యోగేంద్ర యాదవ్‌ను సస్పెండ్‌ చేసిన సంయుక్త కిసాన్‌ మోర్చా!

తాజా వార్తలు

Published : 22/10/2021 23:59 IST

యోగేంద్ర యాదవ్‌ను సస్పెండ్‌ చేసిన సంయుక్త కిసాన్‌ మోర్చా!

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) నుంచి స్వరాజ్‌ అభియాన్‌ నేత, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ను నెలపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్‌కేఎం పేర్కొంది. లఖింపుర్‌ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులతో పాటు ఓ భాజపా కార్యకర్త కుటుంబాన్ని యోగేంద్ర యాదవ్‌ పరామర్శించంతో ఎస్‌కేఎం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన యోగేంద్ర యాదవ్‌.. ఎస్‌కేఎం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. అయినప్పటికీ ఈ చరిత్రాత్మకమైన ఉద్యమంలో రైతుల విజయం కోసం గతం కంటే మరింత శ్రద్ధగా పనిచేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 40 రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM)గా ఏర్పడి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు దూసుకురావడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ముగ్గురు భాజపా కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. అయితే, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలతో పాటు మరో జర్నలిస్టు కుటుంబాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా పరామర్శించింది. అదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తల కుటుంబాలను మాత్రం పరామర్శించకూడదని నిర్ణయించింది. ఎస్‌కేఎం నిర్ణయానికి వ్యతిరేకంగా యోగేంద్ర యాదవ్‌ భాజపా కార్యకర్త శుభం మిశ్రా కుటుంబాన్ని పరామర్శించడం రైతు సంఘాల నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనను నెలపాటు ఎస్‌కేఎం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

దీనిపై స్పందించిన యోగేంద్ర యాదవ్‌.. ఎస్‌కేఎం నేతలకు చెప్పకుండా భాజపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం తన తప్పేనని అంగీకరించారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన శిక్షను అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, ఎదుటివారి బాధలను పంచుకోవడం భారతీయ సంస్కృతిలో భాగం కాబట్టే మానవతా దృక్పథంతోనే వారిని పరామర్శించానని యోగేంద్ర యాదవ్‌ తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని