పద్యాలు చెబితే.. పెట్రోల్‌ ఫ్రీ!

తాజా వార్తలు

Updated : 15/02/2021 18:49 IST

పద్యాలు చెబితే.. పెట్రోల్‌ ఫ్రీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ‘ఏరా మనవడా..! ఒక చక్కటి పద్యం చెప్పు చాక్లెట్‌ కొనిస్తా’ అని తాతయ్యలు అనేవారు. పిల్లలు చకచకా పద్యాలు చెబితే అన్నట్లుగానే చాక్లెట్స్‌ తెచ్చి పంచేవారు. మాతృభాష సాహిత్యంపై ఆనాటి పెద్దలకు అంత అభిమానం ఉండేది. ఇప్పటి పిల్లలు మాతృభాషపై పట్టుతప్పుతున్నారనడంలో సందేహం లేదు. అందుకే సాహితీవేత్తలు, మాతృభాష ప్రేమికులు తమవంతుగా భాషను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో మాతృభాషకు ఎంతో గౌరవం ఇస్తారు. తమిళ సాహిత్యంపై ఉన్న ప్రేమను ఏదో ఒకరకంగా చాటుకుంటుంటారు. ఇటీవల ఓ పెట్రోల్‌ బంక్‌ యజమాని తమిళ సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేయడానికి, చదవడంపై ఆసక్తి పెంచడానికి ఓ వినూత్న ప్రయోగం చేశారు. తిరుక్కురల్‌ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికి ఉచితంగా పెట్రోల్‌ ఇస్తానని ప్రకటించారు.

తిరుక్కురల్‌ అంటే?

తమిళ సాహిత్యంలో తిరుక్కురల్‌కు ప్రత్యేక స్థానముంది. దీన్ని ప్రముఖ కవి తిరువల్లువర్‌ రచించారు. ఇందులో రాజకీయం, ఆర్థికం, నైతిక విలువలు, ప్రేమ వంటి అంశాలపై 1,330 పద్యాలు ఉంటాయి. ఇవి ద్విపద పద్యాలు. నేర్చుకోవడానికి ఎంతో సులభంగా ఉంటాయి. అలాగే, వీటి సారాంశాలు జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయి. అందుకే తమిళనాడుకు చెందిన 62 ఏళ్ల కె.సెంగుట్టువన్‌ కుటుంబానికి తిరుక్కురల్‌ అన్నా, దాన్ని రచించిన తిరువల్లువర్‌ అన్నా ఎంతో ఇష్టం. వల్లువర్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు కరూర్‌ సమీపంలో ఉన్న నాగంపల్లి ప్రాంతంలో ఓ పెట్రోల్‌ బంక్‌ ఉంది. దానికి కూడా ఆయన వల్లువర్‌ పేరే పెట్టారు.

పది చెబితే అర లీటర్‌.. 20 చెబితే లీటర్‌

అయితే, పెట్రోల్‌ ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో సెంగుట్టువన్‌కు ఒక ఆలోచన తట్టింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కురల్‌లో ఉన్న పద్యాల్లో కనీసం 20 పద్యాలు చెబితే ఒక లీటర్‌ పెట్రోల్‌, 10 పద్యాలు చెబితే అర లీటర్‌ పెట్రోల్‌ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు గత నెలలో ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వారి పిల్లలకు తిరక్కురల్‌ పద్యాలు నేర్పించి.. పెట్రోల్‌ బంక్‌కు తీసుకొస్తున్నారు. పద్యాలు చెప్పగానే తల్లిదండ్రులు పెట్రోల్‌ను ఉచితంగా పొందుతున్నారు. ఇప్పటి వరకు 170కి పైగా విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారని పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది తెలిపారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించారు. విద్యార్థులంతా ఈ పద్యాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు సెంగుట్టువన్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

టీచర్‌.. వృత్తి వ్యవసాయం.. లక్షల సంపాదన

ఒక్కడే పది వేల బావులు తవ్వించాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని