ఐరాస సదస్సులో ప్రసంగించిన తెలుగింటి ఆడపడుచు

తాజా వార్తలు

Updated : 09/06/2021 20:19 IST

ఐరాస సదస్సులో ప్రసంగించిన తెలుగింటి ఆడపడుచు

అమరావతి: ఆమె చదివింది తొమ్మిదో తరగతే అయినా ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించే ఘనత సాధించారు దీపిక. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి ఆమెకు అవకాశం దక్కింది. సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి, సాగర సంగమ తీరం అంతర్వేది ఆహ్లాదానికి నిలయం. అలాంటి ప్రాంతం ప్లాస్టిక్‌, పాలిథీన్‌ వ్యర్థాలతో నిండి పోయింది. ఈ పరిస్థితి నుంచి తీరాన్ని కాపాడి కాలుష్యరహితంగా మార్చేందుకు గ్రీన్‌ వార్మ్స్ స్మార్ట్ విలేజ్‌ మూమెంట్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటైంది. ఈ సంస్థ ద్వారా సముద్ర తీరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు దీపిక తీవ్రంగా కృషి చేశారు. తాను సాధించిన ఘనతతో ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించే అవకాశం దక్కించుకున్నారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస వెబ్‌ టీవీలో మంగళవారం రాత్రి దీపిక ప్రసంగించారు. పాలిథీన్‌ వ్యర్థాలను ఏరివేయడంతో అంతర్వేది  ఆహ్లాదంగా మారినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ విశ్వభూషణ్‌ సహా పలువురు ప్రశంసించారు. ఐరాస సదస్సులో మన దేశం నుంచి దీపిక పాల్గొనడం అభినందనీయమని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. సముద్ర జలాల్లో కాలుష్యనివారణకు ఆమె చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చిందన్నారు.  

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. ‘‘సముద్రతీర ప్రాంతంలో ఉన్న అంతర్వేది గ్రామం ఎంతో ఆహ్లాదకరమైన గ్రామం. గోదావరి నది సముద్రంలో కలిసే చోటు మా గ్రామానికి అనుకొని ఉంది. దాన్ని మేము ఆన్నాచెల్లెళ్ల కట్టు అంటాము. మాగ్రామంలో మత్స్యకారులు ఎక్కువగా జీవిస్తున్నారు. చేపల వేట మత్స్యకారుల జీవనాధారం. గోదావరి నది మాకు జీవనది. గోదావరి, సముద్రంలో కలిసే చోటును చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల గోదావరి నది, సముద్రం కలుషితమైపోతున్నాయి. దాని వల్ల మత్స్య సంపద నశించిపోతోంది. నేనూ నా భర్త, కలిసి బీచ్‌ చుట్టుపక్కల ఉండే  ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నాము. జీరో వేస్ట్‌ ప్రాజెక్ట్‌ మా గ్రామానికి రావడం చాలా సంతోషం కలిగించింది’’ అని అన్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని