Corbevax: నవంబర్‌ చివరినాటికి మరో టీకా.. అందుబాటులోకి కార్బెవాక్స్‌!

తాజా వార్తలు

Published : 25/10/2021 23:49 IST

Corbevax: నవంబర్‌ చివరినాటికి మరో టీకా.. అందుబాటులోకి కార్బెవాక్స్‌!

బయోలాజికల్‌ ఇ ఎండీ మహిమా దాట్ల ఆశాభావం

దిల్లీ: దేశంలో త్వరలోనే మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌ ఇ (Biological E) తయారు చేస్తోన్న కార్బెవాక్స్‌ (Corbevax) టీకా నవంబర్‌ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ విడుదల చేసే రోజే దాదాపు 10కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తయారవుతోన్న డోసులను పరీక్ష కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ లాబోరేటరీకి పంపించినట్లు బయోలాజికల్‌ ఇ తెలిపింది.

కార్బెవాక్స్‌ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రయోగాల సమాచారం విశ్లేషణ కూడా నవంబర్‌ చివరినాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం మరో నెలలో చిన్నారుల టీకా లైసెన్సు ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రస్తుతం చిన్నారులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి’ అని బయోలాజికల్‌ ఇ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్‌ల సమాచారంతోనూ పోల్చి చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ విడుదల రోజే పది కోట్ల డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతిఏటా దాదాపు వంద కోట్ల కార్బెవాక్స్‌ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందని మహిమా దాట్ల పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 50 మిలియన్‌ డాలర్లతో ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించేందుకు అమెరికా ఇంటర్నేషనల్‌ డెవలెప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (DFC)తో బయోలాజికల్‌ ఇ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 చివరి నాటికి భారత్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలకు దాదాపు వందకోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్‌ డోసులను అందించేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని డీఎఫ్‌సీ ప్రతినిధి డేవిడ్‌ మార్కిక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని