భారత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణాలివే..! WHO

తాజా వార్తలు

Published : 27/04/2021 20:30 IST

భారత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణాలివే..! WHO

మరింత అవగాహన కల్పించాలని సూచన

జెనీవా: కరోనా బాధితులు అనవసరంగా ఆసుపత్రులకు పరుగుతీయడమే భారత్‌లో కరోనా సంక్షోభం మరింత తీవ్రమవడానికి ఒక కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ప్రజలు సమూహాలుగా ఏర్పడడం, కొత్త రకాల కరోనా వైరస్‌లు వెలుగుచూడడం, తక్కువ మందికే వ్యాక్సిన్‌ అందడం వంటి అంశాలు భారత్‌లో కరోనా వైరస్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని వెల్లడించింది.

కరోనా వైరస్‌ బారినపడుతున్న వారిలో కేవలం 15శాతం కంటే తక్కువ బాధితులకే ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి తారిక్‌ జసారెవిక్‌ పేర్కొన్నారు. వీరిలో కొందరికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం పడుతుందని అభిప్రాయపడ్డారు. కానీ, ప్రస్తుతం చాలా మంది రోగులు ఆసుపత్రులకు పరుగులు తీయడమే సమస్యకు మరో కారణమవుతోందని (సరైన సమాచారం, సలహా అందకపోవడంతో..) డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి వెల్లడించారు. ఇంటి వద్దే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ పంపిణీ తక్కువగా ఉన్న సమయంలో వ్యక్తిగత రక్షణ చర్యలపట్ల అలసత్వం వహించడం, సామూహిక సమావేశాలు, అత్యంత వ్యాప్తి కలిగిన వేరియంట్‌ వ్యాప్తి ఉన్న ప్రతి దేశంలో వైరస్‌ తుపానులా విజృంభిస్తుందనే విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతూనే ఉందని ఆయన గుర్తుచేశారు.

ఇలాంటి సమయంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, బాధితులకు చికిత్స గురించి వివరించడం, ఇంటి వద్దే చికిత్స తీసుకునేలా వారికి తెలియజెప్పడం, ప్రకటనలు, ప్రచార వేదికల ద్వారా సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి సూచించారు. అయితే, ప్రస్తుతం భారత్‌కు అవసరమైన కీలక వైద్య సామగ్రిని సరఫరా చేస్తున్నామని వీటితోపాటు 4వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కూడా పంపించామని పేర్కొన్నారు.

ఇక భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెడ్రెయేసస్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా వైద్య సామగ్రి, వేలాదిగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, లేబొరేటరీ పరికరాలు అందిస్తోందన్నారు. అంతేకాకుండా భారత్‌కు సిబ్బంది సహకారం అందించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ముందడుగు వేసినట్లు టెడ్రోస్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా మరణాల సంఖ్య 2లక్షలకు చేరువయ్యింది. ఇలాంటి సమయంలో పలు ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ బాధితులకు పడకల కొరత ఏర్పడడంతో పాటు ఆక్సిజన్‌ లభ్యంకాక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని