9/11 attacks : ఆ రక్తపు మరకలకు రెండు దశాబ్దాలు!

తాజా వార్తలు

Updated : 11/09/2021 11:13 IST

9/11 attacks : ఆ రక్తపు మరకలకు రెండు దశాబ్దాలు!

కళ్ల ముందే వందల అంతస్తుల భవంతులు కుప్పకూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అగ్రరాజ్య ఆధిపత్యంపై పోరాటమంటూ ఉగ్రవాదులు చేపట్టిన ఆ మారణహోమం.. కొన్ని వేలమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. రక్షణ వ్యవస్థ పరంగా బలమైన దేశంగా భావించే అమెరికాలో అల్ ఖైదా ముష్కరుల నరమేధం జరిగి.. 2 దశాబ్దాలు పూర్తి కాగా.. ఆ రక్తపు మరకలు చెరిపేసేందుకు అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.


కోలుకోలేని దెబ్బకొట్టాలని వ్యూహరచన..

దర్పానికీ.. ఆధిపత్యానికీ చిహ్నంగా ఎత్తైన భవంతుల్ని పరిగణిస్తారు. ఆ ప్రాంతానికే తలమానికంగా నిలిచే ఆకాశహర్మ్యాలతో తమ ఘనత చాటుకునే ప్రయత్నం చేస్తాయి చాలా దేశాలు. సరిగ్గా ఆ అంశంపైనే అగ్రరాజ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసింది అల్‌ఖైదా. అమెరికాకు కీలకమైన నాలుగు భవంతుల్ని కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బకొట్టాలని ఉగ్రవాదులు భావించారు. పాకిస్థానీ మిలిటెంట్‌ ఖలీల్‌ అహ్మద్‌ షేక్‌ వ్యూహ రచనలో అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. సెప్టెంబరు 11, 2001న 4 విమానాలను పథకం ప్రకారం హైజాక్‌ చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి ప్రఖ్యాత భవంతులపై దాడులకు పాల్పడ్డారు.


మారణహోమంలో 2,996 మంది మృతి..

మ్యాన్‌హాటన్‌లో ‘ట్విన్‌ టవర్స్‌’గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులను నిమిషాల వ్యవధిలో కూల్చేశారు. ఈ ప్రదేశంలోనే విమానంలోని ఉగ్రవాదులు, ప్రయాణికులు కూలిన భవనాల కింద చిక్కుకొని మృతిచెందారు. మొత్తం 2,763 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మూడో విమానం పెంటగాన్‌లో అమెరికా రక్షణ కార్యాలయంలోని ఓ భవంతిని ఢీకొట్టగా.. శ్వేతసౌధం లక్ష్యంగా సాగిన నాలుగో విమానం సోమర్‌సెట్‌ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి.


నెల వ్యవధిలోనే అమెరికా ప్రతీకార దాడులు..

2001, అక్టోబర్‌ 7న అమెరికా నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న అఫ్గాన్‌ సరిహద్దులపై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తాలిబన్లను గద్దెదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమిద్‌ కర్జాయ్‌ను దేశాధ్యక్షుడిగా నియమించింది. దేశ పాలన, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల పాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అయితే, తాలిబన్లు, అల్‌ఖైదా తీవ్రవాదులపై ఎన్నో దాడులు చేసినా.. ఎంతమందిని హతమార్చినా లాభం లేకపోయింది. పశ్చిమ పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన తాలిబన్లు తిరిగి సంఘటితమయ్యారు. 2002 నుంచే ఎదురు దాడులు ప్రారంభించారు. ఫలితంగా 3,500 మంది నాటో సైనికులు చనిపోయారు. వీరిలో అమెరికా మిలిటరీ సిబ్బందే 2,300 మంది వరకు ఉన్నారు. మరో 20,660 మంది అమెరికా సైనిక సిబ్బంది క్షతగాత్రులయ్యారు.


2 లక్షల కోట్ల డాలర్లు వ్యయం..

అఫ్గాన్‌లో 2001, అక్టోబర్‌ 7న మొదలైన అమెరికా-నాటో దాడులు 20ఏళ్ల పాటు కొనసాగాయి. అప్పటి నుంచి 93,527 వైమానిక దాడులు జరిగాయని పెంటగాన్‌ వెల్లడించింది. 20 వేల మంది ఉగ్రవాదుల్ని హతమార్చామని పేర్కొంది. అయితే, ఈ సంఖ్యపై రక్షణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దాడుల్లో 48 వేల మంది అఫ్గాన్‌ పౌరులు కూడా మరణించారు. సైనిక చర్యకు, అమెరికా పునఃనిర్మాణానికి అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. జర్మనీ, భారత్‌, బ్రిటన్‌ తదితర దేశాలూ భారీగా ఖర్చు చేశాయి. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.


పాకిస్థాన్‌, టర్కీ దన్నుతో తాలిబన్ల ఎదురుదాడులు..

పాక్‌లో అబోటాబాద్‌లో తలదాచుకున్న లాడెన్‌ను 2011, మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే, పాక్‌లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్‌ఖైదా నేతలనుగానీ, తాలిబన్లనుగానీ అంతమొందించలేకపోయింది. అంతర్యుద్ధ సమస్య పరిష్కరించలేకపోయింది. ఇంకోవైపు అఫ్గాన్‌ పాలకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. అఫ్గాన్‌ సైన్యానికీ, పోలీసు బలగాలకూ అమెరికా, భారత్‌ శిక్షణనిచ్చాయి. కానీ, వారిని సరైన దిశలో వినియోగించుకోవడంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, ఆయన ప్రభుత్వం, సైన్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇంకోవైపు నాటో దాడుల్లో ప్రాణనష్టం జరిగినా తాలిబన్లు పూర్తిగా వెనక్కి తగ్గలేదు. పాకిస్థాన్‌, టర్కీ పరోక్ష దన్నుతో ఎదురుదాడులు కొనసాగించారు. అమెరికా దాడులు తరచూ లక్ష్యాలు తప్పి అమాయక పౌరులను బలిగొనడంతో అధ్యక్షుడు కర్జాయ్‌ అప్పట్లో తీవ్రంగా నిరసించారు. రక్షణ బాధ్యతల్ని తమకే అప్పగించాలని.. అమెరికా సేనల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అందుకే ఆయన స్థానంలో ఘనీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. ఈయన ఏలుబడిలో పరిస్థితులు మరింత దిగజారాయి.


చేసేది లేక శాంతి ఒప్పందం..

సైనిక నష్టం నానాటికీ పెరగడం.. స్వదేశంలో నిరసనలు హెచ్చుమీరడంతో అమెరికా.. తాలిబన్లతో శాంతిచర్చలకు సిద్ధమైంది. చివరకు అఫ్గాన్‌ భూభాగంలో అమెరికా సైన్యం ఉండరాదన్న షరతుకు తలొగ్గి నిరుడు ఫిబ్రవరి 29న వారితో శాంతి ఒప్పందం కుదుర్చుకొంది. అయితే, ఈ శాంతిప్రక్రియలో అఫ్గాన్ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకపోవడంతో ఘనీ సర్కార్‌ ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. అయితే, గత ఏడాది నుంచి తాలిబన్లపై అమెరికా, నాటో దళాలు వైమానిక దాడులను నిలిపివేశాయి. అఫ్గాన్‌ సేనలు మాత్రమే పోరాడాయి. కానీ, ఘనీ బృందంలోని పలువురు నేతలు తాలిబన్లతో చేతులు కలిపారు. ఫలితంగా సైన్యానికి మార్గనిర్దేశం చేసేవారే కరవయ్యారు. దీంతో సైనికుల్లోనూ నిర్లిప్తత పెరిగింది. పోరాడకుండానే తాలిబన్లకు లొంగిపోయారు.


20 ఏళ్ల పోరాటం ఎందుకోసం? ఎవరికోసం?

ఉగ్రవాదులపై పోరులో భాగంగా ఘన విజయం సాధించామని చెప్పుకొంటున్న అమెరికా ఈ 20 ఏళ్లలో సాధించింది ఏంటంటే.. శూన్యం అన్న విమర్శలే వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం కంటే మరింత బలంగా తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని చేపట్టారు. షరియా వంటి కఠినమైన చట్టాల్ని అమలు చేస్తామని స్పష్టమైన సంకేతాలూ ఇస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేశారు. మరి ఈ 20 ఏళ్ల పోరాటం ఎందుకోసం? ఎవరికోసం? అనేవి సమాధానం లేని ప్రశ్నలే!!

అఫ్గాన్‌ పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా చెబుతోంది. మిలిటెంట్‌ నెట్‌వర్క్‌లను అణచివేసేందుకు తాలిబన్లకు సాయపడతామని వివరిస్తోంది. సాలేహ్‌, మసూద్‌ నేతృత్వంలోని కూటమిపై పోరాడేందుకు తాలిబన్లకు సహకరిస్తే.. అది అగ్రరాజ్యానికే చేటు చేస్తుంది. అమెరికా కారణంగానే అఫ్గాన్‌లోకి తాలిబన్లు అడుగు పెట్టారు. బలగాల ఉపసంహరణ విషయమై.. గతంలోనే తాలిబన్లతో అమెరికా ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా జాగ్రత్త పడింది.

-కెప్టెన్‌ అనిల్‌ గౌర్‌, రక్షణరంగ నిపుణులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని