వచ్చేవారం వారణాసికి ప్రధాని..!

తాజా వార్తలు

Published : 11/07/2021 17:44 IST

వచ్చేవారం వారణాసికి ప్రధాని..!

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న ఉత్తర్‌ప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ సందర్భంగా నగరంలో సుమారు రూ.736 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని తెలిపాయి. అయితే వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని వారణాసి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. జపాన్‌ సహకారంతో సిగ్రా వద్ద నిర్మించిన రుద్రాక్ష్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటరను భారత్‌లో ఆ దేశ రాయబారితో కలిసి మోదీ ప్రారంభిస్తారు. దీంతో పాటు శ్రీ సుందర్‌లాల్‌ ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోడల్‌ ప్రసూతి, చిన్న పిల్లల విభాగం, వారణాసి-ఘాజీపుర్‌ రహదారిపై మూడు వరుసల పైవంతెన, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులకు 80 గృహాలు, కటారి, చోలాపుర్‌ పాఠశాలల్లో బాలికలకు వసతి గృహాలను ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా నగరంలో ఫెర్రీ సర్వీసు సహా వారణాసిలోని రాజ్‌ఘాట్‌ నుంచి అస్సీ ఘాట్‌ వరకు క్రూయిజ్‌ పడవలను ఆయన ప్రారంభిచనున్నారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో పలు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రధాని ఆవిష్కరించనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని