హ్యాకర్ల నుంచి సొమ్ము కక్కించిన అమెరికా..!

తాజా వార్తలు

Published : 10/06/2021 01:39 IST

హ్యాకర్ల నుంచి సొమ్ము కక్కించిన అమెరికా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: అమెరికాలోని తూర్పుతీర ప్రాంతంలోని అత్యంత భారీ చమురు పైప్‌లైన్‌ కంపెనీకి చెందిన కంప్యూటర్లు గత నెలలో రాన్సమ్‌వేర్‌ ముఠా హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ కంప్యూటర్లపై నియంత్రణను తిరిగి యాజమాన్యానికి అప్పజెప్పాలంటే కొంత మొత్తం చెల్లించాలని ఆ ముఠా డిమాండ్‌ చేసింది. ఆ కంపెనీ యాజమాన్యం గతిలేని పక్షంలో సొమ్మును చెల్లించి.. కంప్యూర్లపై నియంత్రణను పొందింది. కానీ, రెండు రోజుల క్రితం అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆ హ్యాకర్ల వాలెట్‌ నుంచి సొమ్మును సీజ్‌ చేసింది. ఈ ఘటనపై మంగళవారం అమెరికా సెనెట్‌లో విచారణ జరిగింది. 

కలోనియల్‌ పైప్‌లైన్‌ కంపెనీపై  గత నెల 7న సైబర్‌ దాడి జరిగింది. దీంతో దాదాపు 18 రాష్ట్రాలకు చమురు సరఫరాను యద్ధప్రాతిపదికన ఆపేశారు. ఈ సైబర్‌ దాడి చేసిన ‘డార్క్‌సైడ్‌’ అనే రాన్సమ్‌వేర్‌ ముఠా 4.4 మిలియన్‌ డాలర్లను డిమాండ్‌ చేసింది. దీంతో చేసేది లేక కంపెనీ ఆ మొత్తానికి సమానమైన బిట్‌కాయిన్లను చెల్లించింది. ఈ విషయాన్ని గతనెల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సీఈవో జోసఫ్‌ బ్లంట్‌ అంగీకరించారు. 

మరోపక్క అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌, ఎఫ్‌బీఐ దీనిపై కన్నేశాయి. తాజాగా బిట్‌కాయిన్‌ వాలెట్‌ను తెరిచే ప్రత్యేకమైన ‘కీ’ని ఎఫ్‌బీఐ సంపాదించింది. దీంతో కలోనియల్‌ పైప్‌లైన్‌ చెల్లించిన సొమ్మును సీజ్‌ చేసింది. ఈ క్రిప్టోకరెన్సీ చిరునామా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కరోలినాలో ఉంది. కలోనియల్‌ పైప్‌లైన్‌ సుమారు 5 మిలియన్‌ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించగా.. వాటిలో 2.3 మిలియన్‌ డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను  తిరిగి స్వాధీనం చేసుకొంది. అయితే, అప్పటితో పోలిస్తే ఇప్పుడు బిట్‌కాయిన్ల విలువ క్షీణించడం గమనార్హం. 

భారీగా సైబర్‌ భద్రతా చర్యలు తీసుకొన్నా..

ఈ హ్యాకింగ్‌, మాముళ్ల రూపంలో సొమ్ము చెల్లింపు వంటి అంశాలపై మంగళవారం సెనెటర్లు విచారణ చేపట్టారు. దీనికి కలోనియల్‌ పైప్‌లైన్‌ సీఈవో జోసఫ్‌ బ్లంట్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనను సెనెటర్లకు బ్లంట్‌ వివరించారు. హ్యాకర్లు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌)ను వినియోగించి కంప్యూటర్‌లోకి చొరబడ్డారని తెలిపారు. మల్టీ అథెంటికేషన్‌ కాకుండా.. ఒకే ఒక అథెంటికేషన్‌తో చొరబడ్డారని వివరించారు. వాస్తవానికి ఆ సిస్టమ్‌ పాస్‌వర్డ్‌ కూడా అత్యంత పకడ్బందీగా ఉందని వివరించారు. Colonial123 వంటి పాస్‌వర్డ్‌ మాత్రం లేదని వెల్లడించారు. సంస్థ సైబర్‌ సెక్యూరిటీ, సిస్టమ్స్‌పై గత ఐదేళ్లలో 200 మిలియన్‌ డాలర్ల (రూ.1,460 కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. తప్పని పరిస్థితుల్లో తాము ‘డార్క్‌సైడ్‌’కు సొమ్ము చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటికీ కంపెనీకి చెందిన 7 ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ సాధారణ స్థితికి రాలేదని తెలిపారు. 

ఏమిటీ డార్క్‌సైడ్‌?

కరుడుగట్టిన సైబర్‌ నేరగాళ్ల ముఠా ‘ది డార్క్‌సైడ్‌’ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇది రష్యాకు చెందిన సంస్థగా అనుమానిస్తున్నారు. ఇదొక రాన్సమ్‌వేర్‌ ముఠా. అంటే సైబర్‌ దాడి చేసి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్‌ అన్నమాట. తాజా దాడిలో డార్క్‌సైడ్‌ ముఠా కలోనియల్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 100 గిగాబైట్ల డేటాను తన అధీనంలోకి తీసుకుంది. దీనిని గుర్తించిన కలోనియల్‌ సంస్థ మిగిలిన డేటా హ్యాకర్లు బారినపడకుండా ఆఫ్‌లైన్‌ చేసింది. తమ డిమాండ్లు పూర్తి చేయకపోతే ఇంటర్నెట్‌లో ఆ డేటాను ఉంచుతామని బెదిరించారు. క్రిమినల్‌ ఐటీ వ్యవస్థలో రాన్సమ్‌వేర్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది దొంగిలించిన డేటాను ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా పబ్లిష్‌ చేసేందుకు సిద్ధంగా ఉంచి.. ఆధారాలతో ఉన్న ఆ లింక్‌ను బాధితులకు పంపిస్తుంది. బాధితుడి సిస్టమ్‌లోని డేటాను ముందే తొలగించేస్తుంది. తమకు డబ్బు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకొన్న డేటా లీక్‌ చేస్తామని చెబుతుంది. 
డార్క్‌సైడ్‌ ముఠా సైబర్‌ నేరాల్లో శిక్షణ కూడా ఇస్తుంటుంది. డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసి తస్కరించేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేసింది. దీంతో దాడులు ఎలా చేయాలి? డబ్బు ఎలా గుంజాలి? అనే అంశాలపై తమ అనుచర బృందాలకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన బృందాలు సైబర్‌ దాడులు చేసి వసూలు చేసిన సొమ్ములో కొంత డార్క్‌సైడ్‌కు చెల్లిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరింత చురుగ్గా దాడులు చేసే ఓ సాఫ్ట్‌వేర్‌ను డార్క్‌సైడ్‌ ముఠా మార్చిలో సిద్ధం చేసింది. దీనిని పరిశీలించడానికి రావాలని జర్నలిస్టులకు ఓ ప్రెస్‌నోట్‌ కూడా విడుదల చేయడం విశేషం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని