‘క్యాపిటల్‌’పై దాడికి ముందు ట్రంప్‌ పార్టీ?

తాజా వార్తలు

Updated : 09/01/2021 15:27 IST

‘క్యాపిటల్‌’పై దాడికి ముందు ట్రంప్‌ పార్టీ?

వాషింగ్టన్‌: అగ్రరాజ్యానికి తలవొంపులు తెచ్చేలా అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడి ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దాడి నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ‘క్యాపిటల్‌’పై దాడికి ముందు ట్రంప్‌ పార్టీ చేసుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో అధ్యక్షుడిపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది. 

ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించేందుకు ముందు శ్వేతసౌధం బయట ఓ టెంట్‌లో కొందరు పార్టీ నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుమార్తె ఇవాంకా, కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీని జూనియర్‌ ట్రంప్‌ లైవ్‌ స్ట్రీమ్‌ చేసినట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆందోళనకారులను దేశభక్తులుగా పేర్కొన్న జూనియర్‌ ట్రంప్‌.. వారంతా క్యాపిటల్‌ ముట్టడికి వెళ్తున్నట్లు చెప్పారు. ఇక జూనియర్‌ ట్రంప్‌ ప్రేయసి కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘మైక్‌ పెన్స్‌ తన తెలివితో బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణ ప్రక్రియను తప్పకుండా ఆపగలరు. ఆ నమ్మకం నాకుంది’ అని అనడం గమనార్హం. వీడియోలో వెనుకవైపు పాప్‌ పాటలు మోగుతుండగా.. కొందరు వాటికి డ్యాన్స్‌ చేస్తున్నారు.

అయితే ఇది బుధవారం నాటి ట్రంప్‌ ప్రసంగానికి ముందు తీసిందా లేదా తర్వాత తీసిందా అన్నది ఇంకా తెలియరాలేదు. వీడియోలో ట్రంప్‌.. టీవీలో వస్తున్న ‘క్యాపిటల్‌’ ఆందోళనను వీక్షిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోను పలువురు డెమొక్రాటిక్‌ మద్దతుదారులు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఓవైపు యావత్‌ దేశం బాధలో, ఆందోళనలో ఉంటే వీరు మాత్రం నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్నారు’ అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. 

క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఇంకా కూడా ఆందోళనకారులను దేశభక్తులంటూ ఇవాంకా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆమె ఆ ట్వీట్‌ను తొలగించారు. గత బుధవారం కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సంయుక్త సమావేశం నిర్వహించిన రోజు.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో ఓ పోలీస్‌ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ట్రంప్‌ స్పందిస్తూ.. దాడిని ఖండించారు. ఓటమిని అంగీకరిస్తూ అధికార మార్పిడికి సహకరిస్తానని చెప్పడం గమనార్హం. మరోవైపు దాడి నేపథ్యంలో ట్రంప్ ట్విటర్‌ ఖాతాపై శాశ్వత నిషేధం పడింది. 

ఇవీ చదవండి..

ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం!

ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిది



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని