31 కల్లా ముగించాల్సిందే..

తాజా వార్తలు

Updated : 25/08/2021 10:08 IST

31 కల్లా ముగించాల్సిందే..

అఫ్గాన్‌ నుంచి తరలింపు చర్యలపై బైడెన్‌ కీలక నిర్ణయం
గడువు పొడిగింపునకు నిరాకరణ
తాలిబన్లతో అమెరికా రహస్య మంతనాలు

వాషింగ్టన్‌/ లండన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి తమ బలగాలు, పౌరులు, శరణార్థుల తరలింపు తుది గడువుపై నెలకొన్న ఉత్కంఠకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం తెరదించారు! ముందుగా నిర్దేశించుకున్నట్లే ఈ నెల 31 కల్లా తమవారందర్నీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. గడువు పొడిగించేందుకు నిరాకరించారు. 31 కల్లా తరలింపు చర్యలు పూర్తవడం కష్టమని.. మరికొన్నాళ్లపాటు గడువు పొడిగించాలని బ్రిటన్‌ సహా పలు దేశాలు బైడెన్‌ను కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో గడువు పొడిగింపు అవకాశాలను కొట్టిపారేయలేనని ఓ దశలో ఆయన కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జాతీయ భద్రత బృందంతో బైడెన్‌ తాజాగా చర్చలు జరిపారు. ఈ నెల 31 తర్వాత కూడా అఫ్గాన్‌లో తమ బలగాలను ఉంచితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయో తెలుసుకున్నారు. గడువు పొడిగింపునకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు.  

అంతకుముందు, తరలింపు చర్యల గడువు విషయంలో అఫ్గాన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాబుల్‌లో తాలిబన్‌ రాజకీయ విభాగం అగ్రనేత అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో అమెరికా నిఘా సంస్థ- సీఐఏ డైరెక్టర్‌ విలియం జె.బర్న్స్‌ సోమవారం రహస్యంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఏం చర్చించారన్నది అధికారికంగా తెలియరాలేదు. తరలింపులకు గడువును పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు- ప్రస్తుతం కాబుల్‌ విమానాశ్రయం వద్ద తమ సైనికులు 5,800 మంది విధులు నిర్వర్తిస్తున్నారని అమెరికా జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్‌ సలివన్‌ తెలిపారు. ఈ నెల 31లోగా వీలైనంత ఎక్కువ మందిని అఫ్గాన్‌ నుంచి బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

తాలిబన్లతో రోజూ మాట్లాడుతున్నాం

తాలిబన్లను అమెరికా విశ్వసించబోదని సలివన్‌ వ్యాఖ్యానించారు. అయితే తరలింపు చర్యలకు విఘాతం కలగకుండా ఉండేందుకుగాను వారితో తమ అధికారులు రాజకీయ మార్గాల్లో ప్రతిరోజు మాట్లాడుతున్నారని తెలిపారు.  

24 గంటల్లో.. రికార్డు స్థాయిలో..

అఫ్గాన్‌ నుంచి విదేశీ పౌరుల తరలింపులో అమెరికా, దాని మిత్రపక్షాలు మరింత జోరు పెంచాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో మునుపెన్నడూ లేనంతగా ఏకంగా 21,600 మందిని కాబుల్‌ నుంచి బయటకు తీసుకెళ్లాయి.


మోదీ, పుతిన్‌ చర్చలు

దిల్లీ: తాలిబన్ల దురాక్రమణతో అఫ్గాన్‌లో తలెత్తిన సంక్షోభం, తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు చర్చలు జరిపారు. మంగళవారం వారిద్దరూ దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఉగ్రవాద భావజాలాన్ని, అఫ్గాన్‌ నుంచి ఎదురయ్యే మాదక ద్రవ్యాల సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని నేతలిద్దరూ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం.


ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌

కాబుల్‌: తాలిబన్ల చెరలో చిక్కిన అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ పౌరుల తరలింపు చర్యలు జోరుగా సాగుతున్నవేళ హైజాక్‌ కలకలం చెలరేగింది. తమ పౌరులను తీసుకొచ్చేందుకు కాబుల్‌కు పంపిన ఓ విమానాన్ని సాయుధ దుండగులు మంగళవారం హైజాక్‌ చేశారని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ఉప మంత్రి యెవ్‌జెనీ యెనిన్‌ తెలిపారు. హైజాకర్లు దాన్ని ఇరాన్‌కు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అయితే ఇంధనం నింపుకొనేందుకు ఆ విమానం తమ దేశంలోని మషద్‌లో ఆగిందని.. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లిపోయిందని ఇరాన్‌ వెల్లడించింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని