IIT Guwahati Research: పెట్టుబడులను కమ్మేసే కాలుష్యం

తాజా వార్తలు

Updated : 28/07/2021 09:39 IST

IIT Guwahati Research: పెట్టుబడులను కమ్మేసే కాలుష్యం

కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెదజల్లే కంపెనీలకు దీర్ఘకాలంలో పెనునష్టం
ఐఐటీ, ఐఐఎం శాస్త్రవేత్తల పరిశోధన

దిల్లీ: కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే కంపెనీల వల్ల పెట్టుబడిదారులకు స్వల్పకాలంలో అధిక ప్రతిఫలం వచ్చినా.. దీర్ఘకాలంలో మాత్రం భారీ నష్టాలు మూటగట్టుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యకారక గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల (జీహెచ్‌జీ)పై ప్రభుత్వాలు భారీగా ఆంక్షలు విధిస్తాయని, ఫలితంగా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపారు. గువాహటిలోని ఐఐటీ, బెంగళూరులోని ఐఐఎం సంస్థల పరిశోధకులు సరికొత్త గణిత నమూనాతో విశ్లేషణ జరిపి ఈ మేరకు తేల్చారు. కంపెనీలు వెలువరించే కాలుష్యాన్ని బట్టి ఆ సంస్థల్లో పెట్టుబడులకు రిస్కు ఉంటుందని పేర్కొన్నారు. అమెరికన్‌ మార్కెట్‌లోని దాదాపు 200 లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ కంపెనీల కాలుష్యం స్థాయిని విశ్లేషించడానికి.. వాటి నుంచి నేరుగా వెలువడే జీహెచ్‌జీ ఉద్గారాలు, కొనుగోలు చేసిన జీహెచ్‌జీ ఉద్గారాల (విద్యుత్‌ వినియోగం తదితరాల ద్వారా)ను పరిగణనలోకి తీసుకున్నారు. 2016-2019లో 71.6 శాతం కంపెనీల్లో కర్బన ఉద్గారాలు తగ్గినట్లు తేల్చారు. ఈ సంస్థల ఆర్థిక వివరాలనూ పరిశీలించారు. అధిక కాలుష్యం వల్ల స్వల్పకాలంలో లాభాలు వస్తాయని తేల్చారు. అయితే వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలు పెరిగేకొద్దీ జీహెచ్‌జీ ఉద్గారాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. భూతాపానికి ఎక్కువగా కారణమయ్యే కంపెనీల నుంచి భారీగా పన్నులు, రుసుములు వసూలు చేసే వీలుందన్నారు. అధిక కాలుష్యాన్ని వెదజల్లడం ద్వారా స్వల్పకాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే ‘కర్బన రిస్కు ప్రీమియాని’కి.. భవిష్యత్‌లో తలెత్తబోయే రిస్కుకు మధ్య గణితపరమైన సంబంధాన్ని తాము వెలుగులోకి తెచ్చామని ఐఐటీ అధ్యాపకుడు సిద్ధార్థ ప్రతిమ్‌ చక్రవర్తి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని