Kabul Airport Attack: కాబుల్‌ విమానాశ్రయంపై దాడి.. 103కు చేరిన మృతుల సంఖ్య..!

తాజా వార్తలు

Updated : 27/08/2021 18:06 IST

Kabul Airport Attack: కాబుల్‌ విమానాశ్రయంపై దాడి.. 103కు చేరిన మృతుల సంఖ్య..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ భయానకంగా మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబుల్‌ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 103కు పెరిగింది. ఈ దాడిలో 13మంది అమెరికా సైనికులు మరణించగా.. 90 మంది అఫ్గాన్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ విషయాన్ని కాబుల్‌ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్‌-ఖోర్సా బాధ్యత తీసుకొంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.

అఫ్గాన్‌ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘‘తాలిబన్లు- హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్‌-కె మూలాలు ఉన్నాయి. కానీ తాలిబన్లు దీనిని తిరస్కరించడం ఎలా ఉందంటే.. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్‌ సంస్థతో సంబంధాలు లేవని పాక్‌ చెప్పినట్లుంది. తన గురువు నుంచి తాలిబన్లు చాలా నేర్చుకొన్నారు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని దాడులు జరగొచ్చు..!

కాబుల్‌ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు.. వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

* శ్వేత సౌధంపై  అమెరికా పతాకాన్ని ఆగస్టు 30 సాయంత్రం వరకు సగం ఎత్తులోనే ఎగరవేయనున్నారు. అఫ్గాన్‌లోని కాబుల్‌లో జరిగిన దాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

2011 తర్వాత ఇదే పెద్దదాడి..!

కాబుల్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికన్ల మరణాలు నమోదైంది ఇప్పుడే. రెండు దశాబ్దాలపాటు జరిగిన అఫ్గాన్‌ యుద్ధంలో 1909 మంది అమెరికన్లు మరణించారు. 2011 ఆగస్టు 6వ తేదీన ఉగ్రవాద శిబిరంపై అమెరికా చినూక్‌ హెలికాఫ్టర్‌ దాడికి దిగింది. ఈ సమయలో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. ఈ ఘటన వార్దక్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ దాడిలో 22 నేవీ సీల్స్‌ సహా 30 మంది అమెరికా సిబ్బంది మరణించారు. మరో 8 మంది అఫ్గాన్‌ పౌరులు, ఓ అమెరికా జాగిలం కూడా మరణించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని