Russia On Taliban: అఫ్గాన్‌ పరిస్థితులపై ఆ దేశాలతో కలిసి పనిచేస్తున్నాం: రష్యా

తాజా వార్తలు

Published : 26/09/2021 22:06 IST

Russia On Taliban: అఫ్గాన్‌ పరిస్థితులపై ఆ దేశాలతో కలిసి పనిచేస్తున్నాం: రష్యా

అమెరికా, నాటో దళాలపై విమర్శలు

న్యూయార్క్ ‌: అఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని రష్యా తెలిపింది. అలాగే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించింది. ఈ మేరకు అఫ్గాన్‌లో పరిస్థితులపై చైనా, పాకిస్థాన్‌, అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ శనివారం తెలిపారు. నాలుగు దేశాలు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాయన్నారు. ఇటీవలే కతర్‌లో సమావేశమైన ఆయా దేశాల ప్రతినిధులు అక్కడి నుంచి అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు కూడా వెళ్లారని తెలిపారు. అక్కడ తాలిబన్లతో పాటు ‘‘లౌకిక నేతలు’’ మాజీ అధ్యక్షుడు హమిద్‌ కర్జాయ్‌, అబ్దుల్లా అబ్దుల్లాతో భేటీ అయ్యారన్నారు. తాలిబన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వం సమగ్రంగా లేదని లవ్రోవ్‌ తెలిపారు. అఫ్గాన్‌లోని అన్ని సంస్కృతులను ప్రతిబింబించేలా పాలకవర్గం ఉండాలని సూచించారు. ఇందుకోసం నిరంతరం వారితో చర్చలు జరుగుతున్నాయన్నారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రపంగం, తర్వాత జరిగిన పలు మీడియా మంతనాల్లో అమెరికా, నాటో కూటమి సేనలపై లవ్రోవ్‌ విమర్శలు గుప్పించారు. అఫ్గాన్‌ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించడాన్ని తప్పుబట్టారు. అనంతర పరిణామాలను అంచనా వేయకుండానే సేనలు నిష్క్రమించాయన్నారు. అఫ్గాన్‌లో అనేక ఆయుధాలను వదిలి వెళ్లారన్నారు. అవన్నీ వినాశనానికి ఉపయోగిస్తారేమోనన్నది ఇప్పుడు ఆందోళకరంగా మారిందన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కీలక సమస్యల పరిష్కారంలో ఐరాస పాత్ర ఆశించిన స్థాయిలో లేదని లవ్రోవ్‌ ఆరోపించారు. పశ్చిమ దేశాలు ఐరాస పాత్రను క్షీణింపజేస్తున్నాయన్నారు. లేదా కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేలా సంస్థపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అందుకు ఆయన కొన్ని సంఘటనలను పేర్కొన్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌ ఇటీవల చేసిన ‘బహుపాక్షికత కూటమి’, అమెరికా చెప్పిన ‘సమ్మిట్‌ ఫర్‌ డెమొక్రసీ’ ప్రతిపాదనలను ఆయన తప్పుబట్టారు. ఐరాస కంటే బహుపాక్షికత ఇంకా ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

ప్రపంచం మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని చవిచూసే అవకాశం ఉందని ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అది గతంలో అమెరికా, సోవియట్‌ యూనియన్ మధ్య కొనసాగిన దాని కంటే భయంకరంగా ఉండే అవకాశం ఉందన్నారు. దీనిపై లవ్రోవ్‌ స్పందించారు. చైనా, అమెరికా మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. దక్షిణ చైనా సముద్ర, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే ఈ విభేదాలు అణుయుద్ధానికి దారి తీయకుండా ఉండాలని రష్యా కోరుకుంటోందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని