Jammu Kashmir: కశ్మీర్‌లో విస్తృతంగా తనిఖీలు.. 570 మంది అదుపులోకి!

తాజా వార్తలు

Published : 10/10/2021 12:00 IST

Jammu Kashmir: కశ్మీర్‌లో విస్తృతంగా తనిఖీలు.. 570 మంది అదుపులోకి!

శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను బలిగొన్న విషయం తెలిసిందే. కొందిరినే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో దాదాపు 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్‌వ్యాప్తంగా మొత్తం 570 మందిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు స్థానిక పోలీసులు సైతం.. రాళ్ల దాడులకు పాల్పడినవారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు కేంద్రం ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారిని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమన్వయానికి శ్రీనగర్‌కు పంపింది. స్థానికంగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం అనంతనాగ్‌, శ్రీనగర్‌, కుల్గాం, బారాముల్లా తదితర 16 చోట్ల దాడులు ప్రారంభించింది. లష్కరే తోయిబా తదితర ఉగ్రసంస్థల దన్నుతో లోయలో అశాంతికి కారణమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాయిస్‌ ఆఫ్ హింద్‌, ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌(టీఆర్‌ఎఫ్‌) కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ సభ్యుల ఇళ్లపై దాడులు చేపడుతోంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 28 మంది పౌరులు మృతి చెందినట్లు జమ్మూ- కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని