వేర్వేరు డోసులపై కిరణ్‌ మజుందార్‌ షా ఏమన్నారంటే?

తాజా వార్తలు

Updated : 02/07/2021 15:14 IST

వేర్వేరు డోసులపై కిరణ్‌ మజుందార్‌ షా ఏమన్నారంటే?

అమెరికా టీకాలు భారత్‌లో ఉత్పత్తి చేయడమే మేలన్న బయోకాన్‌ చీఫ్‌

దిల్లీ: కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ల వేర్వేరు డోసులను తీసుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీటిపై అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బయోఫార్మా సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌పై స్పందించారు. రెండు వేర్వేరు డోసులను తీసుకోవడం వల్ల వైరస్‌ నుంచి మెరుగైన రక్షణ కలుగుతున్నట్లు ఇప్పటివరకూ వచ్చిన అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న వేళ.. ఈ విధానంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

‘వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు వ్యాక్సిన్‌ డోసుల మిక్సింగ్‌పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాలు.. వేర్వేరు డోసులు ఇవ్వవచ్చనే సూచిస్తున్నాయి. అంతేకాకుండా చాలా వ్యాక్సిన్‌ల నిల్వ సామర్థ్యం ఒక సంవత్సరం, లేదా అంతకన్నా ఎక్కువే ఉంది’ అని కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లకు చెందిన రెండు వేర్వేరు డోసులను తీసుకున్న వారిలో రోగనిరోధకత ప్రతిస్పందనలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలిన విషయాన్ని మజుందార్‌ షా పరోక్షంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌లు భారత్‌లో తయారు చేయడమే మేలని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యంగా మోడెర్నా దిగుమతికి అనుమతి లభించిన నేపథ్యంలో ఫైజర్‌కు కూడా ఆమోదం తెలపాలని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతికి ఈ మధ్యే అనుమతి లభించింది. మరికొన్ని రోజుల్లోనే ఫైజర్‌కు కూడా అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం సరాసరి 50లక్షలకు పైగానే డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 34కోట్ల డోసులను అందించారు. అయితే, వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ఆలోచన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని