాలంలో సేకరించిన 16లక్షల శాంపిళ్ల ఫలితాలను పరిశోధకులు విశ్లేషించారు. అయితే, వీరిలో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత చూస్తే.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 65శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. లక్షణాలున్న ఇన్‌ఫెక్షన్‌లు 74శాతం తగ్గగా.. లక్షణాలు కనిపించని కేసుల్లో 57శాతం తగ్గుదల కనిపించిందని కనుగొన్నారు. ఇక రెండో డోసు తీసుకున్న తర్వాత మొత్తం కేసుల్లో 70శాతం తగ్గుదల కనిపించిందని బ్రిటన్‌ పరిశోధకులు వెల్లడించారు.

యాంటీబాడీ పరీక్షల్లోనూ..

కేవలం స్వాబ్‌ నమూనాలతోనే కాకుండా వ్యాక్సిన్‌ పనితీరును ధ్రువీకరించేందుకు పరిశోధకులు యాంటీబాడీ స్థాయిలపై అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత, రెండు డోసుల అనంతరం యాంటీబాడీల స్థాయిలను పరీక్షించారు. సింగిల్‌ డోస్‌ తీసుకున్న వృద్ధుల్లో యాంటీబాడీల స్థాయిలో కాస్త తక్కువగానే ఉన్నాయని.. కానీ, రెండు డోసులు(ఫైజర్‌) తీసుకున్న అన్ని వయసుల వారిలో యాంటీబాడీలు గణనీయంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

కొందరిలోనే వైరస్‌ వ్యాప్తి..

వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ కొందరికి వైరస్‌ సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించామని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ పరిశోధకుడు డాక్టర్‌ కొయెన్‌ పౌవెల్స్‌ పేర్కొన్నారు. అయితే, వీరి నుంచి వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు కనుగొన్నామన్నారు. అందుకే మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యమని పునరుద్ఘాటించారు.

బ్రిటన్‌ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, అక్కడ ఇప్పటివరకు 4కోట్ల 44లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. వీరిలో 3.3కోట్ల మంది తొలి డోసు తీసుకోగా, మరో కోటి 11లక్షల మంది రెండు డోసులను తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని