NITI Aayog: ఉచిత ఆన్‌లైన్‌ విద్యాంశాలపై నీతి ఆయోగ్‌, బైజుస్‌ ఒప్పందం

తాజా వార్తలు

Published : 17/09/2021 22:35 IST

NITI Aayog: ఉచిత ఆన్‌లైన్‌ విద్యాంశాలపై నీతి ఆయోగ్‌, బైజుస్‌ ఒప్పందం

దిల్లీ: ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే క్రమంలో నీతి ఆయోగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ విధానంలో పిల్లలకు ఉచితంగా విద్యాంశాలు అందుబాటులో ఉంచేలా ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ ‘బైజుస్‌’తో భాగస్వామ్యమైంది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 112 జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఒప్పందంలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి.. బైజుస్‌ కెరీర్-ప్లస్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా మూడు వేల మంది 11,12 తరగతుల విద్యార్థులకు నీట్‌, జేఈఈ కోచింగ్ ఇవ్వనున్నారు. పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. ట్యాబ్లెట్‌లు/ స్మార్ట్‌ఫోన్‌లు అందజేస్తారు. రెండో విభాగంలో.. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు బైజు లెర్నింగ్ యాప్ ద్వారా మూడేళ్లపాటు పాఠాలు నేర్చుకోవచ్చు.

సాంకేతికత కీలక పాత్ర..

ఈ భాగస్వామ్యంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ విద్యావిధానంలో సాంకేతికత కీలకంగా మారిందన్నారు. ‘విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలకు టెక్నాలజీ దోహదపడింది. ఈ క్రమంలో బైజుస్‌ సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంద’ని ఆయన తెలిపారు. బైజుస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ మాట్లాడుతూ.. ‘అందరికీ విద్య’ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది పిల్లల చదువులకు తోడ్పాటునందిస్తున్నట్లు వివరించారు. ‘నీతి ఆయోగ్‌తో జట్టుకట్టడం ద్వారా మా ప్రయత్నాలు మరింత బలోపేతం అవుతాయి. ఫలితంగా వెనుకబడిన వర్గాలు, ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు మరింత అభివృద్ధి చెందుతారు’ అని అన్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని