సామూహిక సెలవుల్లో 230 మంది వైద్యులు

తాజా వార్తలు

Updated : 01/06/2021 21:43 IST

సామూహిక సెలవుల్లో 230 మంది వైద్యులు

నాగ్‌పూర్‌: కరోనా సోకినవారికి ప్రాణాలు పణంగా పెట్టి చికిత్స అందిస్తూ ముందువరుస యోధులుగా నిలుస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం దేశంలో వైద్య సేవలు ఎంతో అవసరమైన వేళ కొన్నిచోట్ల వారు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు, ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో 230 మంది రెసిడెంట్‌ డాక్టర్లు అకస్మాత్తుగా నిరవధిక సెలవుల్లోకి వెళ్లారు. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తమను కొవిడ్‌ సేవల నుంచి రిలీవ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌పై దృష్టి సారించగలుగుతామని చెబుతున్నారు. అయితే వైద్యుల సామూహిక సెలవుల వల్ల ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి(ఐజీజీఎంసీహెచ్‌)లో ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర అసోసియేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రజత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఐజీజీఎంసీహెచ్‌ రెసిడెంట్‌ వైద్యులు గత 15 నెలలుగా నిస్వార్థంగా కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌ పరిధిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి వారిని ఆ సేవల నుంచి రిలీవ్‌ చేస్తే.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌పై దృష్టి పెడతారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వారి ఉన్నత చదువులను సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అందుకే మరో మార్గం లేక కొవిడ్‌ సేవల నుంచి తప్పుకుంటూ.. సామూహికంగా సెలవులు పెట్టారు’’ అని వివరణ ఇచ్చారు. 

అలాగే, నాన్‌-కొవిడ్‌ చికిత్సల కోసం సర్జికల్‌ కాంప్లెక్స్‌ను కేటాయిస్తామని గతంలోనే జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అగర్వాల్‌ డిమాండ్‌ చేశారు. గతంలోనూ ఐజీజీఎంసీహెచ్‌ రెసిడెంట్‌ వైద్యులు పలు డిమాండ్లను డీన్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని