సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా...

తాజా వార్తలు

Updated : 07/01/2021 17:27 IST

సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా...

ఒక్క నిర్ణయంతో నైతిక విజయం సాధించిన మైక్‌ పెన్స్‌

వాషింగ్టన్‌: అమెరికాకు రెండో సారి అధ్యక్షుడయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వీడకుండా ట్రంప్‌ చేసిన  ప్రయత్నం.. ఆ దేశ చరిత్రలోనే ఎవరూ ఊహించని పరిణామానికి దారితీసింది. మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్‌ వైఖరి.. వారు ఆ దేశ చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌ బిల్డింగ్‌పై దాడి చేసే వరకూ తీసుకొచ్చింది. అదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీకే చెందిన ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ నిర్ణయం ప్రజాస్వామ్య భావనకు, రాజ్యాంగ నిబద్ధతకు తిరుగులేని నిదర్శనంగా నిలిచింది.

గెలిపించు.. పెన్స్‌కు ట్రంప్‌ సూచన

ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను అధికారికంగా ప్రకటించే  కాంగ్రెస్‌ ఉమ్మడి పాలక సభ (జాయింట్‌ కాంగ్రెషనల్‌ సెషన్‌) సమావేశానికి.. ఆ దేశ ఉపాధ్యక్షుడైన పెన్స్‌ నేతృత్వం వహిస్తారు.  పరాజయాన్ని తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్న ట్రంప్‌.. తమ పార్టీకే చెందిన మైక్‌ పెన్స్‌ను పావుగా వాడుకోవాలనే ఆలోచన చేశారు.  ఎన్నికల ఫలితాలను తిప్పి పంపే అధికారం పెన్స్‌కు ఉందంటూ ట్రంప్‌ బహిరంగంగానే ట్వీట్‌ చేశారు. ‘సరైన’ చర్య తీసుకోవాల్సిందిగా బుధవారం నాటి కాంగ్రెస్‌ సమావేశానికి ముందు కూడా  ట్రంప్‌, ఉపాధ్యక్షుడికి  అన్యాపదేశంగా సూచించారు.

అభ్యంతరం సరే.. అంగీకరించలేను

ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో.. తన నిర్ణయాన్ని పెన్స్‌ స్పష్టం చేశారు. ‘‘నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాల ఫలితాలను పరిగణించ వద్దంటూ కొందరు విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాలను లేవనెత్తి, అందుకు తగిన ఆధారాలను సమర్పించే చట్టబద్ధమైన హక్కును నేను ఆమోదిస్తాను. ఐతే ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా  రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని నేను ప్రమాణం చేశాను. చట్టబద్ధంగా లభించిన ఎలక్టోరల్‌ ఓట్లను పరిగణించకుండా చేసే అధికారం నాకు లేదు. దీనితో వారి డిమాండుకు ఆమోదముద్ర వేయరాదనే నిర్ణయానికి వచ్చాను.’’ అంటూ ఆయన కుండ బద్దలు కొట్టారు.

ఇటీవలి పరిణామాలతో రెండో సారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టే మాట అటుంచి.. అగ్రరాజ్య చరిత్రలోనే చీకటి అధ్యాయం అనదగ్గ సంఘటనలకు కారకుడనే చెడ్డపేరును ట్రంప్‌ మూటకట్టుకోవాల్సి వచ్చింది. ట్రంప్‌ ఓటమిని తిరగరాసే అధికారం తనకు లేదంటూ మైక్‌ పెన్స్‌ నిష్కర్షగా చేసిన ప్రకటన కూడా అమెరికా చరిత్రలో ఆయన విజ్ఞతకు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిపోతుంది.

ఇవీ చదవండి..

 అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పులు

అమెరికా ఘటన.. మోదీ స్పందన


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని