బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్‌

తాజా వార్తలు

Updated : 19/03/2021 13:55 IST

బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్‌

ఎందుకంటే..?

లండన్: వచ్చే నెలలో బ్రిటన్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదించనుంది. సరిపడా టీకా డోసుల లభ్యత లేకపోవడమే అందుకు కారణం. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అందాల్సిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ఎగుమతిలో జాప్యం జరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి సరఫరా తగ్గిపోనుందని తెలిపారు. ఐరోపాలో కొన్ని దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ఈ పరిణామం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా పంజా విసరడంతో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న బ్రిటన్‌ దాని నుంచి బయటపడేందుకు భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రజలకు టీకా అందిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే బ్రిటన్‌కు చేరిన దాదాపు 1.7 మిలియన్ డోసుల్ని మరోసారి పరీక్షించాలని నిర్ణయించారు. అవి రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా అందిన నేపథ్యంలోనే వాటి సామర్థ్యాన్ని మరోసారి ధ్రువీకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే అవి ఏ సంస్థకు చెందిన టీకాలనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇది కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదించడానికి ఓ కారణం కానుంది. ‘‘స్వల్ప కాలం పాటు మేం అనుకున్న దానికంటే తక్కువ డోసులు అందనున్నాయి. భారత్‌లోని సీరం నుంచి అందాల్సిన టీకాలు ఆలస్యం కానుండడంతో పాటు బ్రిటన్‌లో ఉన్న కొన్ని వ్యాక్సిన్లను మరోసారి పరీక్షించాల్సి ఉండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మా వద్ద తక్కువ డోసులు ఉండనున్నాయి. అయితే, ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం ఎక్కువ డోసులే అందుతాయి. అలాగే మేం నిర్దేశించుకున్న లక్ష్యానికి సరిపడా డోసులు ఉన్నాయి’’ అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకాలను బ్రిటన్‌ తమ దేశ పౌరులకు అందిస్తోంది. ఆస్ట్రాజెనెకా నుంచి 100 మిలియన్‌ డోసుల్ని ఆర్డర్‌ చేసింది. వీటిలో 10 మిలియన్లు భారత్‌లోని సీరం నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే, ఐదు మిలియన్ల డోసుల్ని ఇప్పటికే బ్రిటన్‌కు ఎగుమతి చేశామని సీరం ఇటీవల తెలిపింది. మిగతా డోసుల్ని భారత ప్రభుత్వ అవసరాలను అనుసరించి పంపుతామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో టీకా ఎగుమతులను భారత ప్రభుత్వం నియంత్రిస్తోందా? అన్న ప్రశ్నకు..  బోరిస్‌ జాన్సన్‌ ‘లేదని’ సమాధానం ఇచ్చారు. ఇలాంటి జాప్యం సాధారణంగా జరుగుతుంటుందని.. కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం జరుగుతుందోని స్పష్టం చేశారు. సీరంతో కలిసి పనిచేయడాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని