మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందా?

తాజా వార్తలు

Published : 13/04/2021 18:43 IST

మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందా?

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమీక్ష

ముంబయి: కరోనా వైరస్‌ విజృంభణతో మహారాష్ట్ర వణికిపోతోంది. దీంతో వైరస్‌ కట్టడికి ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వారాంతంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయినా వైరస్‌ తీవ్రత అదుపులోకి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మరికొద్ది గంటల్లోనే మీడియా ముందు ప్రకటన చేసే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తీవ్రరూపం దాల్చింది. నిత్యం 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. కానీ వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. కరోనా కట్టడి చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం మరోసారి చర్చలు జరిపారు. ఇందులో కరోనా కట్టడికి కార్యాచరణను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే వైరస్‌ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తారా? పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

ఇంటి బాట పట్టిన వలస కార్మికులు

రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండడంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలవుతుందనే ఆందోళన అక్కడి ప్రజలు, వలస కార్మికుల్లో నెలకొంది. గతకొన్ని రోజులుగా వస్తోన్న లాక్‌డౌన్‌ సంకేతాలతో ఇప్పటికే వలస కార్మికులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలతో ముంబయి రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వైపు వెళ్లే జాతీయ రహదారులు వలస కార్మికుల వాహనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌కు వ్యతిరేకం!

రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి కుంటుపడడంతో పాటు ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కాకుండా కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తూ వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు లాక్‌డౌన్‌ను అక్కడి వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అన్ని రంగాల ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని