Rajya Sabha: రాజ్యసభ.. తొలి రెండు వారాల్లో నడిచింది 10 గంటలే

తాజా వార్తలు

Published : 31/07/2021 13:29 IST

Rajya Sabha: రాజ్యసభ.. తొలి రెండు వారాల్లో నడిచింది 10 గంటలే

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. తాము లేవనెత్తదలచుకున్న అంశాలపై చర్చ జరపాలని విపక్షం.. సభలో ప్రశాంతత నెలకొంటే దానికి సిద్ధమని అధికార పక్షం కరాఖండీగా చెబుతున్నాయి. దీంతో ఉభయ సభల్లో ఎలాంటి చర్చలు సాగకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అలా తొలి రెండు వారాల్లో రాజ్యసభ కేవలం 10 గంటలే నడవడం గమనార్హం. 

జులై 19న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు వారాల్లో రాజ్యసభ 9 సార్లు సమావేశమైంది. సాధారణంగా రాజ్యసభ రోజుకు ఆరు గంటలు సమావేశమవుతుంది. సుదీర్ఘ చర్చలుంటే షెడ్యూల్‌ సమయం కంటే ఎక్కువ కూడా సభ్యులు కూర్చుంటారు. అయితే తాజా సమావేశాల్లో విపక్షాల ఆందోళనల కారణంగా ఇప్పటివరకూ రాజ్యసభ కేవలం 10.08గంటలు మాత్రమే నడిచిందని పెద్దలసభ సెక్రటేరియేట్‌ వర్గాలు వెల్లడించాయి. 

తొలి రెండు వారాల్లో 9 ప్రశ్నోత్తరాల గంటలు చేపట్టాల్సి ఉండగా.. కేవలం 1.38 గంటలు మాత్రమే ప్రశ్నోత్తరాల కాలం జరిగింది. శూన్య గంటకు ఒకే ఒక్క నిమిషం.. ప్రత్యేక మెన్షన్ల కోసం నాలుగు నిమిషాలు మాత్రమే కేటాయించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఇక విపక్షాల ఆందోళనల నడుమే కొన్ని బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. 1.24 గంటల్లో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. తొలి వారంలో కొవిడ్‌ సంబంధిత అంశాలపై 4.37 గంటల పాటు చర్చించారు. ఇక ఒక రోజు షెడ్యూల్‌ సమయం కంటే 1.12 గంటలు అదనంగా రాజ్యసభ సాగింది. విపక్షాల ఆందోళనలు, ఛైర్మన్‌ అసంతృప్తి.. ఇలా మొత్తం సభ నడిచింది కేవలం 10 గంటలే కావడం గమనార్హం. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేయడం, వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభ పదేపదే వాయిదా పడింది. 

ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..!

ఇదిలా ఉండగా.. పెగాసస్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తాము పట్టుబడుతున్నప్పటకీ సభలో చర్చకు అనుమతించడం లేదని ఆరోపిస్తోన్న ప్రతిపక్షాలు.. రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే వారంలో దీన్ని సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే వారం కూడా సభలో గందరగోళం నెలకొనే అవకాశముంది. ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని