పోతూ.. పోతూ.. నిషేధం విధిస్తూ!

తాజా వార్తలు

Updated : 01/01/2021 15:24 IST

పోతూ.. పోతూ.. నిషేధం విధిస్తూ!

వెళ్లే ముందూ ‘ట్రంపరితనం’

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డులు, ఉపాధి ఆధారిత వీసాల జారీపై విధించిన నిషేధాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ మార్చి 31 వరకు పొడిగించారు. అలాగే అమెరికా చట్టాలను ఉల్లంఘించిన తమ పౌరులను వెనక్కి రప్పించడానికి నిరాకరిస్తున్న దేశాలపై విధించిన వీసా ఆంక్షల్నీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి క్రమంగా అమల్లోకి వచ్చిన ఈ నిషేధాల గడువు డిసెంబరు 31, 2020తో ముగిసింది. మరోవైపు కొత్తగా అమెరికాలోకి రావాలనుకుంటున్న విదేశీయులు సొంతంగా ఆరోగ్య బీమా కలిగి ఉండాలంటూ ట్రంప్‌ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సమర్థించింది.

ట్రంప్‌ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా విమర్శించారు. అయితే, తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్‌ విధించిన నిషేధాల్ని ఎత్తివేస్తారా.. లేదా.. అన్నది మాత్రం తెలపలేదు. వెంటనే ఉపసంహరించడానికి వీలులేని విధానంలో ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు నిపుణులు తెలిపారు. వెళ్లిపోయే ముందు ట్రంప్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ పరంపరలోనే ఈ నిషేధాల పొడిగింపు కూడా చోటుచేసుకుంది.

అమెరికన్ల ఉద్యోగాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో దాదాపు రెండు కోట్ల మంది ప్రభుత్వం అందజేస్తున్న నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నారు. కరోనా వ్యాప్తి పెరిగి ఆంక్షలు అమల్లోకి వచ్చిన కొద్దీ ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో విదేశీయులకు ఉన్న పలు వెసులుబాట్లపై ఏప్రిల్‌ నుంచి ట్రంప్‌ నిషేధం విధిస్తూ వచ్చారు. తొలుత అమెరికాలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకు జారీ చేసే గ్రీన్‌ కార్డులపై నిషేధం విధించారు. అనంతరం దాన్ని హెచ్‌-1బీ, హెచ్‌-2బీ, జే-1, ఎల్‌-1 వీసాలకు కూడా వర్తింపజేశారు.

దీన్ని అక్కడి వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులను ఆశ్రయించాయి. అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయం వల్ల అమెరికా వ్యాపారాలు, కంపెనీలే దెబ్బతింటాయని గట్టిగా వాదించాయి. దీంతో ట్రంప్‌ ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కాలిఫోర్నియా ఫెడరల్‌ జడ్జి ఆదేశించారు. వీసాలపై నిషేధం వల్ల పూడ్చలేని నష్టం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుని యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ 9వ సర్క్యూట్‌ కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జనవరి 19న విచారణ జరగనుంది.

ఇవీ చదవండి..

కరుణ రసం: ట్రంప్‌లో కొత్తకోణం..!

మోదీకి 55 శాతం ఆమోదం.. సర్వేలో వెల్లడిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని