కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమణ: ప్రధానికే భారీ జరిమానా!

తాజా వార్తలు

Published : 09/04/2021 18:12 IST

కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమణ: ప్రధానికే భారీ జరిమానా!

ఓస్లో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రకటించిన నార్వే ప్రధాన మంత్రే, వాటిని ఉల్లంఘించింది. దీంతో ఆమెకు అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.

కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా నార్వేలో కొవిడ్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 10 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతోంది. కానీ నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ ఈ మార్చిలో 60వ పుట్టినరోజు వేడుకను సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. ఆ కార్యక్రమంలో 13 మంది పాల్గొన్నారు. ఇది బయటకు పొక్కడంతో ఆవిడ క్షమాపణ కోరారు. కానీ భౌతిక దూరం ఆంక్షలకు విరుద్ధంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దాదాపు రూ.1.75 లక్షల జరిమానా (20వేల నార్వేజియన్‌ క్రోన్‌) విధించినట్లు నార్వే పోలీస్‌ చీఫ్‌ ఓలేసావెయరడ్‌ వెల్లడించారు. నిబంధనలు పాటించని చాలా కేసుల్లో జరిమానా వేయలేదు. కానీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానమంత్రే రూల్స్‌ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టకపోవడం వల్ల కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల అమలుపై సామాన్య ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని నార్వే పోలీసులు అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ విజృంభణతో యూరప్‌ వణుకుతోంది. అయితే ప్రధానమంత్రి ఎర్నా నేతృత్వంలో కరోనా కట్టడికి నార్వేలో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ కరోనా వ్యాప్తి కాస్త అదుపులోనే ఉంది. ఇప్పటి వరకు అక్కడ లక్షా రెండు వేల పాజిటివ్‌ కేసులు, 684 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని