ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి టీకాలు

తాజా వార్తలు

Published : 20/02/2021 20:20 IST

ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి టీకాలు

ఐదో స్థానంలో భారత్‌

జెనీవా: కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మరో వైపు టీకాల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుండటం మంచి పరిణామం. ప్రపంచం మొత్తం మీద 107 దేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో అది సుమారు 10శాతం మాత్రమే. వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్న దేశాల్లో ఎక్కువశాతం అధిక ఆదాయ దేశాలున్నట్లు వారు వెల్లడించారు. పేద, మధ్యతరగతి దేశాలకు కూడా వ్యాక్సిన్లను అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 కోట్లకు పైగా నమోదయ్యాయి.

ఎక్కువ వ్యాక్సిన్లు అందించిన దేశాలు ఏవంటే..

యునైటెడ్‌ స్టేట్స్‌: కరోనా కారణంగా ఎక్కువ దెబ్బతిన్న దేశం అమెరికా. అక్కడ ఇప్పటివరకు సుమారు 6 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించారు. అందులో 4 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని అమెరికాకు చెందిన సీడీసీ సంస్థ వెల్లడించింది.

చైనా: ఫిబ్రవరి 9 వరకూ 4 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు చైనా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

యూరోపియన్‌ యూనియన్‌: ఈయూలో ఇప్పటి వరకూ రెండున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌లు అందించారు.  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న ఈయూ 1.5 బిలియన్లను (150 కోట్లను) పేద దేశాలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు ఇస్తున్నట్లు ప్రకటించింది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌: యూకేలో ఇప్పటి వరకు కోటీ డెబ్బైలక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. వారి జనాభాలో 26శాతం మందికి వ్యాక్సిన్లు అందించారు.

భారత్‌: జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో 34 రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్లను అందించినట్లు భారత్‌ ప్రకటించింది. వేగవంతమైన వ్యాక్సిన్‌ పంపిణీలో రెండోస్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.

ఇజ్రాయెల్‌: టీకాల పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్‌ ఆరో స్థానంలో ఉంది. కానీ వారి జనాభాలో 78 శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ అందించి ఇజ్రాయెల్‌ మొదటిస్థానంలో ఉంది. అక్కడ వందమందిలో 78.8 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో ఇప్పటివరకూ అరవైలక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని