Saudi Arabia: సౌదీకి వెళ్లే దారేదీ: రాకపోకలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు

తాజా వార్తలు

Published : 31/08/2021 09:30 IST

Saudi Arabia: సౌదీకి వెళ్లే దారేదీ: రాకపోకలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు

ఇతర దేశాల మీదుగా చేరుకోవడమే మార్గం 
రూ.2 లక్షలకుపైగా ఆర్థిక భారం
డోలాయమానంలో ప్రవాస తెలంగాణ వాసులు

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, నిర్మల్‌: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం విమాన ప్రయాణాలపై విధించిన ఆంక్షలు ఆ దేశం వెళ్లాలనుకునే భారతీయుల పాలిట శాపంగా మారుతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల టికెట్‌తో సౌదీకి నేరుగా వెళ్లే వెసులుబాటు ఉండేది. కరోనా నివారణకు ఆ దేశ ప్రభుత్వం భారత్‌తో పాటు బ్రెజిల్, ఈజిప్ట్, ఇండొనేషియా, సౌత్‌ ఆఫ్రికా, పాకిస్థాన్, వియత్నాం, అఫ్గానిస్థాన్, ఇరాన్, లెబనాన్, లిబియా, యెమెన్‌ తదితర దేశాలకు విమానాలు నడపడం లేదు. దీంతో ఇక్కడి వారు రూ.2 లక్షలకు పైగా వెచ్చించి దుబాయ్, రష్యా, మాల్దీవులు, ఖతార్‌ దేశాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా క్వారంటైన్‌ ఖర్చులు అదనంగా భరించాలి. సౌదీకి వెళ్లాలనుకునే వారికి ఇవి ఆర్థిక భారమవుతున్నాయి. ఈ కారణంగా వారు ఆ దేశం వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు.

క్వారంటైన్‌లో ఉన్న తరవాతే.. 

కరోనాకు ముందు సౌదీ అరేబియాలో తెలంగాణ వాసులు 3 లక్షల మంది వరకు ఉండేవారు. కొవిడ్, ఇతర కారణాల వల్ల సుమారు 2.10 లక్షల మంది స్వస్థలాలకు వచ్చారు. కొవిడ్‌ రెండో దశ మొదలైన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రయాణాలపై నిషేధం విధించగా.. ఈ ఆగస్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించింది. దీంతోపాటు పలు నిబంధనలనూ, ఆంక్షలనూ అమలులోకి తీసుకొచ్చింది. ప్రవాసులు తిరిగి సౌదీకి రావడానికి తమ దేశం నుంచి ముందస్తుగా వీసా తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశానికి నేరుగా కాకుండా రష్యా, మాల్దీవులు, దుబాయ్, ఖతార్‌ల నుంచి సౌదీకి రావాలని, అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న తరవాతే తమ దేశంలో అడుగు పెట్టాలన్న నిబంధన విధించింది. ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవడంతోపాటు కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోవాలని నిర్దేశించింది.

వెళ్లింది కొందరే..

ఆంక్షల కారణంగా ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సౌదీలో ఉన్నత స్థానంలో ఉన్న వారు, వైద్యులు, ఇతర కరోనా యోధులకు మాత్రమే అవకాశం లభించింది. మిగిలిన వారు వెళ్లలేకపోయారు. ఆ దేశానికి వెళ్లేవారు లేకపోవడంతో విమాన సర్వీసులూ నడవడం లేదు. ఒక్కోసారి పది మందిలోపు ప్రయాణికులతోనే విమానాలు వెళ్తున్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెళ్లిన వారి సంఖ్య 200లోపే ఉంది.

ఇక్కడ పని చేసుకోవడమే మేలు

సౌదీలో కొన్నేళ్ల పాటు కష్టపడి పని చేశా. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు బాగా లేవు. దీంతో నిజామాబాద్‌ ప్రాంతంలోనే కొంత పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. అక్కడ కష్టాలు పడేకంటే ఉన్న ఊళ్లోనే ఏదో ఒక పని చేసుకోవడం మేలు అని ఇక్కడే ఉండిపోయా. -పి.పోశెట్టి, నిజామాబాద్‌

ఏం చేయాలో అర్థం కావడం లేదు

ఆరేళ్ల క్రితం సౌదీ వెళ్లా. ఓ కంపెనీలో పనిచేస్తూ 9 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చా. మళ్లీ సౌదీ వెళ్లాలని సిద్ధమయ్యా. అంతలోనే దుబాయ్‌ నుంచి సౌదీకి విమానాలు రద్దు చేశారు. ఇప్పుడు సౌదీ వెళ్లడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుందని చెబుతున్నారు. అంత డబ్బు నా దగ్గర లేదు. సౌదీలో నేను పనిచేసిన కంపెనీ నుంచి రూ.60 వేలు రావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
డబ్బులు లేక ఆలోచిస్తున్నా.. -కనక రాజేశ్వర్, ముజ్గి, నిర్మల్‌ మండలం

మూగ లింగయ్య, రాజూర, 

సౌదీలో డ్రైవర్‌గా పని చేస్తున్న నేను గతేడాది కరోనా సమయంలో సొంతూరికి వచ్చా. నేను పనిచేసే కంపెనీ రావాలని చెప్పడంతో గత జులైలో దుబాయ్‌ వెళ్లి అక్కడ క్వారంటైన్‌లో ఉన్నా. సౌదీకి వెళ్లాలనుకునే సమయంలోనే ఆ దేశ (సౌదీ) ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. దీంతో తిరిగి స్వగ్రామానికి వచ్చా. విమాన టికెట్, క్వారంటైన్, ఇతర ఖర్చులు కలిపి రూ.1.20 లక్షలు అయ్యాయి. ప్రస్తుతం విమానాలు ప్రారంభమవగా.. ఆ దేశానికి వెళ్లడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు లేక.. వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా.-లోకేశ్వరం మండలం, నిర్మల్‌ జిల్లా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని