ఎలా ఉన్నారు?.. ‘నాన్‌స్టాప్‌’ వ్యాపారం బాగుందా? 

తాజా వార్తలు

Published : 16/02/2021 01:35 IST

ఎలా ఉన్నారు?.. ‘నాన్‌స్టాప్‌’ వ్యాపారం బాగుందా? 

అట్లాంటాలో భారతీయ రెస్టారెంట్‌ యజమానులతో అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రపంచంపై పడగవిప్పిన కరోనా వైరస్‌ అన్ని వ్యాపారాలూ కుదేలయ్యేలా చేసింది. ముఖ్యంగా అమెరికాను కకావికలం చేసిన ఈ మహమ్మారి‌.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న నూతన అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. తాజాగా ఆయన జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలోని నాన్‌స్టాప్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ యజమానులతో మాట్లాడి వారి బాగోగులను, వ్యాపారం ఎలా ఉందో తెలుసుకోవడం విశేషం. బైడెన్‌ వర్చువల్‌ చాట్‌లో నాన్‌స్టాప్‌ రెస్టారెంట్‌ యజమానులు నీల్‌, సమీర్‌ ఇద్నానీలతో మాట్లాడిన వీడియోను శ్వేతసౌధం విడుదల చేసింది.

వ్యాపారంపై కరోనా ప్రభావం ఎలా ఉందనే అంశాన్ని జో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమీర్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో చిన్న వ్యాపారులకు ప్రతి రోజూ ప్రశ్నార్థకంగానే ఉందని తెలిపారు. హాయ్‌.. ఎలా ఉన్నారు? అంటూ ‘నాన్‌స్టాప్’‌ యజమానులను బైడెన్‌ అడగ్గా.. గతేడాది కరోనా వచ్చినప్పటి నుంచి తమ వ్యాపారం దాదాపు 75శాతం పడిపోయినట్టు నీల్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 20 - 25 మంది సిబ్బంది పనిచేసేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 10 -15 వరకు తగ్గిపోయినట్టు తెలిపారు.

దీంతో స్పందించిన బైడెన్‌.. మీ రెస్టారెంట్‌ నిలదొక్కుకొనేందుకు తక్షణం చేయాల్సింది ఏమిటో చెప్పాలని అడగ్గా..  ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్‌ వేయించి, అందరూ స్వేచ్ఛగా బయట తిరిగేలా చేయడం అవసరమని నీల్‌ అన్నారు. చిన్న వ్యాపారులకు 10లక్షల డాలర్లు ఇచ్చేలా ఉపశమన ప్యాకేజీ ఉన్నట్టు తెలిపారు. అట్లాంటాలోని మూడు ప్రదేశాల్లో నాన్‌స్టాప్‌ ఫుడ్‌ సరఫరా చేస్తోంది. శ్వేతసౌధం విడుదల చేసిన ఈ వీడియోను  1.8లక్షల మందికి పైగా ఫేస్‌బుక్‌లో వీక్షించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని