close
Array ( ) 1

తాజా వార్తలు

మాటిచ్చా.. వస్తున్నా

నేడే అగ్రరాజ్యాధిపతి రాక
రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడి పర్యటన
అహ్మదాబాద్‌లో స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ


గొప్ప స్నేహితులను కలవబోతున్నా

గొప్ప స్నేహితులను కలిసే తరుణం కోసం ఉత్సుకతతో వేచి చూస్తున్నా. ప్రధాని నరేంద్రమోదీ నాకు స్నేహితుడు. భారత్‌ పర్యటనకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మాట ఇచ్చి చాలా రోజులైంది. ఇన్నాళ్లకు అది సాకారమవుతోంది. భారత్‌లో ఎన్నడూ జరగనంత పెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిపోతుంది. మోదీ అదే నాకు చెప్పారు.

- డొనాల్డ్‌ ట్రంప్‌


దేశం ఎదురు చూస్తోంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను స్వాగతించడానికి భారతదేశం ఎదురుచూస్తోంది. సోమవారం ఆయన రానుండడం మనకెంతో గౌరవం. అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక కార్యక్రమంతో ట్రంప్‌ పర్యటన మొదలవుతుంది.

- ప్రధాని మోదీ

దిల్లీ, అహ్మదాబాద్‌, వాషింగ్టన్‌: అగ్రరాజ్యాధిపతిని ఆత్మీయ ఆలింగనం చేసుకునేందుకు భారతావని సమాయత్తమయింది. విశిష్ట అతిథికి కలకాలం గుర్తుండిపోయేలా... లక్షల మంది ప్రజలతో ఘనస్వాగతం పలికేందుకు ‘ఇండియా రోడ్‌ షో’ ఎదురుచూస్తోంది. తొలిసారి సకుటుంబ సమేతంగా విచ్చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ను అహ్మదాబాద్‌ నగరం ‘నమస్తే ట్రంప్‌’ అంటూ స్వాగతిస్తోంది.  రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాల్లో స్ఫూర్తిని చాటిచెప్పేందుకు మోతెరా స్టేడియం సొబగులద్దుకుంది. తాజ్‌మహల్‌ పాలరాతి అందాలను ఆస్వాదించండంటూ ఆగ్రా నగరం ఆహ్వానం పలుకుతోంది. మనసువిప్పి మాట్లాడుకునేందుకు, ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు దిల్లీ నగరం వేదిక అవుతోంది. సోమ, మంగళవారాల్లో మనదేశంలో పర్యటిస్తున్న ట్రంప్‌ కుటుంబం, అమెరికా అధికారుల బృందానికి భారతీయ సమున్నత, వైవిధ్య భరిత సంస్కృతిని చాటేలా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్‌లో వారికి మోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు.

ఆదివారం వాషింగ్టన్‌ నుంచి బయల్దేరిన ట్రంప్‌ సోమవారం నేరుగా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు. ఆ నగరంతో పాటు, ఆగ్రా, దిల్లీలలో మొత్తంమీద దాదాపు 36 గంటల పాటు సాగే పర్యటనకు అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ దళంతో సమన్వయం చేసుకుంటూ మన జాతీయ భద్రత దళం (ఎన్‌ఎస్‌జీ), ఇతర పోలీసు బలగాలు ఇప్పటికే భద్రతపరమైన సన్నాహక కసరత్తును పూర్తిచేశాయి. ట్రంప్‌ తన సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌, శ్వేతసౌధంలోని ఇతర ఉన్నతాధికారులతో కలిసి చేయబోయే పర్యటనకు ఇరుదేశాలూ విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్నేహాన్ని మరింత పరిపుష్టం చేయడానికి ఈ పర్యటన దోహదపడుతుందని రెండు దేశాలూ భావిస్తున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారంపై పెద్దగా ఆశలు లేకపోయినా రక్షణ, వ్యూహాత్మక సంబంధాల పరంగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరేందుకు ఈ పర్యటనలో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ రంగం-భద్రత, ఉగ్రవాద నిర్మూలన, ఇంధన భద్రత, మతపరమైన స్వేచ్ఛ, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల శాంతి ఒప్పందం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులు వంటి పలు అంశాలు రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రస్తావనకు రావచ్చని భారత్‌, అమెరికా అధికారులు వెల్లడించారు. రెండు ప్రజాస్వామ్య దేశాల నడుమ విస్తృతమవుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా పర్యటన ఉంటుందని చెప్పారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎగసిన నిరసనలు, కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దెబ్బతిన్న సంబంధాలు వంటి పరిస్థితుల్లో ట్రంప్‌ మన దేశంలో అడుగుపెడుతున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ గురించి ప్రైవేటుగా, బహిరంగ సభలోనూ ట్రంప్‌ మాట్లాడతారని శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అనేక అంశాల్లో రెండు దేశాల ఆసక్తులు ఒకే విధంగా ఉన్నాయని, దానివల్ల సంబంధాలు సమున్నత స్థాయికి చేరాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా పేర్కొన్నారు. భారతదేశ సమున్నత, వైవిద్ధ్యభరిత సంస్కృతిని ట్రంప్‌ పరివారానికి చూపిస్తామని చెప్పారు.

విభిన్న సంస్కృతిని చాటేలా...
సోమవారం అహ్మదాబాద్‌ చేరుకున్నాక ముందుగా సబర్మతి ఆశ్రమానికి ట్రంప్‌ వెళ్తారు. అక్కడ పావుగంట సేపు ఉంటారు. రాట్నంపై నూలు వడికేందుకు ఆయన ఆసక్తి చూపిస్తే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. గాంధీ సూక్తులతో రూపొందిన ప్రత్యేక పుస్తకాన్ని విశిష్ఠ అతిథికి కానుకగా ఇస్తారు. ఆశ్రమ సందర్శన తర్వాత ‘నమస్తే ట్రంప్‌’ పేరుతో అహ్మదాబాద్‌లో మోతెరా స్టేడియంలో జరిగే సభకు హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడికి విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకు 22 కి.మీ. పొడవునా ప్రజలు స్వాగతం పలకనున్నారు. దీనికి ‘ఇండియా రోడ్‌షో’ అనే పేరు పెట్టారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల సంస్కృతికి ప్రతీకగా 28 వేదికల్ని ఈ మార్గంలో వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశారు. సభలో నేతలిద్దరూ ప్రసంగిస్తారు. అహ్మదాబాద్‌ కార్యక్రమం పూర్తయ్యాక ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. గంటసేపు అక్కడ గడిపి అనంతరం దిల్లీకి బయల్దేరతారు. చారిత్రక పాలరాతి కట్టడం చూడచక్కగా కనిపించేలా శుభ్రం చేశారు. ఈ కట్టడం చుట్టూ ఉన్న దుకాణాల బోర్డులు సైతం అందంగా, ఒకేలా కనిపించేలా చేశారు. ఒబెరాయ్‌ అమర్‌ విలాస్‌ హోటల్‌లో కాసేపు విశ్రమించాక ట్రంప్‌ బృందం తాజ్‌మహల్‌కు బయల్దేరుతుంది. బ్యాటరీ వాహనాల్లో కట్టడాన్ని సందర్శిస్తుంది. తాజ్‌ చెంతనే ఉండే యమునను సాధ్యమైనంత పరిశుభ్రంగా ఉంచేలా నిరంతరం నదిలోకి నీళ్లు వదులుతున్నారు. దిల్లీలో ట్రంప్‌ సోమవారం రాత్రి బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్‌ వద్ద ‘నమస్తే’ను గుర్తు చేసేలా అడుగడుగునా ఏర్పాట్లు చేశారు.

రెండో రోజు ఇలా...
మంగళవారం ఉదయం ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభిస్తుంది. అనంతరం వారు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత ట్రంప్‌-మోదీ సమక్షంలో రెండు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయి. అగ్రరాజ్యాధిపతి గౌరవార్థం భారత ప్రధాని విందు ఇస్తారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చే విందులో పాల్గొన్నాక ట్రంప్‌ దంపతులు అమెరికాకు బయల్దేరతారు.


ట్రంప్‌ కుటుంబానికి కేసీఆర్‌ కానుకలు

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతిభవన్‌లో అదేరోజు రాత్రి ఎనిమిది గంటలకు జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. విందు సందర్భంగా కేసీఆర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫిలిగ్రి చార్మినార్‌ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను అందజేయనున్నారని తెలిసింది. ట్రంప్‌ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకాలకు పోచంపలి,్ల గద్వాల పట్టుచీరలను బహూకరించనున్నట్లు సమాచారం. సీఎం 26న దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.


ట్రంప్‌ భారత పర్యటనను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్‌ (డీడీ) ఇంగ్లిష్‌ ఛానెల్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.