Bharat Bandh: సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌

తాజా వార్తలు

Published : 27/08/2021 20:31 IST

Bharat Bandh: సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటాన్ని రైతు సంఘాలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌ పిలుపునిచ్చింది. దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత ఆశీష్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. గతేడాది కూడా కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఇదే తేదీన భారత్‌ బంద్‌ నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ మరింత విజయవంతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరాటంలో భాగంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందన్నారు. 

మరోవైపు, దిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతుల అఖిల భారత సదస్సు శుక్రవారంతో ముగిసిందన్నారు. ఈ సదస్సుకు 22 రాష్ట్రాల నుంచి 300 రైతు సంఘాల ప్రతినిధులతో పాటు మహిళా, కార్మిక, గిరిజన, యువజన, విద్యార్థి సంఘాలు ప్రతినిధులు కూడా పాల్గొన్నట్టు తెలిపారు. దేశ రాజధాని నగర సరిహద్దుల్లో గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న రైతుల పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగంపై ఏవిధంగా దాడి చేస్తుందో సదస్సులో చర్చించినట్టు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, విద్యుత్‌ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పది సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరపగా విఫలమయ్యాయి. అటు ప్రభుత్వం, ఇటు రైతు సంఘాల ప్రతినిధులు పట్టువీడకపోవడంతో నెలల తరబడి ప్రతిష్టంభనకు తెరపడలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని