Afghanistan Crisis: 97శాతం మంది పేదరికంలోకి..?

తాజా వార్తలు

Updated : 10/09/2021 14:13 IST

Afghanistan Crisis: 97శాతం మంది పేదరికంలోకి..?

ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి

వాషింగ్టన్‌: అమెరికా బలగాల ఉపసంహరణ, అనంతరం తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటు ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలు మొదలు కాగా.. మరోవైపు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడ్డ రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడే చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది (2022) నాటికి అఫ్గాన్‌లో 97శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.

అఫ్గానిస్థాన్‌లో ఉన్న తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఆహార పరిస్థితే కాకుండా మానవ, ఆర్థిక సంక్షోభాలను పరిగణనలోకి తీసుకుంటే.. వాస్తవ జీడీపీ 13శాతం తగ్గిపోయి పేదరికం రేటు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) విశ్లేషించింది. అఫ్గాన్‌లో విపత్కర పరిస్థితులతో లక్షల మంది ప్రజల జీవితాలు మరింత వేగంగా క్షీణించే ప్రమాదం ఉందని యూఎన్‌డీపీ ఆసియా, పసిఫిక్‌ విభాగాధిపతి కన్నీ విగ్నరాజా పేర్కొన్నారు.

ఇప్పటికే కరవు పరిస్థితులు, కొవిడ్‌తో అల్లాడుతోన్న అఫ్గానిస్థాన్‌పై తాజాగా నెలకొన్న రాజకీయ మార్పు, విదేశీ నిధుల నిలిపివేత, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒత్తిడి, పెరుగుతున్న పేదరికం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర సేవలు, స్థానిక కుటుంబాలకు కనీస ఆదాయం కల్పించేలా ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస ఈమధ్యే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని