న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌!

తాజా వార్తలు

Published : 14/02/2021 20:12 IST

న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌!

వెల్లింగ్‌టన్‌: కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన న్యూజిలాండ్‌, అందులో విజయం సాధించి ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. ఇందుకోసం తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే, తాజాగా అక్కడ అధిక జనాభా కలిగిన ఆక్లాండ్‌ నగరంలో మూడు కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ నగరంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

ఓవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, మరోవైపు వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తూ కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే, న్యూజిలాండ్‌లో మాత్రం విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలోనే న్యూజిలాండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్,‌ మంత్రివర్గంతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆ కేసులు సాధారణ కరోనా వైరస్‌కు చెందినవా? కొత్తరకం వైరస్‌కు చెందినవా? అని తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, కరోనా కట్టడిని సమర్థంగా చేపట్టిన న్యూజిలాండ్‌ ఆరు నెలల తర్వాత మరోసారి లాక్‌డౌన్‌ విధించింది. కేవలం ఆక్లాండ్‌ కాకుండా ఇతర నగరాల్లోనూ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే, దాదాపు 50లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 2300 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో 25మంది ప్రాణాలు కోల్పోయారు.

సరిహద్దు ఆంక్షలను అమలుచేస్తోన్న జర్మనీ..

అటు కరోనా వైరస్‌తో వణికిపోతోన్న యూరప్‌ దేశాలు వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్తరకం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగా జర్మనీ కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. నేటినుంచి సరిహద్దు ప్రాంతాలను నుంచి వచ్చే వాహనాలను నియంత్రించడంతో పాటు పలు ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కచ్చితంగా ముందస్తుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా రకాలకు చెందిన వైరస్‌లు వెలుగు చూడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, జర్మనీలో గతకొన్ని రోజులుగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. అటు బ్రిటన్‌లోనూ వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
వుహాన్‌ వెళ్లి వెతికితే..!
కరోనా మూలాల శోధనపై అమెరికా ఆందోళన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని