చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం

తాజా వార్తలు

Updated : 08/01/2021 16:11 IST

చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం

మరోసారి లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మహమ్మారితో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. చివరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా శ్మశాన వాటికల్లో చోటు లభించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రులకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఆ దేశంలో అందుబాటులో ఉన్న అధునాతన వైద్య సదుపాయాలకే ఈ వైరస్ సవాలు విసురుతోంది. ఏ దేశంలో లేని కరోనా మరణాలు అక్కడ సంభవిస్తున్నాయి. 

తాజాగా జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించి వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో (అమెరికా కాలమానం ప్రకారం) 3,998 మంది కొవిడ్‌-19తో మృతి చెందారు. 2,65,246 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ స్థాయిలో కరోనా విజృంభిస్తుందని ముందుగానే గ్రహించిన వైద్య నిపుణులు.. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ సూచనలు పెడచెవిన పెట్టడం వల్లే ఇప్పుడు కొత్త కేసులు, మరణాలు విషయంలోనూ అమెరికా ‘అగ్ర’ దేశంగా నిలవాల్సిన పరిస్థితి దాపురించింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..ఇప్పటివరకు ఆ దేశంలో 2,21,32,045 మందికి వైరస్ సోకగా..3,74,124 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అలాగే కేసుల పరంగా మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాత్రం మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో మరణాలు రెండు లక్షల మార్కును దాటేశాయి.

మరోసారి లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు..

టీకాలు అందుబాటులోకి వచ్చాయనే ఆనందంతో కొత్త సంవత్సరానికి ఆశగా స్వాగతం పలికింది ప్రపంచం. కానీ, వైరస్ తీరు చూస్తుంటే మాత్రం ఇప్పటిలో సద్దుమణిగేలా కనిపించట్లేదు. కొత్త రూపంలో వచ్చిన కరోనా వైరస్ ఐరోపాను లాక్‌డౌన్ వైపునకు మళ్లించింది. ఉత్పరివర్తన చెందిన ఈ వైరస్ వ్యాప్తి 70 శాతం వేగంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పటికే సుమారు 41 దేశాల్లో తన ప్రభావం చూపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మరో రకం దాదాపు ఆరు దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాంతో 2020 మార్చి మాదిరిగానే ఇప్పుడు కూడా పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అక్కడ నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో..కొవిడ్‌ రోగులతో ఆసుపత్రులు ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్ వంటి దేశాల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. 

ఇక, కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో కూడా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్సులో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఏడుకోట్ల జనాభా కలిగిన హెబీ ప్రావిన్సులో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. అలాగే జపాన్ రాజధాని టోక్యోలో అక్కడి ప్రభుత్వం నెల రోజుల అత్యవసర పరిస్థితిని విధించింది. రాజధాని నగరంలో రాత్రి ఏడు గంటలకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజలు రాత్రి ఎనిమిది తరవాత ఇళ్లలోనే ఉండిపోవాలని స్పష్టం చేసింది.  కెనడా, లెబనాన్ దేశాలు కూడా రాత్రి కర్ఫ్యూకు ఆదేశాలిచ్చాయి. టీకాలు వచ్చినప్పటికీ, మరికొంత కాలం జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను ఈ ఉదాహరణలు కళ్లకు కడుతున్నాయి. ఇదిలా ఉండగా..సుమారు మరో ఆరు నెలల వరకు పరిస్థితులు కఠినంగానే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి:

చైనా నగరాల్లో లాక్‌డౌన్..!

రికవరీ రేటు..భారత్‌దే అగ్రస్థానం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని