కావేరిపై ప్రాజెక్టు కట్టి తీరుతాం: యడియూరప్ప

తాజా వార్తలు

Published : 07/07/2021 01:25 IST

కావేరిపై ప్రాజెక్టు కట్టి తీరుతాం: యడియూరప్ప

బెంగళూరు: వివిధ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతున్నాయి. ఓ వైపు కృష్ణా జలాల నీటి లభ్యత, వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా.. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోనూ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావేరి నదిపై కర్ణాటక నిర్మించనున్న మేకెదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని తమిళనాడు డిమాండ్‌ చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని యడియూరప్ప సర్కారు కుండబద్దలు కొట్టిమరీ చెబుతోంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. కావేరి నదిపై మేకెదాటు ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. కర్ణాటక ప్రజలకు దీనిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు.

‘‘ పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. ఏ కారణాలతోనూ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోకూడదు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతున్నందున స్నేహశీల వాతావరణంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ రాష్ట్రం సరిగా స్పందించడం లేదు. అయినా మనం వెనకడుగు వేయబోం. మేకెదాటు ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం. దీనిలో ప్రజలు సందేహించాల్సిందేమీ లేదు’’ అని యడియూరప్ప స్పష్టం చేశారు. ఇదే అంశంపై సీఎం యడ్డీ శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడవద్దని కోరారు. ఏమైనా అభ్యంతరాలుంటే కలిసి మాట్లాడుకుందామని అన్నారు. దీనిపై ఆదివారం స్టాలిన్‌ స్పందించారు. మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల తమిళనాడు రైతులకు నష్టం కలుగుతుందని సమాధానమిచ్చారు.

మేకెదాటు ప్రాజెక్టువల్ల ఇరు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని, కావేరి మిగులు జలాలను ఉపయోగించుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కర్ణాటక చెబుతోంది. కానీ, కాబిని సబ్‌ బేసిన్‌ నుంచి నీటిని తీసుకెళ్లేందుకే కర్ణాటక ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకొచ్చిందని తమిళనాడు వాదిస్తోంది. మేకెదాటు బహుళార్థసాధక ప్రాజెక్టు. దీనిద్వారా బెంగళూరు, పరిసర ప్రాంతాలకు 4.75 టీఎంసీల తాగునీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా 400 మెగావాట్ల విద్యుత్‌ తయారు చేసే యోచనలో ఉన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.9000 కోట్లు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కేంద్రం నుంచి అనుమతి పొంది త్వరలో మేకెదాటు పనులు ప్రారంభించాలని కర్ణాటక భావిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని