వారిద్దరిది రహస్య స్నేహం: మనీశ్‌ సిసోడియా

తాజా వార్తలు

Published : 12/06/2021 16:31 IST

వారిద్దరిది రహస్య స్నేహం: మనీశ్‌ సిసోడియా

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత మనీశ్‌ సిసోదియా ఆరోపించారు. పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఇటీవల కేంద్రం విడుదల చేసిన ‘పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్(పీజీఐ)- 2019-20‌’లో పంజాబ్‌ ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని తెలిపారు. కానీ అక్కడి పాఠశాలల అభివృద్ధికి అమరీందర్‌ సింగ్‌ ఎంతో కృషి చేశారంటూ మోదీ మెచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  ఈ విషయంలో అమరీందర్ సింగ్‌ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే అక్కడ పాఠశాలల పనితీరు అద్భుతంగా ఉందని తాజా నివేదిక ద్వారా ప్రధాని మోదీ వెల్లడించారంటూ విమర్శించారు. వారిద్దరి మధ్య చీకటి ఒప్పందానికి ఈ నివేదిక ఓ ఉదాహరణ అన్నారు. గడిచిన రెండు మూడేళ్లలో సుమారు 800 ప్రభుత్వ పాఠశాలలను పంజాబ్ సీఎం మూయించారన్నారు. మిగిలిన పాఠశాలలను ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు.  కొద్ది రోజుల తర్వాత పంజాబ్‌ ఆసుపత్రులను గొప్ప పనితీరు కలిగినవిగా చూపేందుకు మరో రిపోర్టును విడుదల చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. ‘పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్(పీజీఐ)- 2019-20ను కేంద్రం ఆదివారం విడుదల చేసింది. అంతకుముందు ఏడాది ఈ సూచీలో 13వ స్థానంలో ఉన్న పంజాబ్‌ ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. ఛత్తీస్‌గఢ్‌ రెండు, తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. ఆరో స్థానంలో దిల్లీ నిలిచింది. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని