Kim Jong-un: కిమ్‌ చేతికి కొత్త ఆయుధం.. బైడెన్‌కు తలనొప్పి..!

తాజా వార్తలు

Published : 14/09/2021 01:46 IST

Kim Jong-un: కిమ్‌ చేతికి కొత్త ఆయుధం.. బైడెన్‌కు తలనొప్పి..!

ఉ.కొరియా ఆయుధీకరణతో అమెరికాకు కష్టాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బైడెన్‌ శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పటి నుంచి కష్టాలకు ఎదురీదుతున్నారు. కొవిడ్‌ టీకా కార్యక్రమంలో విజయం సాధించేందుకు చేసిన యత్నం విఫలమై.. రోజుకు దాదాపు లక్షన్నర కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క అఫ్గాన్‌లో బలగాల ఉపసంహరణ విషయం బైడెన్‌ వైఫల్యాలను మిత్రదేశాలు కూడా తప్పు పడుతున్నాయి. చైనా విషయంలో అనుకున్నంత దూకుడుగా ఏమీ ఉండలేకపోతున్నారు. ట్రంప్‌తో చర్చలతో కొంత నెమ్మదించిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన ఆయుధాలకు పదును పెట్టడం మొదలుపెట్టారు.

సరికొత్త క్షిపణి పరీక్ష..

ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్‌ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్‌ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ పేర్కొంది. ఈ ప్రయోగానికి కిమ్‌ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు. 

అమెరికా మిత్రులకు ముప్పే..

ఈ క్షిపణి పరీక్ష అమెరికా మిత్రులకు కచ్చితంగా ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యశ్రేణి ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ క్షిపణి దాదాపు  బాలిస్టిక్‌ క్షిపణి అంత ముప్పును సృష్టిస్తుంది. దీనికి అణువార్‌ హెడ్‌ అమరిస్తే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి క్షిపణి ఉత్తరకొరియా చేతిలో పడటం నిజంగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పే. క్షిపణుల గమనాన్ని గుర్తించే రాడార్లను తప్పించుకొని ఇది ప్రయాణించగలదు.  

ఉత్తర కొరియాతో శాంతిచర్చలకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు రేపు జపాన్‌లోని టోక్యోలో ఒక భేటీ జరగనుంది. ఈ భేటీలో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా ప్రతినిధులు పాల్గొనున్నారు. దీనికి ముందే ఈ పరీక్ష జరగడం గమనార్హం. మరోపక్క బైడెన్‌ సర్కారు ఇప్పటికే ఉ.కొరియా అణునిరాయుధీకరణపై చర్చంచడానికి సిద్ధమేనని ప్రకటించింది. కానీ, ఆంక్షలను తొలగించడానికి మాత్రం సుముఖంగా లేదు. 

ఆంక్షలున్నా ఎందుకీ తెగింపు..

ఒక పక్క ఐరాస ఆంక్షల కారణంగా ఉ.కొరియా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అయినా కానీ, ఆ దేశం లక్ష్య పెట్టకుండా ఈ క్షిపణి పరీక్షలు చేస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా భౌగోళిక రాజకీయ పరిణామాలు మారాయి. ఈ నేపథ్యంలో తాము ఆయుధ పరీక్షలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ప్రతిస్పందనలను అంచనా వేయడం కోసం ఇది చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నా.. ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేయగలననే సందేశం ఇవ్వడం కోసం కూడా ఇలా చేసే ప్రమాదం ఉంది. 

అణ్వాయుధం అమర్చవచ్చా..?

తాజాగా ప్రయోగించిన క్షిపణి దాదాపు 1,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే జపాన్‌ వరకూ వెళ్లగలదు. ఈ క్షిపణిపై వాయిస్‌ ఆఫ్‌ కొరియా స్పందిస్తూ వ్యూహాత్మక ఆయుధంగా పేర్కొంది. అంటే దీనిపై న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌ అమర్చాలనే ఉద్దేశం ఉ.కొరియాకు ఉన్నట్లు తెలుస్తోంది.  

బైడెన్‌ వేచి చూసే ధోరణితో అసహనం..

బైడెన్‌ ప్రభుత్వం గతంలో ఒబామా పాలన సమయంలో అనుసరించిన వ్యూహాత్మక సహనం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికాలో నిపుణులు అభిప్రాయ పడ్డారు. అంటే.. గతంలో ట్రంప్‌ వలే మరోసారి వెంటనే చర్చలు జరిగే అవకాశాలు దాదాపు లేవనే అర్థం. యథాతథ పరిస్థితి కొనసాగుతుంది. అందుకే అమెరికా చర్చలపై ప్రకటన చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటోంది. ‘ఉ.కొరియా అణునిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు సిద్ధమే’ అని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ గురువారం పేర్కొన్నారు. అంటే ఉ.కొరియా అణ్వస్త్రాలు వదులుకొనేందుకు సిద్ధపడి చర్చలకు రావాలనే అర్థం. ఇది ఉ.కొరియాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కిమ్‌ బృందం తరపున దీనిపై ఎటువంటి స్పందనా వెలువడలేదు. కొన్ని రోజుల తర్వాత ఉ.కొరియా తొలి మధ్యశ్రేణి క్రూయిజ్‌ క్షిపణి గాల్లోకి ఎగిరింది. 2019 తర్వాత ఉ.కొరియా పరీక్షించిన కొత్త ఆయుధం ఇదే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని