ఆక్సిజన్‌ కొరత: జర్మనీ నుంచి ప్లాంట్ల దిగుమతి!

తాజా వార్తలు

Published : 23/04/2021 18:20 IST

ఆక్సిజన్‌ కొరత: జర్మనీ నుంచి ప్లాంట్ల దిగుమతి!

వారంలోనే అందుబాటులోకి తేనున్న రక్షణశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్లాంట్ల నుంచి ‘ఎక్స్‌ప్రెస్‌’ వేగంతో ఆక్సిజన్‌ కంటెయినర్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ ఆక్సిజన్‌ కొరత తీరడం లేదు. దీంతో అప్రమత్తమైన భారత్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.

జర్మనీ నుంచి మొబైల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను తీసుకువచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు అప్పగించింది. తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్‌ కేంద్రాల్లో(ఏఎఫ్‌ఎంఎస్‌) ఈ మొబైల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని రక్షణశాఖ వెల్లడించింది. అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొంది. కేవలం వారం రోజుల్లోనే ఈ మొబైల్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అవసరమైన ఆక్సిజన్‌ కంటెయినర్లను యుద్ధవిమానాల ద్వారా భారత వాయుసేన చేరవేస్తోంది.

ఇక దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే, రక్షణశాఖ కార్యదర్శి, డీఆర్డీవో చీఫ్‌లతో సమీక్ష నిర్వహించిన కేంద్ర రక్షణమంత్రి, వారికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే పలు కంటోన్మెంట్‌ ఆసుపత్రులను కొవిడ్‌ రోగులకు అందుబాటులోకి తీసుకురాగా.. రక్షణశాఖ తరపున వైద్య పరికరాలు, సిబ్బంది కొవిడ్‌ రోగుల సేవల్లో నిమగ్నమయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని