close
Array ( ) 1

తాజా వార్తలు

ట్రంప్‌జీ.. అర్థమవుతోందా!

వీసాలపై కావాలి మాకు భరోసా
మేమంతా.. అమీర్‌పేట నుంచి అమెరికానే!
ఈనాడు, హైదరాబాద్‌

అమెరికాలో ఉన్నత చదువులు.. కొలువులు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు మార్గమని అధిక శాతం యువత నమ్మకం. తెలుగు నేలపై ఏ మూలన చదువు పూర్తిచేసినా.. డాలర్ల దేశానికి చేరేందుకు అమీర్‌పేట చేరతారు. అక్కడే కోర్సులు పూర్తిచేసుకుని అవకాశం రాగానే రెక్కలు కట్టుకుని అగ్రదేశాన వాలిపోతారు. భారతీయ యువత సామర్థ్యం, కష్టపడే తత్వం అక్కడ అవకాశాలను అందిస్తుంటుంది. శ్రమనే నమ్ముకుని వీరంతా ఉన్నతస్థానాలకు చేరుతున్నారు. ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల్లో సీఈవో స్థాయికి సైతం చేరుతున్నారు. ఇప్పటికే తెలుగువారు ఎంతోమంది అక్కడి గ్రీన్‌కార్డు పొంది స్థిరపడగా.. మరెంతోమంది హెచ్‌1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది చదువు పూర్తిచేసుకుని అప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) అర్హతతో పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు హెచ్‌1బీ కోసం ప్రయత్నిస్తున్నారు. తమకు వస్తుందో రాదోననే ఆందోళనలో తెలుగు ఐటీ నిపుణులు చాలామంది ఉన్నారు. మారిన నిబంధనలతో వీసాలు పొందడం కష్టంగా మారడం, రెన్యూవల్‌ సమస్యగా ఉండటంతో అమెరికాలో ఉంటున్న తెలుగువారిలో ఒకింత అభద్రతా భావం పెరిగింది. తాజాగా ఆ దేశాధినేత ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో వీసాలు సులభతరం చేసే భరోసాను మన వాళ్లు ఆయన నుంచి కోరుకుంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి భారత పర్యటనకు నేడు వస్తున్నారు. హైదరాబాద్‌కు రాకున్నా దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నట్లే ఇక్కడవారిలోనూ అగ్ర రాజ్యాధినేత పర్యటన కుతూహలం కలిగిస్తోంది. గతంలో భారత పర్యటనలో అమెరికా అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జిబుష్‌లు, ట్రంప్‌ కూతురు ఇవాంకా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇక్కడివారు అపూర్వంగా ఆదరించారు. నగరానికి అమెరికాతో అంతటి అనుబంధం ఉంది. ఇక్కడ ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకోసమో, ఉన్నతంగా జీవించేందుకో ఏటా అక్కడికి వెళుతున్నారు. భయాలు అనండి.. అపోహలు అనండి.. ఇటీవల కాలంలో అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గిందని కన్సల్టెన్సీ ప్రతినిధులు అంటున్నారు.


ఆందోళనలో తెలుగు టెకీలు

అమెరికాలో మాస్టర్స్‌ పూర్తిచేశాక మూడేళ్లపాటు ఓపీటీకి అవకాశం ఉంటుంది. నగరం నుంచి 20వేల మందికిపైగా మంది విద్యార్థులు ఓపీటీ అర్హతతో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే రెండుసార్లు హెచ్‌1బీకి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. ఈ ఏప్రిల్‌లో వీరికి చివరి అవకాశం ఉంది. వస్తుందా రాదా అనే ఆందోళనలో వేలాది మంది ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువమందే ఉన్నారు.


అపోహలు తొలగించాలి..
-ఆలపాటి శుభకర్‌, డైరెక్టర్‌, గ్లోబల్‌ ట్రీ

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైతే భారతీయులందరూ తిరిగి వచ్చేయాల్సిందే అని గతంలో అన్నారు. ఆయనొచ్చి మూడేళ్లు దాటినా అలాంటి ఇబ్బందులేం మనకు ఎదురవలేదు. రెగ్యులైజేషన్‌తో మనకు మంచే జరిగింది. అక్రమంగా కాకుండా పద్ధతి ప్రకారం వెళ్లినవారికి ఎలాంటి ఢోకా లేదు. ఇటీవల మనవాళ్లే 50 శాతంపైగా హెచ్‌1బీ పొందుతున్నారనే విశ్లేషణలు వచ్చాయి. గతంలో ప్రతి దేశానికి ఏటా 8 శాతానికి మించి వీసాలు ఇచ్చేవారు కాదు. ఇటీవల ఈ నిబంధనను సడలించారు. దీంతో మనకే మేలు జరిగింది. మున్ముందు వర్క్‌ పర్మిట్‌లు, హెచ్‌1బీ వీసాలు తగ్గిస్తున్నారనే అపోహలున్నాయి. భారత్‌ నుంచి వచ్చే విద్యార్థులు, ఐటీ నిపుణులకు మా పూర్తి మద్దతు ఉంటుందనే భరోసా ప్రస్తుత పర్యటనలో ట్రంప్‌ ఇవ్వగలిగితే మనకెంతో మేలు.


ప్రతిభకు పెద్దపీట వేస్తే బాగు
-సంగిరెడ్డి అభిరాంరెడ్డి, కర్మన్‌ఘాట్‌

హెచ్‌1బీ వీసా పొందినా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మా అన్నయ్యలు ఒకరు 2011, మరొకరు 2013 నుంచి యూఎస్‌లో ఉంటున్నారు. అప్పడు దరఖాస్తు చేసినా ఇప్పటికీ 2009 ద్వితీయార్థంలోని దరఖాస్తులనే పరిశీలిస్తున్నారు. దీన్నిబట్టి ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు హెచ్‌1బీను పొడిగించుకుంటూ వస్తున్నారు. నేను ఉండేది లూసియానా స్టేట్‌లో. మాస్టర్స్‌ అయిపోయాక ఓపీటీపై ఉద్యోగం చేస్తున్నాను. హెచ్‌1బీ ఇంకా రాలేదు. ప్రతిభ ఆధారంగా వీసాలు ఇస్తామనే విధానం పక్కాగా అమలు చేయాలనేది నా కోరిక.


అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్యలో 2010 నుంచి 2017 వరకు చూస్తే ఏటా 10 నుంచి 30 శాతం వరకు వృద్ధి ఉంది. గత మూడేళ్లలో ఇది మైనస్‌లోకి వెళ్లింది.


అమెరికా ఏటా మంజూరుచేస్తున్న వీసాల సంఖ్య 85వేలు.. దరఖాస్తు చేసుకుంటున్న భారతీయలు 1.5లక్షల మంది


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.